అనంతపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌గౌడు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు. కాకినాడలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తప్పుపట్టారు. మంగళవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నారో, ఏ అంశంపై మాట్లాడుతున్నారో ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడటం తగదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలు మారుతూ రాజకీయాలు చేసిన పవన్ కళ్యాణ్ వైయస్ఆర్‌సీపీని విమర్శించడం విడ్డూరంగా ఉందని రమేష్ గౌడ్ అన్నారు. వైయస్ జగన్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, ఆ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, శాంతిభద్రతల అంశాలు, అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ను విమర్శించడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.