తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు గృహహక్కు పత్రాల పంపిణీని సీఎం వైయస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బాండ్లను ఆయా మండల కేంద్రాలకు పంపించారు. రూ.10 వేల కోట్ల భారం తగ్గింపు ఓటీఎస్ పథకం ద్వారా సంపూర్ణ గృహహక్కు కల్పించే దిశగా 22–ఏ తొలగింపు, స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, యూజర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్ పత్రం, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సుమారు రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్ పథకాన్ని రూపొందించి అమలుచేస్తున్నారు. జిల్లాలో 1.04 లక్షల మంది ముందుకు.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటీఎస్ పథకానికి 1,43,072 మంది అర్హులు ఉండగా ఇప్పటివరకూ 1,04,524 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వీరందరికీ శాశ్వత గృహహక్కు పత్రాలు అందించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణమంతా వైయస్ఆర్ సీపీ జెండాలతో ముస్తాబైంది. భారీ కటౌట్లు, స్వాగత ఫ్లెక్సీలు అలరిస్తున్నాయి. మరోవైపు సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు కూడా కావడంతో భారీఎత్తున స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. జగనన్న సంపూర్ణ హక్కు పథకం ప్రారంభించడంతో పాటుగా.. తణుకు పట్టణంలో సుమారు రూ.171.48 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముస్తాబైన స్టాల్స్.. సభావేదిక ప్రాంతంలో గృహనిర్మాణ శాఖ, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్ పథకం వంటి స్టాల్స్‌ను ముస్తాబుచేశారు. ఫొటో గ్యాలరీ, ఓటీఎస్ లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి ఫొటో దిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. హెలికాప్టర్ ట్రయల్‌రన్ ముఖ్యమంత్రి ప్రయాణించనున్న హెలికాప్టర్ ట్రయల్‌రన్ నిమిత్తం తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాల సమీపంలోని హెలీప్యాడ్‌కు వచ్చింది. సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం హెలికాప్టర్‌లో వచ్చి స్వయంగా పరిశీలించారు. అధునాతన రీతిలో సభావేదిక హైస్కూల్ ఆవరణలో అధునాతన రీతిలో సభావేదిక, ప్రజలు కూర్చునే ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. వేదికపై భారీ స్క్రీన్స్ ఏర్పాటుచేశారు. మంత్రి శ్రీరంగనాథరాజు, సీఎం ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తణుకు, నిడదవోలు ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, జి.శ్రీనివా సనాయుడు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, హౌసింగ్ ఎండీ భరత్‌గుప్తా, జేసీ హిమాన్షు శుక్లా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పోలీసులు, ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు.