గ్రామీణ ఆర్థిక, మహిళా సాధికారతకు ‘పాల వెల్లువ’ ఊతం

కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌

2022 సెప్టెంబర్‌ నాటికి 17,629 గ్రామాల నుంచి పాల సేకరించేలా ప్రణాళికలు 

అమూల్‌ సంస్థకు పాడి రైతులే యజమానులు

ఇప్పటివరకు 168.50 లక్షల లీటర్ల పాల సేకరించిన అమూల్‌

పాడి రైతులకు రూ.71 కోట్ల చెల్లింపు.. రూ.10 కోట్ల అదనపు ఆదాయం

పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే అమూల్‌ నంబర్‌ వన్, ప్రపంచంలో 8వ స్థానం

అమూల్‌ రాకతో పాడి రైతులకు అదనపు ఆదాయం

గత ప్రభుత్వం సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి.. రైతులను మోసం చేసింది

ఇవన్నీ మార్చేందుకు మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా అడుగులేస్తోంది

తాడేపల్లి: ‘‘మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. జగనన్న పాల వెల్లువ గ్రామీణస్థాయిలో ఆర్థిక సాధికారత, మహిళా సాధికారతకు ఊతమిస్తుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం 5 జిల్లాల్లో పాల వెల్లువ కొనసాగుతోందని, ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న వెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌ నుంచి 5 జిల్లాల్లో ఇప్పటి వరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి అమూల్‌ సంస్థ 168.50 లక్షల లీటర్లు పాలను సేకరించి, దాదాపు రూ.71 కోట్లను చెల్లించిందన్నారు. అమూల్‌ రావడం ద్వారా పాడి రైతులకు రూ.10 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. 

కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయం నుంచి  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు పాడి రైతులను, మహిళా రైతులను, అమూల్‌ సంస్థ, డెయిరీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘కృష్ణా జిల్లాలో పాలసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న సబర్‌కాంత మిల్క్‌ యూనియన్‌ ప్రతినిధి డాక్టర్‌ బీ.ఎం.పటేల్‌కు కృతజ్ఞతలు. 

ఏ రంగమైనా కొనేవాడు ఒక్కడే.. అమ్మేవారు అనేకమంది ఉంటే.. దాన్ని బయ్యర్స్‌ మోనోపొలి అంటారు. కొనేవారు ఎంత చెబితే అంతకు అమ్మేవారు ఇవ్వాల్సిన పరిస్థితి. కొనేవారు ఒకరికంటే ఎక్కువ ఉంటే ధర అనేది వారందరూ కట్టగట్టుకొని ఇంతరేటుకే కొంటాం. ఇంతకంటే ఎక్కువ ఇవ్వమనే  పరిస్థితి ఉంటే.. అలాంటి మార్కెట్‌లో అమ్మేవారికి అన్యాయమే జరుగుతుంది. ఇలాంటి మార్కెట్‌ మన రాష్ట్రంలో చూశాం. 

ఇటువంటి పరిస్థితిని మార్చాలని మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. ఏపీ పాల వెల్లువ ద్వారా కృష్ణా జిల్లాలో ఈరోజు నుంచి రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుంది. అమూల్‌ ప్రారంభించిన ఏడాదిలోపే 5 జిల్లాల్లో ఇప్పటికే పాడి రైతులకు, అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తూ.. ఈరోజు 6వ జిల్లాలోకి పాల వెల్లువ పథకం అమలవుతుంది. మిగిలిన 7 జిల్లాల్లో కూడా రాబోయే రోజుల్లో ఉధృతంగా ముందుకు కదులుతుంది. 

మన రైతులు అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టే.. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ప్రభుత్వమే మార్కెట్‌లోకి ఎంటర్‌ అయ్యింది. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే దళారులకు సవాల్‌ విసిరాం. తక్కువ రేటుకు ఉత్పత్తులు అమ్ముకోవడానికి వీల్లేదని, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడంతో.. దళారులు అంతకంటే ఎక్కువ ధరలకు ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత రెండున్నరేళ్లుగా అనేక ఉత్పత్తులను మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌ ద్వారా కొనుగోలు చేసి.. రైతులకు తోడుగా నిలబడ్డాం. 

