అక్కచెల్లెమ్మల జీవితాలు చాలా గొప్పవి

కుటుంబంలో సంతోషం నింపేది వారి చిరునవ్వే

అగ్రవర్ణాల్లోని పేదలకు మంచిచేయాలనే తపనతో ‘వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం’

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం కాకపోయినా అమలు చేస్తున్నాం

రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ వర్గాలకు ఆర్థికసాయం

ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల సాయం

3.93 లక్షల మంది అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ

అంబేడ్కర్‌ కలలు కన్న రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నాం

నామినేటెడ్‌ పదవుల్లో సింహభాగం అక్కచెల్లెమ్మలకే కేటాయించాం

శాసనమండలి తొలి మహిళా వైస్‌ చైర్మన్, రాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర తొలి దళిత మహిళా హోంమంత్రి స్థానాల్లో నా చెల్లెమ్మలు

కార్పొరేషన్ చైర్మ‌న్‌, డైరెక్టర్‌ మొత్తం 1356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే

అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది.. రాష్ట్రం బాగుంటుంది

‘వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం’ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ‘‘గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కాదు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ జీవితచరిత్రలు కూడా గొప్పవి. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. వారి ముఖంలో చిరునవ్వు ఉంటేనే కుటుంబంలో సంతోషం ఉంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తిగా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మహిళా సాధికారత దిశగా మన ప్రభుత్వం ముందడుగు వేస్తోంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చెప్పకపోయినా, మేనిఫెస్టోలో పొందిపర్చిన వాగ్దానం కాకపోయినా.. అగ్రవర్ణాల్లోనే పేదలకు మంచి జరగాలనే సంకల్పంతో ‘వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం’ పథకానికి రిపబ్లిక్‌ డే ముందు రోజున శ్రీకారం చుడుతున్నామన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియ, వెలమ, తదితర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ.. దాదాపు 3.93 లక్షల మంది మహిళలకు రూ.589 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాల్లో మొత్తంగా రూ.45 వేలు అందజేస్తామన్నారు. ఆ అక్కచెల్లెమ్మలు ఆర్థిక సాధికారతకు, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే సంకల్పంతోనే వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
దేవుడి దయతో రిపబ్లిక్‌ డేకు ఒకరోజు ముందుగానే మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన దేశాన్ని మన రాజ్యాంగ ప్రకారం మనల్ని మనం పాలించుకునే రోజు ప్రారంభమైంది జనవరి 26వ తేదీన. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటికి 72 సంవత్సరాలు పూర్తయి.. 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులు అర్పిస్తూనే.. అందులోని గొప్ప ఆశయాలకు అద్దంపడుతూ మన అడుగులు ముందుకువేస్తున్నాం.

మూడేళ్ల పాటు రూ.45 వేలు..
మన ప్రభుత్వ రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రతి అడుగు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేడ్కర్‌ కలలు కన్న రాజ్యాంగ స్ఫూర్తిని అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కొనసాగిస్తూనే అడుగులు ముందుకుపడుతున్నాయి. అదే స్ఫూర్తితో వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు.. వారికి కూడా మంచి జరగాలి.. జరిగించే దిశగా అడుగులుపడాలని దాదాపు 3.93 లక్షల మంది మహిళలకు రూ.589 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియ, వెలమ, తదితర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ.. ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాల్లో మొత్తంగా రూ.45 వేలు అందజేస్తాం. 

అన్నగా, తమ్ముడిగా మంచిచేసే బాధ్యత..
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానం కాదు. అయినా కూడా ఈబీసీ అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని, పేదలు అక్కడ కూడా ఉన్నారని, పేదలకు మంచి జరగాలనే తపన, తాపత్రయంతో ఆర్థికంగా, రాజకీయంగా మద్దతు పలుకుతూ వారికి కూడా మంచి అన్నగా, తమ్ముడిగా మంచిచేసే బాధ్యతను తీసుకుంటూ వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నాం. 

వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా..
ఇప్పటికే వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.75 వేలు అందించడంతో పాటు అమూల్, రిలయన్స్, ఐటీసీ, యూనిలివర్, ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, అలానా, మహేంద్ర ఇటువంటి కంపెనీలతో అనుసంధానం చేసి.. బ్యాంకులను కూడా అనుసంధానం చేసి వారికి అండగా నిలబడే అడుగులు వేశాం. 

కాపు నేస్తం ద్వారా..
వైయస్‌ఆర్‌ కాపు నేస్తం అనే పథకం ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయస్సు గల కాపు, బలిజ, ఒంటరి వర్గాలకు చెందిన దాదాపు 3.27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగేలా ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తూ ఆర్థిక స్వాలంబనకు తోడుగా ఉన్న ప్రభుత్వం మనది అని మీ బిడ్డలా, మీ అందరికీ అన్నగా, తమ్ముడిగా, మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

33 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు
ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపుగా 3.93 లక్షల మందికి ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తూ.. రాష్ట్రంలో 45–60 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక అమలవుతుంది. ప్రతి నెలా రూ.2500 చొప్పున సంవత్సరానికి రూ.30 వేల లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో 45–60 సంవత్సరాల మధ్యలో గల ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ.. దాదాపుగా 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వం తోడుగా నిలబడుతుందని సగర్వంగా మీ కుటుంబ సభ్యుడిగా తెలియజేస్తున్నాను. 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు అంటే దాదాపుగా కోటి మందికి లబ్ధి జరుగుతుంది. 

