పులివెందుల ప్రజలకు సదా రుణపడి ఉంటా

323 ఎకరాల్లో జగనన్న కాలనీ, రూ.147 కోట్లతో అభివృద్ధి

పులివెందుల, బ్రాహ్మణపల్లిలో మొత్తం 8,042 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.10 లక్షల చొప్పున ఆస్తిని పెడుతున్నాం

జగనన్న కాలనీ సమీపంలోనే ఇండస్ట్రీయల్‌ కారిడార్‌

వాక్‌ టు వర్క్‌.. నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగం చేసుకొని ఆనందంగా ఇంటికిరావొచ్చు

మొట్టమొదటి ఆక్వా హబ్‌ను పులివెందులలో ప్రారంభిస్తున్నాం

రాష్ట్రంలో 70 ఆక్వాహబ్‌లు, 14 వేల రిటైల్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నాం

రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ 2022 జూన్‌ నాటికి పూర్తి 

2023 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వైయస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల 

రూ.100 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్, సివరేజ్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నాం

ఆ 7 గ్రామాలకు నీటి సరఫరా కోసం రూ.1100 కోట్లతో పనులు చేపట్టాం

అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. త్వరలోనే ఫలాలు అందుతాయి

పులివెందుల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పులివెందుల: ‘‘పులివెందుల ప్రజల ప్రేమానురాగాలు, ఆప్యాయతల వల్లే జగన్‌ అనే నేను.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసే స్థితిలో ఉన్నాను. మీకు సదా రుణపడి ఉంటాను. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ ఏర్పాటవుతుంది. ఈ కాలనీ చూసి.. దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని నాకిచ్చినందుకు చాలా సంతోషం కలిగింది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇంటి స్థలం పట్టాలు గత డిసెంబర్‌ 25న అందాల్సి ఉన్నా.. గిట్టనివారు రకరకాల కోర్టు కేసులు, ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో.. చిక్కుముడులన్నీ విప్పుకొని ఈ క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పులివెందులలో 7,309 మందికి, బ్రాహ్మణపల్లిలో 733 మందికి, మొత్తం 8,042 అక్కచెల్లెమ్మల చేతుల్లో ఒక్కొక్కరికీ దాదాపు రూ.10 లక్షల ఆస్తిని పెడుతున్నామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

పేదల సొంతింటి కలను నిజం చేస్తూ పులివెందులలో 323 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అంతకు ముందు కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఇంటి పట్టా విలువ, ఇళ్ల నిర్మాణం, పులివెందుల నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పథకాల గురించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రజలకు వివరించారు. 

బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

కాలనీలో ఇంటి పట్టా విలువ రూ.2 లక్షలు, నిర్మాణానికి రూ.2 లక్షలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 7 ప్రాథమిక పాఠశాలలు, 15 ఎకరాల్లో మంచి పార్కు, పోలీస్‌ స్టేషన్, పోస్టాఫీస్, 10 ఎకరాల్లో ప్లే గ్రౌండ్‌ ఏర్పాటవుతున్నాయి. 

కాలనీలో నీటి సరఫరాకు రూ.28 కోట్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.45 కోట్లు, రోడ్ల నిర్మాణానికి రూ.69 కోట్లు.. మొత్తం 147 కోట్లు మౌలిక వసతులకు ఖర్చుచేస్తున్నాం. 7,400 ఇళ్లకు రూ.147 కోట్లు సగటున పంచుతే మరో రూ.2 లక్షలు వీటి కోసం ఇస్తున్నాం. ప్రతి పేదవాడికి ప్రభుత్వం తరఫున మనం ఇచ్చే ఇంటి స్థలానికి రూ. 2 లక్షలు, ఇల్లు కట్టడానికి రూ. 2 లక్షలు, రోడ్లు, డ్రైనేజీ, వసతుల కల్పనకు మరో రూ.2 లక్షలు.. కట్టడానికే 6 లక్షలు ఖర్చు చేస్తున్నామంటే.. ఇవన్నీ పూర్తయిపోతే.. వీటి విలువ కనీసం రూ. 10 లక్షలు ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో పెట్టినట్టు అవుతుంది. 