ధాన్యం, కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇటువంటి వాటికి మాత్రమే కాకుండా పాడి రైతులకు కూడా ఎలా అన్యాయం చేయాలనే ఆలోచనతో అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు వేశాం. ఆ దిశగానే అమూల్‌ను తీసుకువచ్చాం. అమూల్‌ అనేది కంపెనీ కాదు.. పాడి రైతుల సమూహమే అమూల్‌. పాలుపోసే రైతులే అమూల్‌కు యజమానులు. పాల నుంచి చాక్లెట్లు తయారు చేసే స్థాయికి ఎదిగిన సంస్థ. వచ్చే లాభాలను పాడి రైతులకే అందజేస్తారు. అటువంటి అమూల్‌ను తీసుకువచ్చాం. 

అమూల్‌ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైయస్‌ఆర్‌ జిల్లాలో 149 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 203 గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి ఇప్పటికే పాల సేకరణ చేస్తోంది. ఆయా జిల్లాల్లో 1046 గ్రామాల నుంచి పాలు సేకరిస్తుండగా.. 2022 సెప్టెంబర్‌ నాటికి 17,629 గ్రామాల నుంచి పాల సేకరించే విధంగా పూర్తిగా ప్రణాళికలు రచించాం. గత ఏడాది డిసెంబర్‌ నుంచి 5 జిల్లాల్లో ఇప్పటి వరకు 30,951 మంది మహిళా పాడి రైతుల నుంచి 168.50 లక్షల లీటర్లు పాల సేకరణ అమూల్‌ సంస్థ చేసింది. దాదాపు రూ.71 కోట్లను చెల్లించింది. 

ఇతర డెయిరీలతో పాల సరఫరా చేస్తే వచ్చే ఆదాయం కంటే.. 10 కోట్ల రూపాయలు అదనంగా వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అమూల్‌ రావడంతో అక్కచెల్లెమ్మలకు రూ.71 కోట్లు ఇవ్వడంతో రూ.10 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్‌ పాల వెల్లువ ద్వారా గ్రామీణస్థాయిలో ఎకనామిక్‌ ఎంపర్‌మెంట్, మహిళా ఎంపర్‌మెంట్‌కు ఊతమిస్తుంది. 

కృష్ణా జిల్లాలో పాల సేకరణకు 264 గ్రామాలను ఎంపిక చేయగా.. ఆయా గ్రామాల్లో 37,474 మంది పాడిరైతులను గుర్తించడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా 51 కేంద్రాల్లో పాల సేకరణ మొదలుపెట్టి.. వారం రోజుల్లోనే 18,414 లీటర్ల పాలను సేకరించాం. 941 మంది పాడి రైతులకు రూ.8.15 లక్షల బిల్లులు చెల్లించడం జరిగింది. రైతులకు అదనంగా ప్రతి లీటర్‌పై ఏకంగా రూ.20 పైచిలుకు లాభం వచ్చింది.

చాట్రాయి మండలం సోమవరం గ్రామానికి చెందిన పి. వెంకటనర్సమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు పాలుపోయగా.. లీటర్‌కు రూ.44.08 గిట్టుబాటు అయ్యింది. అమూల్‌ పాల వెల్లువ కేంద్రానికి పాలుపోయగా.. లీటర్‌కు రూ.74.78 వచ్చాయి. లీటర్‌ పాలపై ఆమె దాదాపుగా 20 నుంచి 30 రూపాయలు అదనంగా సంపాదించింది. 