అమ్మఒడి ద్వారా..
జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 44.5 లక్షల మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మేలు జరిగే విధంగా ప్రతి ఏటా రూ.6500 కోట్లు ఇస్తున్నాం. రెండు సంవత్సరాల కాలంలో రెండు దఫాల్లో రూ.13,023 కోట్లు ఇప్పటికే అందించడం జరిగింది. 

పెన్షన్‌ కానుక..
వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ద్వారా మొత్తంగా 61.73 లక్షల మంది పెన్షనర్లు ఉంటే అందులో 36.70 లక్షల మంది అవ్వలకు, అక్కలకు మంచి జరిగేలా నెలనెలా రూ.2500 పెన్షన్‌ అందిస్తూ.. సంవత్సరానికి రూ.30 వేల చొప్పున వారి చేతుల్లో పెడుతూ తోడుగా నిలబడగలిగాం. 

వైయస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా..
వైయస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా మొత్తం 78.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. గత ప్రభుత్వం డబ్బులు కడతామని డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలను మోసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన పరిస్థితుల్లో 18.36 శాతం నాన్‌పర్ఫామింగ్‌ అసెట్స్, అవుట్‌స్టాండింగ్‌ లోన్స్‌ కింద వారంతా ఏ గ్రేడ్‌ నుంచి సీ, డీ గ్రేడ్‌లోకి పరిస్థితుల నుంచి వారందరినీ చెయ్యి పట్టుకొని వైయస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా మంచి చేసే దిశగా అడుగులు వేశాం. రూ.25,517 కోట్లు నాలుగు దఫాల్లో వారికి ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో ఇప్పటికే రెండు దఫాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు విడతల్లో అక్షరాల రూ.12,758 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. ఈ రోజు అక్కచెల్లెమ్మల నాన్‌పర్ఫామింగ్‌ అసెట్స్, అవుట్‌స్టాండింగ్‌ అకౌంట్స్‌ కేవలం .73 శాతానికి మాత్రమే తగ్గి ఉన్నాయంటే.. ఏరకంగా అభివృద్ధి జరిగింది. మహిళా ఎంపవర్‌మెంట్‌ జరిగిందని చెప్పడానికి నిదర్శనం ఇది. 

32 లక్షల ఇళ్ల పట్టాలు..
వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల ద్వారా అక్షరాల 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 32 లక్షల మంది అంటే దాదాపుగా 1.20 కోట్ల మంది మేలు జరిగే గొప్ప కార్యక్రమం. రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి ఒకేసారి లబ్ధి జరుగుతుంది. ఇప్పటికే ఇళ్ల స్థలాల పట్టాలు అందించాం. మొదటి దశ 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే మొదలైంది. ఇళ్ల నిర్మాణం పూర్తయితే 32 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.5 నుంచి రూ.10 లక్షల ఆస్తి వారి చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. అక్షరాల రూ.2 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టిన గొప్ప కార్యక్రమానికి మీ బిడ్డ శ్రీకారం చుట్టాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ అమలు చేస్తూనే.. మరోవైపున సున్నావడ్డీ పథకానికి రూ.2354 కోట్లు చెల్లించాం. 

జగనన్న విద్యా దీవెన
తమ పిల్లలను పెద్ద చదువులు చదివించేందుకు ఏ ఒక్క అక్కచెల్లెమ్మ ఇబ్బందిపడే పరిస్థితి రాకూడదని నేరుగా ఆ పిల్లల పూర్తి ఫీజుల మొత్తం జగనన్న విద్యా దీవెన ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకే జమ చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 18.81 లక్షల మంది తల్లులకు రెండేళ్లలో రూ.6,258 కోట్లు అందించగలిగాం. 

జగనన్న వసతి దీవెన..
జగనన్న వసతి దీవెన ద్వారా దాదాపుగా 18 లక్షల మంది తల్లుల పిల్లలకు సంబంధించిన లాడ్జింగ్‌ అండ్‌ బోర్డింగ్‌ ఖర్చులు అందాలని, ఆ డబ్బు కోసం కూడా ఎవరూ ఇబ్బంది పడకూడదని, ఇంజినీరింగ్, డిగ్రీ చదివే వారికి రూ.20 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, ఐటీఐ చదివే వారికి రూ.10 వేలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు రెండేళ్లలో రూ.2267 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకే ఇచ్చి.. వారే తమ పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ ఖర్చులు ఇచ్చేలా అడుగులు వేశాం. 

వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ..
వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా 34.20 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు (6–72నెలలు)కు పౌష్టికాహారం అందిస్తున్నాం. పౌష్టికాహారం బాగా తినగలిగితేనే పిల్లలు, తల్లులు ఆరోగ్యంగా ఉంటారనే మంచి సంకల్పంతో అమలు చేస్తున్నాం. గతంలో కేవలం రూ.600 కోట్లు ఇస్తే గొప్ప అనుకునే పరిస్థితుల నుంచి అక్షరాల మన ప్రభుత్వం వచ్చాక సంవత్సరానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తూ వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణతో అక్కచెల్లెమ్మలతో తోడుగా నిలబడగలుగుతున్నాం. షెడ్యూల్‌ ఏరియాలో గిరిజన మహిళలకు మంచి జరగాలని సంపూర్ణ పోషణ ప్లస్‌ కూడా అమలు చేస్తున్నాం. 

అక్కచెల్లెమ్మల కోసం మనం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ఇవైతే.. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఎదగాలని, తోడుగా నిలబడే కార్యక్రమాలు చేశాం. 

నా సోదరీమణులు..
శాసనమండలిలో తొలి మహిళా వైస్‌ చైర్మన్‌గా ఈరోజు నా సోదరి శ్రీమతి జకియా ఖానమ్‌ ఉంది. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నా చెల్లి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి ఉంది. రాష్ట్ర తొలి దళిత మహిళా హోంమంత్రిగా నా చెల్లి శ్రీమతి మేకతోటి సుచరిత ఉంది. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్‌ సెక్రటరీగా కూడా శ్రీమతి నీలం సాహ్నిని మనమే నియమించాం. రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల అధికారిగా శ్రీమతి నీలం సాహ్ని ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

పదవుల్లో సింహభాగం అక్కచెల్లెమ్మలకే..
ఇవే కాకుండా కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 51 శాతం పదవులు ఇవ్వడమే కాకుండా.. ఏకంగా చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం మనది. మొత్తంగా నియామకాలు జరిగిన కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు 202 అయితే.. అందులో 102 అక్కచెల్లెమ్మలకు అందించాం. మొత్తంగా 1154 డైరెక్టర్‌ పదవులు మన ప్రభుత్వం వచ్చిన తరువాత మనం ఇస్తే.. అందులో 586 పదవులు అక్కచెల్లెమ్మలకు అందించాం. మొత్తంగా కార్పొరేషన్, డైరెక్టర్‌ పదవులు కలిపితే 1356 పదవుల్లో 688 అక్కచెల్లెమ్మలకే ఇవ్వగలిగానని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు ఇటీవల జరిగాయి. వీటికి సంబంధించిన మేయర్లు, చైర్మన్‌ పదవుల్లో సగభాగానికి పైగా అక్కచెల్లెమ్మలకు ఇచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మనం చేసిన చట్టం ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే.. చట్టాన్ని దాటి మేయర్లు, చైర్మన్లుగా అక్షరాల 52 పదవులు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. 60.47 శాతం అక్కచెల్లెమ్మలే ఈరోజు మేయర్లుగా, చైర్మన్లుగా ఉన్నారు. 

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లోనూ..
202 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఉంటే.. అందులో 101 చైర్మన్‌ పదవులు అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే ఒక విప్లవాత్మక ఘటన జరిగింది. 13 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవుల్లో ఏడుగురు నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. వైస్‌ చైర్మన్‌ పదవులు 26 ఉంటే అందులో 15 మంది నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు.

మహిళల రక్షణ కోసం గొప్ప వ్యవస్థ..
ఇవేకాకుండా దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, గ్రామీణ స్థాయిలోనే మహిళా పోలీసులు మొదలైన మహిళల రక్షణ కోసం దేశంలో ఏ ఇతర రాష్ట్రకంటే మిన్నగా మన రాష్ట్రం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు కోటి ఒక లక్ష 19వేల 642 మంది. అక్కచెల్లెమ్మలు బయటకు వెళ్లినప్పుడు చేతిలో ఉన్న ఫోన్‌ నాలుగుసార్లు ఊపితే చాలు నిమిషాల్లో పోలీసులు వారి దగ్గరకు వచ్చి తోడుగా నిలబడే గొప్ప వ్యవస్థ తీసుకురాగలిగాం. 

ఇదంతా మనసు పెట్టి చేశాం..
గతంలో చూస్తే గ్రామంలో కనీసం 10 బెల్ట్‌షాపులు కనిపించేవి. గుడి, బడి పక్కన కూడా కనిపించేవి. ఈరోజు ఎక్కడా బెల్ట్‌షాపు లేకుండా చేశాం. ఇదంతా మనసు పెట్టి చేశాం. అక్కచెల్లెమ్మలు బాగుండాలి. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని మనసారా ఆరాటపడుతూ చేశాం. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కాదు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ జీవిత చరిత్రలు కూడా గొప్పవి. వారు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. వారి ముఖంలో చిరునవ్వు ఉంటేనే కుటుంబంలో సంతోషం ఉంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తిగా అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో అక్కచెల్లెమ్మలకు మంచిచేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం చుడుతున్నాం. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top