వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌

వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

అవసరమైన చోట సహాయక శిబిరాలు తెరవండి

శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు కుటుంబానికి రూ.2 వేల చొప్పున తక్షణసాయం

పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి

ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయి

తాగునీరు కలుషితం కాకుండా, పారిశుద్ధంగా బాగుండేలా చర్యలు తీసుకోవాలి

వరద నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలను సేకరించి నివేదిక పంపించాలి

తాడేపల్లి: రాష్ట్రంలో వర్షాలు, వరద ప‌రిస్థితుల‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎడతెరిపిలేని వర్షాల నేప‌థ్యంలో సీఎం వైయస్‌ జగన్‌ అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని, జూలైలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదలు వచ్చాయన్నారు. రేపు ఉదయానికి వరద పెరిగి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. 

వ‌ర‌ద‌ల వ‌ల్ల సంభ‌వించే పరిస్థితులను అడ్డుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మహారాష్ట్రలో భారీ వర్షాలతో గోదావరికి వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. వరద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వీఆర్‌పురం, కూనవరం, అమలాపురం, వేలేరుపాడులో 4 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కంట్రోల్‌ రూమ్‌లు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. 

అవసరమైన చోట వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్నారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు తక్షణసాయంగా అందించాలని, ఆ సాయం వారికి ఉపయోగపడుతుందన్నారు. 

పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసర మెడిసిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధం బాగుండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 

విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరెంట్‌ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోండి. తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాల‌ని సూచించారు. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, అంబేడ్క‌ర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వరద నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలను సేకరించి నివేదిక పంపించాలని కలెక్టర్లు, అధికారులకు సూచించారు. 

Back to Top