ముగిసిన సీఎం వైయ‌స్ జగన్‌ ఢిల్లీ పర్యటన

  న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతికి బయల్దేరారు. శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. 

రెండు రోజులు పాటు తిరుమలలో పర్యటన
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.00 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట నుంచి  రోడ్డుమార్గంలో తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5.27 గంటలకు పద్మావతి గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అన్నమయ్య భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

సాయంత్రం 6.15 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం చేరుకుని అక్కడి నుండి శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని రాత్రి 7.40 గంటలకు శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు.  గురువారం ఉదయం 6.15 గంటలకు పద్మావతి అతిధి గృహం నుండి బయలుదేరి.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు నాద నీరాజనం సుందర కాండ పారాయణ  కార్య క్రమంలో పాల్గొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల నుండి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నవరం తిరుగు ప్రయాణం అవుతారు.  

కాగా సీఎం జగన్‌ ఇవాళ ఉదయం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.
 

తాజా వీడియోలు

Back to Top