మంచి మనిషి మనమధ్య లేకపోవడం బాధాకరం

స్వర్గీయ రోశయ్య సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో కొనసాగారు 

మహానేత వైయస్‌ఆర్, రోశయ్య మంచి స్నేహితులు

ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నా

మరణించిన సభ్యులందరికీ సభ ద్వారా సంతాపం తెలిపిన సీఎం వైయస్‌ జగన్‌

అసెంబ్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ రోశయ్య మృతి బాధాకరమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రోశయ్య మృతిపై సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడి దశ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ముఖ్యమంత్రి, చివరగా గవర్నర్‌గా సుదీర్ఘకాలం రోశయ్య ప్రజాజీవితంలో కొనసాగారన్నారు. ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా, కొనియాడే మనిషిగానే మెలిగారన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారని, వైయస్‌ఆర్, రోశయ్య మంచి స్నేహితులుగా ఉండేవారని గుర్తుచేశారు. అలాంటి మంచి మనిషి మనమధ్య లేకపోవడం బాధాకరమని, రోశయ్య ఆత్మకు శాంతికలగాలని మనసారా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 

సభ ద్వారా వారికి సంతాపం..
అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తి, వీ.వీ.ఎస్‌.ఎస్‌ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర్‌కృష్ణారెడ్డి, గారెపాటి సాంబశివరావు, శ్రీమతి టీ.ఎన్‌. అనసూయ, వేణుగోపాలరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్లపాటి వెంకట్‌రెడ్డి వీరందరి మృతికి సభ ద్వారా సంతాపం తెలియజేశారు. 

Back to Top