శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో అన్ని వర్గాలనూ ఆదుకుందని, అన్ని వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రైతులు,మహిళల అభ్యున్నతికి,ఆర్థిక ప్రగతికి దోహదపడే నిర్ణయాలు తీసుకుందని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారు సమాజంలో ఎదిగేందుకు అన్ని విధాలా సహకారం అందించి, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునే విధంగా చేశామని చెప్పారు. గారమండలం, బూరవెల్లి గ్రామాన మంత్రి ధర్మాన ప్రచారం నిర్వహించారు. అనంతరం శాలిహుండం,బోరవాని పేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేం పాలించిన ఈ ఐదు సంవత్సరాలూ ప్రతి గడపకూ వచ్చాం. మేం పాలించిన ఈ ఐదేళ్లూ మీతోనే మమేకం అయ్యాం. మీ సమస్యేంటో ప్రతిదీ తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేశాం. అధికారం ఇచ్చారు కదా అని ఏరోజూ మీకు దూరంగా మేం లేము. ఎప్పటికప్పుడు కలుస్తునే ఉన్నాం. మీకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా అందించగలిగాం. బ్రోకర్లు లేకుండా,లంచాలు లేకుండా డైరెక్టుగా మీ అకౌంట్లకే డబ్బులు వేశాం. అవినీతి రహిత పాలనను అందించాం. ముఖ్యంగా పథకాల అమలులో కులం చూడలేదు. మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. మీ ఇంటిపై మా పార్టీ జెండా కట్టారా లేదా అన్నది కూడా చూడలేదు. పథకాల వర్తింపునకు అర్హతే ప్రామాణికంగా అమలు చేశాం. దాని వల్ల మీ కుటుంబంలో మీ జీవనం హాయిగా సాగింది. ఎవరికీ తలవంచకుండా జీవించేందుకు వీలుగా పాలన సాగించాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. పరిపాలనను గ్రామంలోకి తీసుకుని వచ్చాం. ఎవ్వరికీ తలవంచకుండా మీ పనులన్నింటినీ చేసే విధంగా పాలన తీసుకుని వచ్చాం. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చాం. ఇవన్నీ ఈనాడు ఐదు సంవత్సరాలు మీరంతా తీసుకు వచ్చిన పార్టీ వల్ల సాధ్యం అయింది. వైయస్ జగన్ పాలనలో మహిళలంతా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే.. ఇంట్లో ఉండే ప్రతి మహిళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటన్నవి చూసి, అవేంటో తెలుసుకుని,ఆ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చాం. తమ పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి వర్తింపజేశాం. 45 ఏళ్లు దాటిన మహిళలకు చేయూత పథకం ద్వారా ఏడాదికి 18,750 రూపాయలు అందించాం. అదే మహిళ అరవై ఏళ్లు దాటితో ప్రతి నెల మూడు వేల రూపాయలు అందించే కార్యక్రమం చేశాం. సామాజిక పింఛన్ల పేరిట వీటిని అందించాం. ఆలోచించండి ఎవరి వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు చెబుతున్నారు చంద్రబాబు.. నేను అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని అంటున్నారు. మరి ! ఆ రోజు పథకాల అమలును చూసి అర్థపర్థం లేని ఆరోపణలు చేశారే ? ఇదే పెద్ద మనిషి 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తానని,డ్వాక్రా రుణాలు మీ తరఫున తానే కడతానని మాట ఇచ్చి ఎన్నికయ్యారు. ఆ ఎన్నిక తరువాత ఆయన ఇచ్చిన మాటలు ఏవీ అమలు చేసిన దాఖలాలే లేవు. ఆ రోజు మాట