7,309 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. పక్కనే బ్రాహ్మణపల్లిలో మరో 733 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గత డిసెంబర్‌ 25న అందాల్సి ఉన్నా.. గిట్టనివారంతా రకరకాల కోర్టు కేసులు, ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో చిక్కుముడులు అన్నీ విప్పుకొని ఈ రోజు క్రిస్మస్‌ సందర్భంగా పులివెందులలో 7309 మందికి, బ్రాహ్మణపల్లిలో 733 మందికి, మొత్తం 8,042 అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ ఆస్తిని పెడుతున్నాం.

ఈ కాలనీకి పక్కనే ఇండస్ట్రీయల్‌ పార్కును తీసుకువచ్చాం. ఈ మధ్యకాలంలో అపాచీ అనే సంస్థను తీసుకువచ్చాం. దాదాపుగా 2 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఆదిత్య బిర్లా గ్రూపు శంకుస్థాపన చేశాం. మరో సంవత్సరకాలంలో ప్రాజెక్టు పూర్తవుతుంది. మొదటి దఫా కింద 2,200 ఉద్యోగాలు ఇస్తారు. ఇళ్ల కార్యక్రమాలు అయిపోయిన వెంటనే వాక్‌ టు వర్క్‌.. నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగాలు చేసుకొని ఆనందంగా తిరిగి ఇంటికి రావొచ్చు. ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. 

ఈరోజు కొన్ని శంకుస్థాపనలు చేశాం.. కొన్నింటిని ప్రారంభించడం జరుగుతుంది.

– పులివెందులలో మార్కెట్‌ యార్డుకు సంబంధించి రూ.10.50 కోట్లతో అభివృద్ధి చేసిన వాటిని ప్రారంభిస్తున్నాం. 
– చీని రైతుల సౌకర్యం కోసం 6 వేల టన్నుల చీని నిల్వ చేసే విధంగా రూ.4.79 కోట్లతో నిర్మించిన షెడ్‌ను కూడా ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. 
– పులివెందులతో పాటు పెద్దమడియం, కాశినాయన మండలాల్లో నూతన పోలీస్‌ స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. పులివెందులలో స్మార్ట్‌ పోలీస్‌ స్టేషన్, పోలీసులకు డార్మెట్రీ కూడా ప్రారంభించనున్నాం. 

పులివెందులలో ఆక్వాహబ్‌..
నిజంగా నేను ఎప్పుడూ అనుకోలేదు. చేపలు, రొయ్యలకు సంబంధించిన దుకాణాలు కూడా వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. పులివెందులతో పాటు పరిసర ప్రాంత వాసులకు చేపలు, రొయ్యలు మొదలైన మత్స్య సంపదను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఆక్వా హబ్‌ను పులివెందులలో ప్రారంభిస్తున్నాం. నియోజకవర్గంలో వందకు పైగా ఫిష్‌ కియాస్క్‌.. రిటైల్‌ షాపులు రాబోతున్నాయి. 

దీని వల్ల జరిగే మంచి ఏంటంటే.. 
రాష్ట్రంలో 70 ఆక్వాహబ్‌లు పెడుతున్నాం. 14 వేల రిటైల్‌ షాపులు ఏర్పాటు చేస్తున్నాం. చేపలు, రొయ్యలు పండించే రైతులకు గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం గట్టి చర్య తీసుకునేందుకు వీలుంటుంది. చేపలు, రొయ్యలు తింటే ఆరోగ్యంగా ఉండే పరిస్థితి పులివెందుల ప్రజలకు కూడా దక్కుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పరిస్థితి ఏర్పడుతుంది. 

పులివెందుల నియోజకవర్గంలో వివిధ పనులకు సంబంధించిన పురోగతి..

