నేను విన్నాను..ఉన్నాను అన్న మాట‌ను నిజంచేశా

 రైతు దినోత్స‌వ స‌భ‌లో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

రైతు బాగుకోసమే నా తపన, తాపత్రయం

జలయజ్ఞంతో రాష్ట్ర రూపురేఖలు మార్చిన ఘనత వైయస్‌ఆర్‌ది

ఈ ఒక్కరోజే రైతుల కోసం రూ.1570 కోట్లతో శంకుస్థాపనలు చేశాం

రెండేళ్లలో రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చాం

రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతుకు అండగా నిలిచాం

విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్బీకేలు తోడుగా ఉంటాయి

రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్‌ తీసుకొస్తాం

నీటిని రాజకీయాలకు వాడుకోవద్దు.. ఏ ప్రాంతానికి ఎంతో అందరికీ తెలుసు

తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే ఆరోజున గాడిదలు కాసావా చంద్రబాబూ..?

ఏ రాష్ట్రంతో మాకు విభేదాలు వద్దు.. సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటా

అనంతపురం:  నా 3648 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌లో రైతుల క‌ష్టాలు క‌ళ్లారా చూశాన‌ని, ఆ రోజు నేను విన్నాను..ఉన్నాను అని చెప్పిన మాట‌లు అధికారంలోకి వ‌చ్చాక నిజం చేశాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల‌కు ఏ క‌ష్టం రాకుండా ఈ రెండేళ్ల‌లో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి వారికి తోడుగా నిలిచామ‌న్నారు. మనది రైతుపక్షపాత ప్రభుత్వమని, రెండేళ్లలో రైతుల కోసం రూ.8,670 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడ్డామని సీఎం వైయ‌స్‌ జగన్‌ తెలిపారు. ఆర్‌బీకేల ద్వారా రైతుల‌కు విత్త‌నం నుంచి పంట అమ్ముకునే వర‌కు చేయి ప‌ట్టి న‌డిపిస్తున్నామ‌న్నారు.   రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయదుర్గంలో ఏర్పాటు చేసిన రైతు సభలో సీఎం వైయ‌స్ జగన్ ప్ర‌సంగించారు.

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  తాను బతికున్నంత కాలం రైతుల గురించి ఆలోచన చేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసా, వాచ, ఖ‌ర్మ‌న‌ కోరుకున్నారు. ఆ దిశగా అడుగులు వేసిన ఆ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది.

ఆ రోజు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే తీగలు చూపించి, బట్టలు ఆరేసుకోవడానికే పని కోస్తాయని అపహాస్యం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్‌ఫైల్‌పై సంతకం చేశారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పెంపు, విత్తనాల ధరలు తగ్గింపు, విద్యుత్‌ చార్జీల తగ్గింపు, జలయజ్ఞంతో రాష్ట్రం రూపురేఖలు మార్చేశారని సగర్వంగా తెలియజేస్తున్నాం. మహానేతను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రెండేళ్లు కూడా మన పరిపాలన కూడా రైతుల పక్షపాతంగా సాగిందని సగర్వంగా తెలియజేస్తున్నా. గర్వంగా చెబుతున్నాను..రైతుల పక్షపాత ప్రభుత్వంగా పని చేసింది కాబట్టే..ఈ రెండేళ్లలో మన ప్రభుత్వం రైతులపై అక్షరాల రూ. 8670 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నాను. ఈ రోజు రూ.1500 కోట్లతో రైతుల కోసం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. 

ఏడాదిన్నరగా కోవిడ్‌ కారణంగా రాష్ట్రమంతా కూడా అతలకుతలం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం, రెవెన్యూ పెను సవాళ్లుగా మారాయి. ఎక్కడా కూడా మీ బిడ్డ రాజీ పడలేదని సగర్వగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి ఉన్న కష్టాల కంటే రైతులకు ఉన్న కష్టాలు ఎక్కువ, అక్క చెల్లెమ్మలకు ఉన్న కష్టాలు ఎక్కువ, పేదవాళ్లకు ఉన్న కష్టాలే ఎక్కువని భావించి రాజీ పడకుండా పథకాలు అమలు చేస్తున్నాను.

ఈ రోజు గ్రామ స్థాయిలోనే పూర్తిగా రూపురేఖలు మారుస్తూ..రైతుల గురించి ఇంత లోతుగా ఆలోచన చేసిన పరిస్థితి ఎప్పుడూ కూడా జరగలేదు.ఈ రోజు మీ అందరితో కూడా ఒక విషయం చెప్పాలి. మనసు పెట్టి రైతుల గురించి ఆలోచన చేశాం కాబట్టే ఈ రోజు రైతుల బాగోగుల గురించి ఆలోచన చేశాం కాబట్టే..పాదయాత్రలో రైతుల కష్టాలు చూశాను..విన్నాను..నేను ఉన్నానని చెప్పిన మాటలకు ఈ రోజు నిజం చేశాను.

