కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్ధం 

మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌.

విద్యా రంగంలో అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలు 

ప్రైవేటుకు తరలిపోతున్న ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులు

ఇప్పటికే 4.6 లక్షల విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ల బాట

గుర్తు చేసిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

కూటమి పాలనలో విద్యా రంగం పూర్తిగా నిర్వీర్యం

నాడు–నేడు, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్‌ మాయం

అటకెక్కిన వసతిదీవెన, గోరుముద్ద, ఫీజు రీయింబర్స్‌ 

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు శాపంలా మారిన ప్రభుత్వం

ప్రెస్‌మీట్‌లో ఆదిమూలపు సురేష్‌ ఆక్షేపణ

తాడేపల్లి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసిందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాలతో విద్యార్థులు గవర్నమెంట్‌ స్కూళ్లు విడిచి, ప్రైవేటుబాట పడుతున్నారని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆక్షేపించారు. ఇప్పటికే నాలుగున్నర లక్షలకుపైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వీడారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పక్కన బెట్టి, సంస్కరణల పేరుతో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వికటించాయని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు శాపంలా మారిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో ఆదిమూలపు సురేష్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

జగనన్న విద్య పథకాలకు పాతర:
    విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో గత ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగా, టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ అటకెక్కించి, మొత్తం విద్యారంగాన్నే అస్తవ్యస్థం చేసింది. 
నాడు–నేడు (మనబడి) కార్యక్రమంతో పాటు, సీబీఎస్‌ఈ సిలబస్, ఐబీ కరికులమ్, టోఫెల్‌ శిక్షణ, ఇంగ్లిష్‌ మీడియం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు, వసతిదీవెన, గోరుముద్ద, వైయస్సార్‌ సంపూర్ణ పోషణ వంటి అన్ని పథకాలు అటకెక్కించారు. అమ్మ ఒడి పేరు మార్చి చాలా అరకొరగా అమలు చేశారు. విద్యార్థులకు భారీగా కోత పెట్టారు. రూ.15 వేలకు బదులు చాలా చోట్ల రూ.8 వేల వరకే జమ చేశారు. సబ్జెక్టు టీచర్లపై పూర్తిగా వేటు వేశారు. దీంతో గవర్నమెంట్‌ స్కూళ్ల పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు తరలిపోతున్నారు.
    విద్యా రంగంలో కూటమి ప్రభుత్వ ప్రయోగాలు, నిర్ణయాలు.. ఆ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయి. అయినా వాటిని సంస్కరణలుగా అభివర్ణిస్తున్నారు. దీంతో ఇటీవల కేంద్రం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన రాష్ట్రం చిట్టచివరలో ఉంది. ఆ విధంగా గవర్నమెంట్‌ స్కూళ్ల విద్యార్థులకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక శాపంలా మారింది.

ఉపాధ్యాయ సంఘాలు ఏం కోరుతున్నాయి?:
    ఇంకా రాష్ట్రంలో మూడో వంతు ప్రైమరీ స్కూళ్లు సింగిల్‌ టీచర్‌ స్కూళ్లుగా మారిపోయాయి. సగం పైన హైస్కూళ్లు సింగిల్‌ సబ్జెట్‌ టీచర్‌ స్కూళ్లుగా మారిపోయాయి. మరోవైపు స్కూళ్లలో టీచర్లను ఇష్టారాజ్యంగా మారుస్తూ స్కూల్‌ అసిస్టెంట్లను క్లస్టర్‌ టీచర్స్‌ కింద, ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్లుగా నియమిస్తున్నారు. సబ్జెక్ట్‌ టీచర్లే లేకుండా చేశారు. దీంతో గత మా ప్రభుత్వంలో తెచ్చిన హైస్కూల్‌ ప్లస్‌ కాన్సెప్ట్‌ కావాలని ఇప్పడు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. 

