నంద్యాల: రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై రైతులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కులు, సమస్యలపై వైయస్ఆర్‌సీపీ నిరంతరం అండగా నిలుస్తుందని, ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసి రైతుల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి స్పష్టం చేశారు.