మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు తీర‌నున్న సొంతింటి క‌ల‌

నేడు `జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్‌షిప్స్` ప్రారంభం

లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

మొదటి విడతలో 3,894 ప్లాట్లు అన్ని వసతులతో సిద్ధం

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ.. ధరలో 10% చెల్లించి ప్లాట్‌ బుకింగ్‌ 

ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు 

తాడేప‌ల్లి: మధ్య తరగతి ప్ర‌జ‌ల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో నగర, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు (ఎంఐజీ) అందుబాటులోకి వస్తున్నాయి. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైయ‌స్ఆర్‌ జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లను ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. ఎంఐజీ లేఅవుట్ల‌ను, కొనుగోలుకు రూపొందించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు.

మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద వేసిన లేఅవుట్‌లో తొలి విడతలో 538 ప్లాట్లు వేసినట్లు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఈ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయాల‌నుకొనే వారు https://migapdtcp.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటరైజ్డ్‌ విధానంలో పూర్తి పారదర్శకతతో లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయిస్తారు. ప్రతి లే అవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లను కేటాయించడంతో పాటు 20 శాతం రిబేటు కూడా ప్రకటించారు. దరఖాస్తు సమయంలో మొత్తం ప్లాటు ధర చెల్లించినవారికి ఐదు శాతం రాయితీ ఇస్తారు. పట్టణ నగర పాలక సంస్థల పరిధిలో ఉండే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ప్లాట్లకు ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉంది.

క్లియర్‌ టైటిల్‌ డీడ్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం (డీటీసీపీ) అనుమతితో పాటు అన్ని వసతులతో వీటిని తీర్చిదిద్దారు. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలకు అనుగుణంగా వేసిన ఈ ప్లాట్లను రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే కేటాయిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు మొత్తం ప్లాట్‌ ధరలో 10% ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ప్లాట్‌ను కేటాయించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో ఆన్‌లైన్‌లో చెల్లించాలి. కొనుగోలు ఒప్పందం కుదిరిన నెల రోజుల్లోపు 30%, ఆరు నెలల్లో మరో 30%, మిగిలిన 30 % నగదును ఏడాదిలోగా చెల్లించాలి.

తక్కువ ధరకే అన్ని వసతులతో ప్లాట్లు.. 
మొదటి విడతలో 3,894 ప్లాట్లను అన్ని వసతులతో సిద్ధం చేశారు. మార్కెట్‌ ధరకంటే ఈ ప్లాట్ల ధరలు తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. వీటికి మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మొత్తం ప్లాట్లు, చదరపు గజం ధర ఇలా.. 

లే అవుట్ల ప్రత్యేకతలు.. 
న్యాయపరమైన సమస్యలు లేని స్పష్టమైన టైటిల్‌ డీడ్‌తో ప్రభుత్వమే వేస్తున్న ఈ లే అవుట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తి పర్యావరణ హితంగా మొత్తం లే అవుట్‌లో 50 శాతం స్థలాన్ని మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు కేటాయించారు. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్, తాగునీటి సరఫరా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వ్యవస్థ, వరద నీటి డ్రెయిన్లు, పూర్తి విద్యుదీకరణ, వీధి దీపాలు వంటి వసతులు కల్పిస్తున్నారు.

పార్కులు, ఆట స్థలాలు, సామాజిక భవనాలు, ఆరోగ్య కేంద్రం, వాణిజ్య సముదాయం, బ్యాంకుతో పాటు ఇతర సామాజిక అవసరాల మేరకు ప్రత్యేక స్థలాలు కేటాయిస్తున్నారు. లేఅవుట్‌ నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్, పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త నిర్వహణలో అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసే ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఎలాంటి వసతులు, అవసరాల కోసమైనా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ నిధులు వెచ్చించవచ్చు.

Back to Top