రైతు అనే వ్యక్తి ఎక్కడ కష్టాలు పడుతాడు. ఎందుకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు ఎలా తీర్చాలని అడుగులు వేశాం. ఎన్నికల ప్రణాళికలో రైతులకు ఇవన్నీ చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. రైతుల కష్టాలను నా కళ్లారా చూశాను. రైతులకు పంట వేసేటప్పుడు పెట్టుబడుల వల్ల కష్టాలు వస్తాయి. పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ పోతున్న సమయంలో కష్టం వస్తుంది. రెండో కష్టం..రైతు కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు పడుతున్న అవస్థలు పాదయాత్రలో చూశాను. రైతులు ఒట్టి వ్యవసాయంపై ఆధారపడితే ఆదాయం తక్కువే. అదనపు ఆదాయం కలుగజేస్తేనే మేలు జరుగుతుందని భావించాం. రైతులకు చిట్ట చివరిగా పంట వేసిన తరువాత అకాల వర్షానికో..కరువుతో రైతు నష్టపోతే..అలాంటి సమయంలో రైతుతల్లడిల్లిపోతున్న పరిస్థితులను కళ్లారా చూశాను. వీటికి సమాధానం ఇస్తూ అడుగులు వేస్తున్నాం.

ఇందులో భాగంగానే రైతులకు పంట పడించేనాటికి జూన్‌లో వర్షాలు మొదలు అయ్యే సమయానికి వారి కష్టాలు తీర్చేందుకు పెట్టుబడి సాయం అందించేందుకు ఎప్పుడు, ఎక్కడ జరగని విధంగా ప్రతి రైతుకు రైతు భరోసా కింద రూ.13,500 ఇవ్వడం మొదలుపెట్టాం. జూన్‌లో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, ధాన్యం ఇంటికి వచ్చే సమయంలో రూ.2 వేల చొప్పున అందజేస్తూ రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గించే విధంగా అడుగులు వేశాం. 

ఈ రాష్ట్రంలో 1.25 ఎకరాలు అంటే అరహెక్టార్‌ లోపు ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టార్‌ దాకా ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. ఇలాంటి రైతులకు రూ.13,500 డబ్బులు ఇస్తే కనీసం 80 శాతం పెట్టుబడి ఖర్చుకు సాయం చేసినట్లు ఉంటుందని ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. రెండేళ్లలో ఈ పథకం కింద 52.38 లక్షల మందికి సాయం చేశాం.

ఈ రోజు ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాలు విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి సందర్భంలోనూ రైతును చేయి పట్టి నడిపిస్తున్నాయి. తోడుగా ఉంటున్నాయని గర్వంగా చెబుతున్నాను. ఆర్‌బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, నాణ్యతతో కూడిన ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతున్నాయి. రైతులకు ఏ కష్టం రాకూడదు. ఎవరూ మోసం చేసే పరిస్థితి రాకూడదని నేరుగా విత్తనాల దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులను ఆర్‌బీకేల ద్వారా మీ ఇంటి పక్కనే అందజేస్తున్నాం.

ఇదే జిల్లాలోనే అక్షరాల 2.30 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అందజేశాం. ఏ ఒక్కరికి కష్టమనిపించకుండా విత్తనాలు సులభంగా అందజేశాం. గతంలో విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. క్వాలిటీతో కూడిన విత్తనాలు అందజేస్తున్నాం. ఇలాంటి ఆర్‌బీకేలను చూసి గర్వపడుతున్నాను.

రైతు తాను వేసిన పంట ఎక్కడ వేశాడు. ఏ పంట అన్నది ఈ రోజు మీ గ్రామంలోనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది. ఈ–క్రాపింగ్‌ ద్వారా రైతులకు నేరుగా పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, పంట కొనుగోలు కూడా ఆర్‌బీకేల ద్వారానే జరుగుతున్నాయి. ఆర్‌బీకేల పరిధిలోనే అగ్రికల్చర్‌ బోర్డు మీటింగ్‌లు జరుగుతున్నాయి. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి బోర్డు మీటింగ్‌లు జరుగుతున్నాయి. ఏ విత్తనం వేయాలి, ఏది వేయకూడదు, ఎలాంటి విత్తనాలు వేయాలని క్రాప్‌ ప్లానింగ్‌లు ఈ మీటింగ్‌లో చర్చించి, సూచనలు, సలహాలు ఇస్తున్నాయి.

ఆర్‌బీకే స్థాయిలోనే రైతులకు పనిముట్లు అందజేస్తున్నాం. అగ్రికల్చర్‌ డిసైడ్‌ చేసిన రేట్లకే అద్దెకు ఇస్తున్నాం. రైతులకు తోడుగా ఆర్‌బీకేలు ఉన్నాయి. పంట అమ్ముకోలేని పరిస్థితి రైతులకు సంభవిస్తే..ఆర్‌బీకేల వద్దకు వెళ్తే కనీస గిట్టుబాటు ధరల పట్టిక ఉంటుంది. అక్కడే సీఎం యాప్‌ ఉంటుంది. వెంటనే విలేజ్‌ అగ్రికల్చరర్‌ అసిస్టెంట్‌ మాకు మేసేజ్‌ పెడితే మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్, జిల్లా కలెక్టర్‌ స్పందిస్తారు. వెంటనే పంటలు కొనుగోలు చేస్తారు. 

