జనవరి 3న సిఎం వైయ‌స్‌ జగన్ కాకినాడ పర్యటన 

కళాక్షేత్రం, స్కేటింగ్‌ రింక్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం

పింఛను పెంపు ఇక్కడి నుంచే ప్రారంభం

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి వెల్లడి

  కాకినాడ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల 3న జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయం చెప్పారు.  వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుకను రూ.3 వేలకు పెంపుదల చేసే కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. బుధవారం ఆయన కమిషనర్‌ నాగ నరసింహారావు ఇతర అధికారులతో కలిసి సీఎంతో ప్రారంభించనున్న రాగిరెడ్డి వెంకట జయరాంకుమార్‌ కళాక్షేత్రాన్ని, స్కేటింగ్‌ రింక్‌ను సందర్శించారు. 
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశలవారీగా పింఛన్‌ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3,000కు పెంచే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభిస్తారన్నారు. ముత్తా గోపాలకృష్ణ వారధి ( కొండయ్యపాలెం ఫ్లైఓవర్‌ ), రూ 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం, రూ.7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్‌ రింక్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట స్మార్ట్‌ సిటీ ఎస్‌ఈ ఎం.వెంకటరావు, కనస్ట్రక్షన్స్‌ మేనేజర్‌ కామేశ్వర్‌, ఇతర అధికారులు ఉన్నారు.

ఏర్పాట్లపై కలెక్టర్‌ కృతికా శుక్లా సమీక్ష
 ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 3న కాకినాడ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఇలక్కియ, రెవెన్యూ, మున్సిపాలిటీ, పబ్లిక్‌హెల్త్‌, మెప్మా, డీఆర్‌డీఏ, పౌర సరఫరాలు, రోడ్డు, భవనాలు, విద్యుత్‌, ప్రజారవాణా, సమాచార పౌర సంబంధాలు, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

Back to Top