తిరుపతి: చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జిని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి టౌన్ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మల్లం రవిచంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2023లో రైల్వే అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపిందని, ఎల్‌సీ-107 రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి మూడు నెలలు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదని భూమన అభినయ్‌రెడ్డి తెలిపారు. జూన్ 22న రైల్వే డివిజనల్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తిరుపతిలో తాగునీటి సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భూమన అభినయ్‌రెడ్డి తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని చెప్పారు. పూర్తయిన చింతలచేను రైల్వే అండర్ బ్రిడ్జిని తక్షణమే ప్రారంభించాలని, లేకుంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి భారీ మొత్తాల్లో డిపాజిట్లు అడుగుతున్నారనే అంశంపైనా ఆయన ప్రస్తావించారు.