– వైయస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల. దీని కోసం రూ.500 కోట్ల అంచనా వ్యయంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 500 పడకల మెడికల్‌ కాలేజీ 2023 డిసెంబర్‌ నాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తాం. 
– కొత్త డిపో, బస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. రూ.34.20 కోట్లతో చేపడుతున్న ఈ కార్యక్రమం 2022 నాటికి డిసెంబర్‌ నాటికి పనులు పూర్తవుతాయి. డిపో, బస్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తుంది. 
– పులివెందులలో శిల్పారామం ఆధునీకరణ కోసం రూ.13 కోట్లు కేటాయించాం. వచ్చే ఏప్రిల్‌ నాటికి పనులు పూర్తిచేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. 
– పులివెందులలో ఇంటిగ్రేడెట్‌ స్పోర్ట్స్‌ కాంపెక్స్‌ కోసం ఏకంగా రూ.18 కోట్లు వెచ్చించాం. పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. 2022 జూలై నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. 
– పులివెందులను మంచి నగరంగా తీర్చిదిద్దాలంటే మంచి పార్కులు ఉండాలని ఉలిమెళ్ల సరస్సును ఆహ్లాదకరంగా చేసేందుకు, పార్కును, సరస్సును అభివృద్ధి కోసం రూ.44 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 2022 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. 
– పులివెందులలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ తీసుకువచ్చి, సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.100 కోట్లతో చేపట్టిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతాయి. 
– రూ.65 కోట్లతో చేపట్టిన పులివెందుల సమగ్ర నీటి సరఫరా పథకాన్ని వచ్చ ఏడాది మే నాటికి పూర్తి చేసి.. నీటి సరఫరా చేయడం జరుగుతుంది. 
– నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కాలేజీల్లో అదనపు వసతుల కోసం రూ.10.59 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. 2022 మే నాటికి పూర్తవుతాయి. 
– రూ.1.20 కోట్లతో పులివెందులలో ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తయింది. 
– జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో లెక్చర్‌ హాల్‌ కాంపెక్స్, ఇన్నొవేషన్, స్టార్టప్‌ సెంటర్‌ అన్నీ ఏర్పాటవుతున్నాయి. పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యార్థుల కోసం ఇండోర్‌ స్టేడియం కూడా నిర్మిస్తున్నాం. అక్షరాల రూ.20.70 కోట్లతో చేపడుతున్న ఈ పనులన్నీ 2023 మార్చి నాటికి పూర్తిచేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకువస్తాం. 
– నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 8 మార్కెటింగ్‌ గిడ్డంగులు నిర్మించే కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. 2022 మార్చి నాటికి పూర్తవుతాయి. ఇందు కోసం రూ.9.20 కోట్ల వెచ్చిస్తున్నాం. 
– అరటి రైతుల కోసం ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్, శీతల గిడ్డంగి రూ.13 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2022 డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. 
– ఇడుపులపాయలో పర్యాటక సర్క్యూట్‌తో పాటు వైయస్‌ఆర్‌ స్మారక గార్డెన్‌ పనులు కొనసాగుతున్నాయి. రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులన్నీ 2022 మార్చి నాటికి పూర్తవుతాయి. 
– వేంపల్లిలో అండర్‌ గ్రౌండ్‌డ్రైనేజీ కోసం రూ.92 కోట్లతో పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టి 2023 జూలై నాటికి పూర్తి చేస్తాం. 
– వేంపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టే డిగ్రీ కాలేజీ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టి 2023లో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిచేస్తాం. 
– గండి శ్రీవీరాంజనేయస్వామి పునఃనిర్మాణం కోసం రూ.14.50 కోట్లు ఖర్చు చేసి.. 2023 జూన్‌ నాటికి పూర్తవుతుంది. 
– వేంపల్లిలో బాలుర, బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాల కొత్త భవనాలు 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. వాటి నిర్మాణం కోసం రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
– వేంపల్లిలో పాలిటెక్నిక్‌ కాలేజీలో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రూ.10కోట్లతో చేపడుతున్న ఈ పనులన్నీ 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. 
– వేంపల్లిలో ఉర్దూ జూనియర్‌ కాలేజీ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అవి కూడా 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. ఉర్దూ కాలేజీ కోసం దాదాపు రూ. 5 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
– సింహాద్రిపురంలో డ్రైనేజీ పనులు కూడా 2022 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తాం. ఇందు కోసం రూ.14 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. 
– సింహాద్రిపురంలో పాలిటెక్నిక్‌ కాలేజీలో అదనపు తరగతి గదులతో పాటు మంచి ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం రూ.5 కోట్లు వెచ్చించాం. 2022 ఏప్రిల్‌ నాటికి ఇవి కూడా పూర్తవుతాయి. 
– పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్‌ గ్రిడ్‌ (సమగ్ర నీటి సరఫరా వ్యవస్థ) పనులు 2022 జూన్‌ నాటికి పూర్తవుతాయి. 

