విజయవాడ: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన నిరసనల నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు పలువురి ఇళ్ల వద్ద అర్ధరాత్రి హడావుడి చేశారు. శాప్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన సందర్భంగా టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగినా, పోలీసుల లాఠీ దెబ్బలకు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు గురయ్యారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం మాచవరం, కృష్ణలంక, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మాచవరం పోలీస్ స్టేషన్‌లో శాప్ డైరెక్టర్ ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, డీఎస్సీ అభ్యర్థి ఫిర్యాదుతో మరో కేసు నమోదు కాగా, కృష్ణలంకలో రెండు, సూర్యారావుపేటలో 250 మంది వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ఒక కేసు నమోదైనట్లు సమాచారం. అర్ధరాత్రి వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, వైయస్ఆర్‌సీపీ నేత సుందరపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ పోలీసుల హడావుడి కొనసాగింది. మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, డైమండ్ బాబుతో పాటు మరో 15 మంది వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదైంది. తాడేపల్లి కుంచనపల్లిలో గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర ఇంటికి, గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇంటికి బెజవాడ పోలీసులు వెళ్లారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ ఇంట్లో విజయవాడ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇదే సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ గేటు వద్ద ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ను పోలీసులు లోపలికి అనుమతించకుండా గంటల తరబడి అడ్డుకున్న ఘటన చోటుచేసుకుంది. తెనాలిలోనూ సోషల్ మీడియా పోస్టు కేసులో వైయస్ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు మంజరి చౌదరిని అరెస్ట్ చేసేందుకు మాచవరం పోలీసులు అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపిన వైయస్ఆర్‌సీపీ నేతలపై వరుస కేసులు, అరెస్టులు, ఇళ్ల వద్ద అర్ధరాత్రి పోలీసుల రాకతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.