మన రాష్ట్రంలో ఎందుకీ పరిస్థితి ఉంది. అమూల్‌ వస్తే తప్ప అక్కచెల్లెమ్మలకు మెరుగైన రేటు రాని పరిస్థితి ఎందుకు ఉంది. అమూల్‌ వస్తే తప్ప మోసాలకు అడ్డుకట్ట పడదూ అనే పరిస్థితి ఎందుకు మన రాష్ట్రంలో ఉందన్న విషయాలను అందరం ఆలోచన చేయాలి. 

నా పాదయాత్రలో ప్రతిజిల్లాలో పాడి రైతులు, అక్కచెల్లెమ్మలు అందరూ వచ్చి కలిశారు. చాలా సందర్భాల్లో ఒక లీటర్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ. 23.. లీటర్‌ పాల ధర కూడా రూ.23 మాత్రమే ఇస్తున్నారు. ఏరకంగా బతకగలుగుతామని దాదాపుగా ప్రతి జిల్లాలో మాటలు చెప్పారు.. ఇదే బహిరంగ సభల్లో కూడా ప్రస్తావించాను. అధికారంలోకి వచ్చిన తరువాత అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకొని పాల సేకరణ చేపట్టాం. 

అమూల్‌కు మిగతా సంస్థలకు మధ్య తేడా ఏమిటీ అనేది అందరం గుర్తుపెట్టుకోవాలి. పాల నుంచి చాక్లెట్లు తయారుచేసే గొప్ప వ్యవస్థ అమూల్‌కు ఉంది. పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే మొదటి స్థానం.. ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న సంస్థ అమూల్‌. దీనికి యజమానులు అంటూ ఎవరూ ఉండరు.. పాలుపోసేవారే యజమానులు. అంతేకాకుండా మిగిలినవారితో పోల్చితే.. అమూల్‌ సంస్థ పాలకు ధర అధికంగా ఇస్తుంది. ఈ కంపెనీలో వాటాదారులంతా అంతా పాడిరైతులే. లాభాపేక్ష అనేది అమూల్‌కు లేదు. సంస్థ గడించే లాభాలన్నీ సంవత్సరానికి ఒకసారి తిరిగి అక్కచెల్లెమ్మలకు ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్‌లోనే ఉంది. 

అధిక ధరలు చెల్లించడంతో పాటు పాల బిల్లులను కూడా కేవలం 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల అక్కచెల్లెమ్మలకు అందరికీ ఆర్థికంగా మరింత మంచి జరుగుతుంది. సంవత్సరంలో కనీసం 182 రోజులు పాలుపోసిన మహిళా పాడిరైతులకు అమూల్‌ ద్వారా ఏడాది చివర్లో ప్రతి లీటర్‌పై 50 పైసలు బోనస్‌గా చెల్లిస్తున్నారు. అంతేకాకుండా నాణ్యమైన దాణాను కూడా తక్కువ ధరకే సరఫరా కూడా చేస్తుంది. 

సహకార రంగ డెయిరీలో మంచివి కొన్నింటిని ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ప్రైవేట్‌ ఆస్తుల కింద, ప్రైవేట్‌ సంస్థల కింద నడుపుకుంటున్నారు. ప్రభుత్వంలోని వ్యక్తులు ప్రైవేట్‌ డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు మంచి ధరలు ఇప్పించాలనే తపన చూపించలేదు. ఇవన్నీ మార్చాలని మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా రకరకాల కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. మహిళా పాడిరైతులను, సహకార సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా.. ఆయా గ్రామాల్లో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు ప్రతి మహిళా డెయిరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణ చేయడం కోసం ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం. 

రూ.979 కోట్లతో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, 12,883 ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్ల నిర్మాణం కోసం రూ.16 వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది. ఎక్కడా మోసానికి తావులేకుండా ఉంటుంది. రైతులకు ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి.. దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ధిపొందుతున్న వారికి పాడి మార్కెట్‌లో దిక్కుతోచడం లేదు. అమూల్‌ రావడంతో వారు కూడా రేట్లు పెంచుతున్నారు. ఏ కారణంతోనైనా పెరిగినా అదొక మంచి పరిణామం. అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top