– గాలేరు నగరి సృజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి హంద్రీనీవా సృజల స్రవంతి కాల్వ వరకు నీటిని తరలించే ఎత్తిపోతల పథకం జరుగుతుంది. పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాలకు ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. రూ.5,036 కోట్లతో చేపడుతున్న ఈ కార్యక్రమ పనులు ప్రారంభమయ్యాయి. 2023 జూన్‌ నాటికి పూర్తిచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 

– యురేనియం తవ్వకాల ద్వారా ప్రభావితమయ్యే వేముల మండలంలోని 7 గ్రామాలకు నీటి సరఫరా కోసం చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎ్రరబెల్లి చెరువు వరకు నీటిని తరలించే కార్యక్రమం రూ.1100 కోట్లతో చేస్తున్నాం. పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. 2023 ఏప్రిల్‌ నాటికి పనులన్నీ పూర్తిచేస్తాం. 

– గండికోట నుంచి వచ్చే నీటిని 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు నింపడం కోసం చేపడుతున్న ఎత్తిపోతల పథకానికి కాస్త అడ్డంకులు వచ్చాయి. రైతులు భూసేకరణకు ఇష్టపడటం లేదు కాబట్టి సమస్య వచ్చింది. ఈలోగా ఉన్న కెనాల్‌ను డీపిన్‌ చేసి, కెపాసిటీ పెంచే విషయంగా అధ్యయనం చేయమని మరోసారి అధికారులకు చెప్పాం. 

– పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ), గండికోట ఎత్తిపోతల పథకం (జీకేఎల్‌ఐ), చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సీబీఆర్‌) వీటికి సంబంధించిన కుడి కాల్వ పరిధిలో 1.22 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్‌ పరిధిలోకి తీసుకురావడం కోసం దాదాపు రూ.1250 కోట్లతో చేపట్టిన పనులు.. దీంట్లో 1200 సంప్స్‌ కట్టాల్సిన పరిస్థితుల్లో ఇప్పటికి 40 సంపులు పూర్తికావొస్తున్నాయి. మిగిలిన సంపులు కట్టేందుకు రైతుల దగ్గర నుంచి కాస్త భూసేకరణ విషయంలో సహాయ, సహకారాలు కావాలి. ఇది చేసుకోగలిగితే.. పులివెందులలో ప్రతి ఎకరా సస్యశ్యామలం అవుతుంది. రైతులు సహకరించాలని కోరుతున్నా. 

– వేముల, వేంపల్లి మండలాల్లో పీబీసీ కాల్వ చివరి టేల్‌పాండ్‌ గ్రామాల్లో ఆయకట్టు స్థిరీకరణ కోసం అల్వల్‌పాడు వద్ద రూ.56.83 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం చేపట్టడం జరుగుతుంది. ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభమవుతాయి. శరవేగంగా చేయిస్తాం. 

– పులివెందుల మోడల్‌ టౌన్‌ ప్రాజెక్టులో భాగంగా.. గరండాలవంక అభివృద్ధి, రింగ్‌రోడ్డు సెంట్రల్‌ మ్యూజియం పనులు, రిలయన్స్‌ పెట్రోల్‌ బంకు నుంచి కదిరి రూట్‌లో రోడ్డు విస్తరణ పనులు, అహోబిలపురంలో మోడల్‌ స్కూల్‌ నిర్మాణం, మార్కెట్‌ పనులు మొదలయ్యాయి. సిటీసెంట్రం, రాణితోపు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, షాపింగ్‌ కాంప్లెక్స్, సిటీజన్‌ సర్వీస్‌ సెంటర్, స్లాటర్‌ హౌస్‌ తదితర పనులు అతిత్వరలోనే మొదలవుతాయి. 

– పులివెందుల పరిసర మండలాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం పులివెందుల పట్టణంలో కొత్త గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీని కూడా తీసుకువస్తున్నాం. వేంపల్లి జూనియర్‌ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నాం. ఈ రెండూ ఈరోజు తీసుకున్న నిర్ణయం. 

– పులివెందుల అభివృద్ధి విషయంలో ఏనాడూ, ఎప్పుడూ వెనకంజ వేయలేదు. ప్రేమ, మమకారంతో పులివెందుల ప్రజలకు ఎప్పుడూ మంచి జరగాలని ఆరాటం, తపన పడ్డాను. కాలనీలో ఇళ్ల పట్టాలను 18 కౌంటర్లలో అందజేయడం జరుగుతుంది. ఇల్లు నిర్మాణ పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులంతా పట్టాలు తీసుకోవాలని కోరుతున్నా.
 

Back to Top