కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

రుయా, విజ‌య‌వాడ‌ ఆస్ప‌త్రుల‌ ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌దు

ఒకటి రెండు ఘటనల వల్ల  మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు 

విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి

ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే

వైద్య ఆరోగ్య శాఖ‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: కోవిడ్‌-19 నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న‌ అనంత‌రం వైద్య ఆరోగ్య శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. తిరుప‌తి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు, విజ‌య‌వాడ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకూడదని ఆదేశించారు.

ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలి. ఆరోగ్యమిత్రల కియోస్క్‌ల వద్ద ఈ నంబర్లు స్పష్టంగా డిస్‌ప్లే అయ్యేలా చూడాలి. అలాగే 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ లాంటి వాహనాలమీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలి. ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఒకటి రెండు ఘటనల వల్ల  మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్‌ ఉండాలి. విజయవాడ ఆస్పత్రి లాంటి ఘటనలు మరలా జరగకుండా కఠిన  చర్యలు తీసుకోవాలి. పోలీసులు మరింత విజిలెంట్‌గా, అప్రమత్తంగా ఉండాలి. అలసత్వం వహించారనే ఆరోపణలపైనే సీఐ, ఎస్పైలపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం అంటే.. మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్నివేళలా మంచిచేయాలి. దీనికోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. కట్టుదిట్టంగా ఉండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత గట్టిగా వ్యవహరించాలి. విద్య, వైద్యం-ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలి. ప్రభుత్వ ప్రాధాన్యతలు కూడా ఇవే`` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.  

కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ కే.ఎస్‌. జవహర్‌రెడ్డి,  వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, ఇతర ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

Back to Top