కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర మూడో రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభమైంది. పెంచికలపాడు శిబిరం వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. సీఎం వైయస్ జగన్ కోసం ప్రజలు భారీగా తరలివచ్చి మేమంతా సిద్దం అంటూ నినదిస్తున్నారు. సీఎం వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్ ఖాన్, డా.జరదొడ్డి సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉన్నారు. పెంచికలపాడు నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకుంటుంది. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సాయంత్రం 3 గంటలకు పాల్గొని సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్ కి దగ్గరలో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.