“మాటిచ్చారు… నెరవేర్చారు”

మూలంగుమ్మి జలపాతం దుర్ఘటన బాధితులకు అండ‌గా నిలిచిన‌ వైయ‌స్ఆర్‌సీపీ 

ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున రూ.1.50 లక్షల ఆర్థిక సాయం

అరకు: గత ఏప్రిల్ 10న అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం వాలసి గ్రామ పంచాయతీ పరిధిలోని జంబువలస గ్రామ సమీపంలోని మూలంగుమ్మి జలపాతంలో ముగ్గురు గిరిజన యువతులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేత‌ల‌ను ఆదేశించారు. అధినేత సూచన మేరకు
మంగ‌ళ‌వారం హుకుంపేట మండలం బూర్జ గ్రామ పంచాయతీ జంబువలస గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మృతి చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్ర కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.50,000 చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే, ఆ ముగ్గురు ఆడబిడ్డల మృతి అత్యంత హృదయవిదారకమని పేర్కొన్నారు. వారిని తిరిగి తీసుకురాలేము కానీ, మానవతా దృక్పథంతో కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సహాయం అందించినందుకు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, జిల్లా ఉపాధ్యక్షురాలు బత్తిరి రవిప్రసాద్, మహిళా అధ్యక్షురాలు సమిడ వెంకట్ పూర్ణిమ, అరకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రేగం శివరామకృష్ణ, హుకుంపేట మండల పార్టీ అధ్యక్షుడు అనిల్, బూర్జ ఎంపీటీసీ మజ్జి హరి, సర్పంచులు, మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

Back to Top