విశాఖ: ‘‘ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ వంద శాతం సామాన్యుల గురించి ఆలోచిస్తూ అభివృద్ధి – సంక్షేమ ప్రయాణాన్ని ఒక్క జగనన్న పాలనలోనే చూస్తున్నాం. ఇవాళ విశాఖ కేజీహెచ్ కార్పొరేట్ ఆస్పత్రిని తలపిస్తోంది. పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లాలో హెల్త్ సెంటర్‌కు వెళ్లినా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇవే ఆస్పత్రులకు వెళ్లాలంటే భయమేసేది. ఇక ప్రభుత్వ స్కూళ్లు అయితే అద్భుతం. అక్కడ చదివే పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. చక్కటి యూనిఫారంలో బూట్లు, టై ధరించి వెళ్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. మన విద్య, వైద్య రంగాలు ఎంతో బాగుపడ్డాయి. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలవా?’’ నవరత్నాలతో దాదాపు రూ.3 లక్షలు లబ్ధి పొందిన విశాఖలోని సాగర్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నరసింగరావు అంతరంగం ఇది! పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ సంక్షేమం – అభివృద్ధి బాటలో సాగుతున్న వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలనలో ఏ రంగాన్ని చూసినా మెరుగుపడ్డ పరిస్థితులే కనిపిస్తున్నాయి. గతంలో ఇద్దరు వ్యక్తులు కలిస్తే తమ సమస్యలు, కష్టాలపై చర్చించుకునేవారని ఇప్పుడు ప్రభుత్వం అందిస్తున్న సాయంపై మాట్లాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్రలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. శ్రీకాకుళంలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలను వేధిస్తున్న కిడ్నీ సమస్యకు సీఎం వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపించారు. ఇక్కడ నెలకొల్పిన నీటిశుద్ధి ప్రాజెక్టుతో 800కి పైగా గ్రామాల ప్రజల ఆరోగ్యానికి భరోసానిచ్చారు. తరతరాల కష్టాలకు విముక్తి కల్పించిన ఈ నీటిని అమృత జలంగా అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా పలాసలో రూ.74 కోట్లతో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇక్కడి బాధితులకు మెరుగైన సేవలు అందిస్తోంది. శరవేగంగా పనులు జరుగుతున్న మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర ప్రజల ఉపాధికి భరోసా కల్పించనుంది. చరిత్రలో నిలిచిపోయే ఈ మూడు ప్రాజెక్టులు శ్రీకాకుళం జిల్లాకు వచ్చాయంటే సీఎం జగన్ చొరవతోనే సాధ్యమైందని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలోని కిడ్నీ బాధితులు విశాఖలోని కేజీహెచ్‌కు వెళ్లేవారు. ఇప్పుడు వ్యయ ప్రయాసలు లేకుండా స్థానికంగా ఉత్తమ చికిత్స అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళంను అభివృద్ధి పథంలో సాగుతున్న జిల్లాగా మార్చారని పేర్కొంటున్నారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుచేశారు. విశాఖ, కాకినాడ జిల్లాలో వచ్చిన పరిశ్రమలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోందని ఆనందం వ్యక్తమవుతోంది. గొప్ప పాలకుడు.. నాకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రాకున్నా మా కాలనీలో చాలా మందికి అందుతున్నాయి. పిల్లలకు నాణ్యమైన చదువులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో నా వయసు వాళ్లు పెన్షన్ కోసం వ్యయ ప్రయాసలు, పడిగాపులు కాసిన రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు వలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాల గురించి చక్కగా వివరిస్తున్నారు. అర్హత ఉంటే అందరికీ ఇప్పిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత గొప్ప పాలకుడిని చూడలేదు. – రంధి వరలక్ష్మి, కొమ్మాది (విశాఖపట్నం) ఇంతకంటే ఏం కావాలి? వైయస్ జగన్ సీఎం కాకముందు ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయో నాకు బాగా తెలుసు. గతంలో ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి పెన్షన్ తెచ్చుకునేందుకు వృద్ధులు అవస్థలు పడుతూ వెళ్లడం చూశా. ఇప్పుడు ఏ ఇంటికి ఏది కావాలన్నా వలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారు. శ్రీకాకుళం జిల్లాకు ఆయన చేసిన మేలు ఎవరూ చేయలేదు. మూలపేట పోర్టు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ రాకతో పాటు ఉద్ధానం ప్రజలకు జీవితాన్ని ప్రసాదించారు. నా భర్త ఉద్యోగ రీత్యా మాకు సంక్షేమ పథకాలు రావు. కానీ నా చుట్టూ ఉన్నవారు ఆ పథకాలతో ఆనందంగా ఉన్నారు. ఇంతకంటే కావాల్సిందేముంటుంది? – పి. సంతోషిమణి, శ్రీకాకుళం జగన్ అద్భుత పాలన అందించారు మేం ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేశాం. మాకు ప్రభుత్వ పథకాలకు అర్హత లేదు. మా నివాస ప్రాంతంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న భారీ డ్రైనేజీ సమస్యను ఈ ప్రభుత్వం రూ.కోటి వెచ్చించి పరిష్కరించింది. సచివాలయాలు, వలంటీర్ లాంటి విప్లవాత్మక వ్యవస్థలను తెచ్చింది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్షతో ఇంటికే వైద్య సేవలు అందిస్తోంది. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలు బలోపేతమయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. సీఎం వైయస్ జగన్ అద్భుత పాలనతో ఎన్నో గొప్ప పథకాలు తీసుకువచ్చారు. ఇలాంటి నాయకుడి వెంట ఉండడం సంతృప్తినిస్తుంది. – పైలా పుష్పవతి, రిటైర్డ్ ఉద్యోగి, మధురవాడ పార్టీలకు అతీతంగా పథకాలు నా ఆదాయం రీత్యా ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించకున్నా సీఎం వైయస్ జగన్ పాలనలో సామాన్యుల జీవితాలు బాగుపడ్డాయి. గతంలో విజయనగరం జిల్లా ప్రజలు అత్యవసర వైద్య సేవలు కోసం కేజీహెచ్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల రావడంతో స్థానికులకు ఇక్కడే మెరుగైన వైద్యం అందుతోంది. ఎక్కువ మంది మెడిసిన్ చదువుకునేందుకు అవకాశం లభించింది. జేఎన్‌టీయూ కూడా వచ్చింది. ఇక సంక్షేమమంటారా.. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఇప్పుడు విజయనగరం చాలా అభివృద్ధి చెందింది. తాగునీటి సమస్య లేదు. రోడ్లు మెరుగుపడ్డాయి. – ఎల్వీఆర్ నాయుడు, విజయనగరం