అనంతపురం జిల్లా : వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంచ్ చేసిన డిజిటల్ బుక్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సోమవారం శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్‌ను అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్, నియోజకవర్గ పరిశీలకులు ఎల్.ఎం. మోహన్‌రెడ్డి, నేతలు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అక్రమ కేసులకు భయపడొద్దు: అనంత వెంకటరామిరెడ్డి అన్యాయాలపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. అలాంటి వారు వెంటనే డిజిటల్ బుక్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. నమోదు చేసిన సమస్యలు నేరుగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ బుక్ తో `కూటమి`కి చుక్కలే : మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ వైయస్ఆర్‌సీపీ శ్రేణులను , కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వారికి డిజిటల్ బుక్ తో అన్ని లెక్కలు సరిచేస్తామని శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ నాయకుల పైనా, కార్యకర్తల పైన దాడులు, దౌర్జన్యాలు మితిమీరి పోతున్నాయాన్నారు. ఇకపై కూటమి నాయకులు చేసే దౌర్జన్యాలను డిజిటల్ బుక్ లో నమోదు చేసి పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నిటిపై కచ్చితంగా విచారణ ఉంటుందన్నారు. అన్యాయం చేసినవారు ఎక్కడున్నా సరే ..జుట్టు పట్టి లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి పాలనలో అన్యాయాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటిని నాశనం చేస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచిందన్నారు. వారు చేస్తున్న అన్యాయాలను ఎవరు పట్టించుకోకుండా భయానక పరిస్థితులను తీసుకువచ్చారన్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. మరీ ముఖ్యంగా వైయస్ఆర్‌సీపీ పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదని కూటమి నేతలకు హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు విభాగపు జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, తరిమల గోకుల్ రెడ్డి, బొగతి ప్రతాప్ రెడ్డి, చామలూరు రాజగోపాల్, వేదాంతం నాగరత్నమ్మ ,మండల కన్వీనర్లు శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ వలీ ఖాన్, మహేష్ రెడ్డి, పూల ప్రసాద్, ఎల్లారెడ్డి, శివ శంకర్ , జడ్పీటీసీ భాస్కర్, బండ్లపల్లి ప్రతాపరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.