అర్ధం లేని విద్యాశక్తి యాప్‌:
    గతంలో మేం పాఠశాలలో పారిశుద్ధ్యం, ఇతర కార్యక్రమాల నిర్వహణకు యాప్‌లు పెడితే వాటిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడు మళ్లీ వారే.. అర్ధం లేని వివరాల కోసం విద్యాశక్తి అనే యాప్‌ పెట్టారు. అందులో.. పిల్లలు స్నానం చేశారా? తల దువ్వుకున్నారా? పౌడర్‌ కొట్టుకున్నారా? వంటి విషయాలు చెక్‌ చేసే స్థితికి వచ్చారు. 

బకాయిలతో విద్యా రంగం కుదేలు:
    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎనిమిది త్రైమాసికాలకు సంబంధించి రూ.5600 కోట్లు బకాయిలు ఉంటే ఎంగిలి మెతుకులు విదిలించినట్లు రూ.700 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ.900 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వసతి దీవెన కింద ఇప్పటివరకూ రూ.7100 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మంత్రిగారు బయటికి కొచ్చి తల్లితండ్రులతో మాట్లాడితే అర్దమవుతుంది. విద్యా సంస్థల్లో ఫీజు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్ధితుల్లో.. అవి చెల్లించలేక, విద్యార్ధులు పైచదువులకు వెళ్లలేక, ఇల్లూ వాకిలి అమ్ముకునే దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.

దారుణంగా మారుతోన్న స్కూళ్లు:
    2024–25 విద్యా సంవత్సరంలో సర్కారు బడుల్లో 37.1 లక్షల మంది విద్యార్ధులు ఉంటే, ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 32.6 లక్షలకు తగ్గింది. అంటే4.6 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల బాట పట్టారు. అనాలోచిత నిర్ణయాలు, ప్రయోగాల కారణంగా సర్కార్‌ బడికి మేం రాం అనే పరిస్ధితి మళ్లీ తెస్తున్నారు. నాడు–నేడు మనబడి కార్యక్రమంలో పూర్తిగా బాగు చేసిన స్కూళ్లలో, ఇప్పుడు నిర్వహణ లేక అవి మురికికూపాలుగా తయారవుతున్నాయి. నాడు రోజుకో మెనూతో అమలు చేసిన గోరుముద్ద గాడి తప్పడంతో, పిల్లలు ఇంటి నుంచి క్యారేజ్‌ తెచ్చుకోవాల్సి వస్తోంది. సక్రమ నిర్వహణ లేక ఆర్వో ప్లాంట్లు పని చేయకపోవడంతో పిల్లలు కలుషిత నీరు తాగాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆశ్రమ పాఠశాలల్లో 29 మంది విద్యార్ధులు చనిపోయారని రికార్డులు చెప్తున్నాయి.
    హోం మంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట బీసీ బాలికల వసతిగృహంలో పిల్లలతో కలిసి భోజనం చేస్తుంటే బొద్దింక వచ్చిన మాట వాస్తవం కాదా?. విద్యాకానుక కిట్లు కొన్నాళ్లకే ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి.

విద్యార్థినులపై పెరిగిపోతున్న అత్యాచారాలు:
    ఈ ప్రభుత్వం వచ్చాక అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగి పోక్సో కేసు పెట్టడానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన నాయకుల అనుచర గణం మైనర్‌ బాలిక మీద అత్యాచారం చేశారు. కాకినాడ జిల్లా తుని గురుకుల హాస్టల్లో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన 62 ఏళ్ల టీడీపీ నాయకుడికి ప్రజలే దేహశుద్ది చేసిన పరిస్ధితి. ఎన్టీఆర్‌ జిల్లా ముప్పాళ్లలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు ఆలస్యం చేశారు.అలాగే రాజమండ్రిలో పదో తరగతి విద్యార్దినిని హోటల్‌ కు తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసి వార్డెన్‌ ను సస్పెండ్‌ చేశారు. ఇలా అనేక ఘటనలు 18 నెలల్లో జరిగాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

Back to Top