తప్పిన వ్యక్తి చంద్రబాబు. ఆ రోజు రైతుల రుణాలు తీరుస్తానని అన్నారు. తాకట్టు పెట్టిన బంగారం తీసుకు వస్తానని చెప్పిన వ్యక్తి తరువాత ఆ మాటలన్నీ మరిచిపోయారు. హామీలన్నీ గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్న మొత్తాలు కన్నా ఎక్కువ మొత్తాలు అందిస్తానని చెబుతున్నారు. మళ్లీ హామీలతో మీ ముందుకు వస్తున్నారు చంద్రబాబు. మీరు వారిని నమ్మవద్దు. చంద్రబాబు నాయుడు,తెలుగు దేశం పార్టీ ఏమనుకుంటాయి అంటే ఓటు వేయించుకునేందుకు ఏదో ఒకటి చెబుదాం అని అనుకుంటారు. ఓటు వేయించుకున్నాక ఆ మాటలు అన్నీ మరిచిపోతారు. దానికి కారణం ఒక్కటే ఎన్నికకూ,హామీకూ సంబంధం లేదని అనుకుంటారు. కానీ ఎన్నికైన ప్రభుత్వం వలనే మన జీవితాలు బాగుపడతాయి అని నిరూపించిన ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ఇబ్బందులు పెడితే ఏ కుటుంబాన్నీ విడిచిపెట్టకుండా వారికి అవసరం అయినటువంటి అన్ని రకాల సౌకర్యాలూ కల్పించి ఆ మహమ్మారిని ఎదుర్కొన్న రాష్ట్రం ఈ దేశంలోనే మరొకటి లేనేలేదని విన్నవిస్తున్నాను. తొమ్మిది నెలలు మీ ఇళ్లకు నిత్యావసర సరకులు అందించిన ప్రభుత్వం ఇది. మీరెవ్వరయినా ఫలానా ఇవ్వమని అడిగారా ? అడగలేదు. కానీ ఏ కుటుంబం ఏ కష్టంతోనూ బాధపడకూడదని తలచి,ప్రజాక్షేమం కోసం నిరంతరం పనిచేసే మనస్తత్వం అతనిది.(జగన్ ది). నిన్నమొన్ననే మీ గ్రామాలకు డాక్టర్ల బృందం వచ్చింది. ఎందుకు వచ్చిందో మీరు గమనించారా ? హాస్పిటల్ కు వెళ్లలేక, ఉన్నటువంటి జబ్బు చెప్పుకోలేక,హాస్పిటల్ కు తీసుకువెళ్లేందుకు ఎవరూ లేక భయపడ్డటువంటి కుటుంబాలకు వారి ఊరిలోనే ఓ శిబిరం ఏర్పాటు చేసి,వారి అవసరం తీర్చే పని చేద్దాం అని వైద్యులు ఇక్కడికి వచ్చారు. బూరవెల్లి గ్రామ రైతులకు మనవి చేస్తున్నాను. వంశధార ప్రాజెక్టు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ వలన రిజర్వాయర్ నిండి,వేసవిలో అంటే మే నెలలో కూడా పిట్టలు ఎండకు చనిపోతున్నాయి అనేటటువంటి పరిస్థితిలో కూడా బూరవెల్లి మీదుగా చల్లని వంశధార నీళ్లు ప్రవహించే విధంగా కృషి చేస్తాను. ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఈ వర్షా కాలానికి పూర్తయితే రిజర్వాయర్ నింపే పని పూర్తి చేస్తాం. వచ్చే వేసవికి మీకు వంశధార నీళ్లు అందిస్తాం. ఇంతకన్నా ఈ ప్రభుత్వం ఏం చేయాలని అడుగుతున్నాను. ఒకవేళ మీరెవ్వరయినా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఎందువల్ల వ్యతిరేకిస్తున్నారో చెప్పండి..మా తప్పులు ఉంటే దిద్దుకుంటాం అని మనవి చేస్తున్నాను. అందువల్ల ఈ విషయాలన్నింటినీ మీరు గమనించండి..ఈ విషయాలను మీ బంధువులతో స్నేహితులతో పంచుకోండి. చంద్రబా బు మాటలను నమ్మవద్దు. అందులో నిజం లేదు. కేవలం అధికారం దక్కించుకోవాలన్న యావ తప్ప మరొకటి లేదు.. అని విన్నవిస్తున్నాను. ఈ ఐదేళ్లలో ఇరవై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడూ ఏ ప్రభుత్వం చేపట్టనటు వంటి కార్యక్రమం. ఇది పేదవాళ్ల కలలను సాకారం చేసిన కార్యక్రమం. ఇలాంటి ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టుకోవాలని నన్నూ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.