కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు సంక్షోభం

ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ధ్వజం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు.

భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ గత జగన్‌ ప్రభుత్వానిదే

చంద్రబాబు చేస్తున్నది కేవలం క్రెడిట్‌ చోరీ మాత్రమే

ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఫైర్‌ 

తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రాష్ట్రంలో పొగాకు రైతులు ప్రతిరోజూ ఆందోళనలకు దిగుతున్న పరిస్థితులు తలెత్తాయని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగాల్సిన పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు సార్లు సమీక్షలు నిర్వహించినా, రైతులకు ఎలాంటి ఊరట కల్పించే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుతూ కంపెనీల సిండికేట్‌ను అడ్డుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అదే సిండికేట్‌కు సహకరిస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో మామిడి, పొగాకు రైతులకు మెరుగైన ధరలు లభిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ రైతులకు తక్కువ ధరలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాధవరావు డిమాండ్‌ చేశారు.
    భోగాపురం విమానాశ్రయం తామే నిర్మించామని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో ఏవియేషన్‌ మంత్రి ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నప్పటికీ భోగాపురం విమానాశ్రయాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలని నిలదీశారు. 
    జగన్‌గారి హయాంలో భూసేకరణకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి, జీఎంఆర్‌ సంస్థను తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. దాదాపు 70 శాతం పనులు జగన్‌ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ప్రస్తుతం జరుగుతున్న ప్రారంభోత్సవానికి పూర్తి క్రెడిట్‌ మొత్తం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే చెందుతుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ మాధవరావు ఇంకా ఏం మాట్లాడారంటే..:

పొగాకు రైతులను దోచేస్తున్న వ్యాపారులు:
    రెండు వారాల క్రితం కందుకూరు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి కొనుగోలుదారులు, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది. కర్ణాటకలో పొగాకు వేలం ముగిసిన తర్వాత క్వింటాల్‌కు రూ.36 వేల వరకు ధర లభించగా, అదే కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రూ.16 వేలకే కొనుగోలు చేయడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించినా అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. 
    పొగాకు కొనుగోలులో సరఫరా, డిమాండ్‌ సమస్య లేదు. కొనుగోలు చేసిన పొగాకును కంపెనీలు సంవత్సరాల పాటు నిల్వ ఉంచి ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ, కావాలనే సిండికేట్‌గా మారి రైతులను నష్టపరుస్తున్నాయి. ఐటీసీ సహా పొగాకు కొనుగోలు సంస్థలు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నాయి. పొగాకు రైతులకు పంట ఖర్చులో సగం కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 
    గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గారు జోక్యం చేసుకుని పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. అనంతరం ఆ కంపెనీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి రూ.250 కోట్ల ఆదాయం కూడా వచ్చింది. 

కూటమి చేస్తున్నది క్రెడిట్‌ చోరీ మాత్రమే:
    కేంద్రంలో పౌర విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మంత్రుల వద్ద ఉన్నప్పటికీ విజయవాడ విమానాశ్రయం టెర్మినల్‌ విస్తరణ పనులు కూడా ముందుకు సాగలేదు. ఏళ్ల తరబడి పురోగతి ఎందుకు కనిపించలేదు? కర్నూలు, కడప విమానాశ్రయాల అభివృద్ధి కూడా వైఎస్‌ జగన్‌ గారి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. గత ప్రభుత్వం మొదలుపెట్టి దాదాను పూర్తి చేసిన ప్రాజెక్టులను ఇప్పుడు ప్రారంభించి తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదు. రాష్ట్రంలో విమానాశ్రయాలు, పోర్టులు సహా అనేక అభివృద్ధి పనులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పునాది వేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం విషయంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం, హంగు, అంతులేని ప్రచారం మొత్తం కేవలం క్రెడిట్‌ చోరీ మాత్రమేనని తూమాటి మాధవరావు తేల్చి చెప్పారు.

Back to Top