రైతులకు ఈ రెండేళ్లలో రూ.6,600 కోట్లు ఖర్చు చేశాం. రూ.30 వేల ధాన్యం కొనుగోలు మినహాయింపులు పక్కన పెట్టి, కేవలం ఇతర పంటలు కంది, బొప్పాయి, అరటి, చీని, పొగాకు వంటి పంటలకు రూ.6,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు అండగా నిలిచాం. రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టి ..వారు ఇబ్బందులు పడకూడదని అడుగులు ముందుకు వేశాం. రైతుల ఆదాయం పెంచేందుకు చేయూత, ఆసరా పథకాలు తెచ్చాం, అమూల్‌ లాంటి సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకుని లీటర్‌ పాలకు అదనంగా రేట్లు పెంచి కొనుగోలు చేయిస్తున్నాం. రాష్ట్రంలో 2 వేల చోట్ల పాల సేకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ కూడా రైతులకు తోడుగా ఉంటున్నాం.

 ఈ మధ్య కాలంలో పేపర్లు, టీవీలు చూస్తే..నీళ్ల విషయంలో గొడవలు చూస్తున్నాం. ఇదే విషయం గురించి చెప్పాలంటే..చంద్రబాబు ఇన్నాళ్లు మౌనంగా ఉంటూ ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే..దశాబద్ధాలుగా ఏపీ కలిసి ఉంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ఈ మూడు కలిస్తే ఆంధ్రప్రదేశ్‌ అని గొప్పగా చెప్పుకునేవాళ్లం. ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు అని వాటాలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం నీళ్లు ఇస్తున్నాం. రాష్ట్ర విభజన తరువాత కేంద్రం ప్రభుత్వం 2015 జూన్‌ 19న నీటి కేటాయింపులపై సంతకాలు చేశారు. రాయలసీమకు 144 టీఎంసీలు, ఇలా మూడు ప్రాంతాల‌కు మొత్తంగా 819 టీఎంసీలు అని పంపకాలు చేశారు. 
ఈ రోజు ఒక్కటే అడుగుతున్నా. రాయలసీమ పరిస్థితి గమనించండి. పోతిరెడ్డిపాడు నుంచి కిందకు నీల్లు రావాలంటే శ్రీశైలంలో 880 అడుగులు ఉండాలి. శ్రీశైలం ఫుల్‌ కేపాసిటి 880 అడుగులు. ఈ రెండేళ్లు పక్కన పెడితే..గత 20 ఏళ్ల లెక్కల్లో 880 అడుగుల పైకి నీరు కేవలం 20 రోజులకు మించి లేదు. ఫుల్‌గా నీళ్లు డ్రా చేయాలంటే ఎలా?.పక్క రాష్ట్రం కేపాసిటికి పెంచి నీటిని తీసుకుంటున్నాయి. 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు జనరేట్‌ చేస్తోంది. 800 అడుగుల లోపులో మీకు కేటాయించిన నీటిని వాడుకుంటున్నారు. మేం నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఉంది. అదే 800 అడుగుల్లో మాకు హక్కుగా మాకిచ్చిన నీటిని వాడుకుంటే తప్పేంటి? చంద్రబాబుకు ఇంకా ఘాటుగా చెబుతున్నా..ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే..గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు , అటువైపు కేసీఆర్‌ సీఎంగా ఉంటూ పాలమూరు, డిండి ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాశారా? ఈ రోజు మనం 800 అడుగుల్లో లిప్ట్‌ పెట్టుకుని మన వాటా నీళ్లు తీసుకుంటుంటే ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వైయస్‌ జగన్‌ కోరుకునేది ఒక్కటే పక్క రాష్ట్రంతో విభేదాలు వద్దు, సస్సంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. సఖ్యత ఉండాలని మనసారా వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వైయస్‌ జగన్‌ వేలు పెట్టలేదు. కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా వేలు పెట్టడు అని చెబుతున్నాను. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని, రైతులకు ఇంకా మంచి చేసేందుకు అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను.
రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు లబ్ధి చేకూర్చే బైరవాని తిప్ప ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం కలెక్టర్లతో మాట్లాడాను. మరో 60 రోజుల్లో భూసేకరణ పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపాదిన పూర్తి చేస్తాం. రెండు నియోజకవర్గాలకు మంచి చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నాం.

హంద్రీనీవా 36ఏ ప్యాకేజీ వర్క్స్‌ కూడా రిజూమ్‌ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. 
ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఈ ప్రాంతం మేలు చేసేందుకు ఆంజనేయస్వామి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. 

39 గ్రామాలకు తాగునీరు ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయమని ఆదేశించాను.త్వరలోనే శుభవార్త వెలుబడుతుందని చెబుతున్నాను. రైతులకు మంచి జరగాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కూలీ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనసారా నమ్మిన మీ బిడ్డకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Back to Top