పోలీసుల వేధింపులే దళిత నేత ఆత్మహత్యాయత్నానికి కారణం

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు 

ప‌ల్నాడు :  కూటమి ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలపై వేధింపులు పెరిగిపోయాయని, పోలీసుల నిరంతర వేధింపుల కారణంగానే పిడుగురాళ్లకు చెందిన దళిత నాయకుడు జడ సురేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జడ సురేంద్రను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయాయని, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించే వారిని సైతం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. దళిత నాయకుడు మందా సల్మాన్ హత్య ఘటన నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, జడ సురేంద్ర జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల నుంచి నిరంతరం ఎదురవుతున్న మానసిక వేధింపులను తట్టుకోలేకే సురేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని సుధాకర్ బాబు పేర్కొన్నారు. పిడుగురాళ్ల సీఐ వెంకటరావు నిష్పక్షపాత పోలీసు అధికారిగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత సెటిల్‌మెంట్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఐని వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇటీవల విజయవాడలో గాడే సాయికృష్ణ కస్టడీ మరణం, పోలీసుల వేధింపుల నేపథ్యంలో మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతి వంటి ఘటనలు బలహీన వర్గాల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగంతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దాడులు, దూషణలు, అక్రమ ఆస్తుల స్వాధీనం, తప్పుడు కేసులతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులను గానీ, అణగారిన వర్గాలను గానీ భయపెట్టలేరని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర పల్నాడు ప్రజలకు ఉందని, జడ సురేంద్రకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Back to Top