బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అక్రమం, అన్యాయం

  
భూముల కేసులో ఆయన ముద్దాయి కాదు బాధితుడే

త్వరలో కడిగిన ముత్యంలా బయటికి రావడం ఖాయం

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ  నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ అరెస్టుపై తాడేపల్లి, గుంటూరు, నరసరరావుపేటలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 

బొల్లా బ్రహ్మనాయుడుపై ఆరోపణలు దారుణం

అగ్రిమెంట్ లో పేరు లేకపోయినా అరెస్టు

బాధితుడిని కాస్తా నిందితుడిని చేశారు

త్వరలోనే ఆయన నిర్దోషిగా బయటికొస్తారు

తేల్చిచెప్పిన లేళ్ల అప్పిరెడ్డి 

బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అన్యాయం

 వైయ‌స్ఆర్‌సీపీలో ఉన్నందుకే కక్షగట్టారు

బ్రహ్మనాయుడిపై జరుగుతుంది విష ప్రచారం

దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటికి వస్తాయి

అంబటి రాంబాబు వెల్లడి

బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

ఆయనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు

రాజకీయ కక్షతోనే అరెస్టు చేయడం దుర్మార్గం

వైయ‌స్ఆర్‌సీపీ దీన్ని ఇంతటితో వదిలిపెట్టదు

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక

తాడేపల్లి, గుంటూరు, నరసరావుపేట:  వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును భూ లావాదేవీల కేసులో ఆయన పేరు లేకపోయినా తెలంగాణ పోలీసులపై ఏపీ టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి అరెస్టు చేయించారని, కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాడేపల్లి, గుంటూరు, నరసరావుపేటలో మండిపడ్డారు. ఈ కేసులో బాధితుడైన బ్రహ్మనాయుడును నిందితుడిగా చేర్చడమే కాకుండా సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా  వెంటాడి పట్టుకోవడం దారుణమన్నారు. ఈ కేసులో ఆయన త్వరలోనే నిర్దోషిగా, కడిగిన ముత్యంలా బయటికి రావడం ఖాయమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకేమన్నారంటే.. 

బొల్లా బ్రహ్మనాయుడును కావాలనే ఇరికించారు :
లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారిని స్థలాలకు సంబంధించిన అగ్రిమెంట్ లో ఆయన పేరు లేకపోయినా, ఆయన మీద టీడీపీ, ఎల్లో మీడియా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎల్లో మీడియా పుంఖాను పుంఖానులుగా వార్తలు రాసింది.     ఒకరోజు వెయ్యి కోట్లు అంటారు, మరొకరోజు వంద కోట్లు అంటారు. వందల కోట్లు బ్రహ్మనాయుడు దోచేసుకుంటున్నారని ప్రజల్లో భావన కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మేం ఖండిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో పొలాలకు సంబంధించి ఫేక్ జీవోలు ఉన్నాయనే ఆలోచనతో ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందే అగ్రిమెంట్ రాయించుకున్న బొల్లా రమేశ్.. ఆ జిల్లా కలెక్టర్ ను కలిసి పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చి అనుమానాస్పదంగా ఉన్నాయి, విచారణ జరపాలని కోరారు. దీంతో కలెక్టర్ ఎమ్మార్వోను విచారణకు ఆదేశించారు. ఎమ్మార్వో విచారణ చేసి రైతులుగా భావించిన వారు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని స్దానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఆ తర్వాత ఏపీలో పల్నాడులో టీడీపీ నాయకులు హైదరాబాద్ చేరుకుని బ్రహ్మనాయుడు బంధువు బొల్లా రమేశ్ గారు అగ్రిమెంట్ రాయించుకున్నారు కాబట్టి ఆయన దగ్గర ఈయన డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు మొదలుపెట్టారు. ఏదో విధంగా బ్రహ్మనాయుడు గారిని ఈ కేసులో ఇరికించాలి, ఆయన పరువు, ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతోనే యావత్తు టీడీపీ యంత్రాంగం పనిచేసి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ఆయన్ను ముద్దాయిగా పెట్టి అరెస్టు చేయించారు. ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎమ్మార్వో రైతుల మీద ఫిర్యాదు చేస్తే, రైతులు బొల్లా రమేశ్ తో అగ్రిమెంట్ రాసుకుంటే, బ్రహ్మనాయుడు బొల్లా రమేశ్ కు డబ్బులు ఇచ్చారు. ఇక్కడ ఎవరు బాధితులు, ఎవరు లబ్ది పొందారు ?, మధ్యవర్తులు డబ్బులు తీసుకుని లబ్ది పొందితే, బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ బాధితులయ్యారు.

సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా..

 బ్రహ్మనాయుడు వయస్సు 70 సంవత్సరాలు. ఆయన అక్రమంగా ఏమీ సంపాదించలేదు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. అదే క్రమంలో వైయ‌స్ఆర్‌సీపీఅభ్యర్దిగా వినుకొండలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి వ్యక్తి ప్రభుత్వ స్థలాలు కొనాలనే ఆలోచన చేస్తారా ? ఫేక్ డాక్యుమెంట్లతో వీటిని కొని ఆయన ఏం చేసుకుంటాడు ? ఆయన ఏమైనా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి హద్దులు వేశారా చెప్పాలి. మోసపోయిన వ్యక్తి, సీనియర్ సిటిజన్ అయిన బొల్లా బ్రహ్మనాయుడును వెంటాడి, వేధించి అరెస్టు చేయాలా ? దానికీ వక్రభాష్యాలు చెప్తున్నారు. బ్రహ్మనాయుడు ఎక్కడా తప్పుచేయలేదు, ఆయన మోసపోయాడు, అలాంటి వ్యక్తిని కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిపై అపారమైన గౌరవం కలిగిన వ్యక్తిగా బ్రహ్మనాయుడు నిర్దోషిత్వం నిరూపించుకుంటారు, కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. ఎల్లోమీడియా, టీడీపీ నేతలు ఇవాళ ఏం మాట్లాడినా రాబోయే రోజుల్లో బ్రహ్మనాయుడు నిర్దోషిగా బయటికి వచ్చి ప్రజల మధ్యే ఉంటారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయన ఏమీ పిరికి వ్యక్తి కాదు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి, ప్రజల మనిషి. ఆయన మీద బురద వేయాలని ప్రయత్నిస్తే అది తిరిగి మీకే అంటుతుందని ఆయన్ను వేధిస్తున్న వారికి చెప్పదల్చుకున్నా.

పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు:
అంబటి రాంబాబు, మాజీ మంత్రి 

బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అన్యాయం. ఆయన మా పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఒక పాల ఫ్యాక్టరీకి అధిపతిగా ఉన్నారు. దాన్ని ఇంతకు ముందు అమ్ముకుని కొత్త పాల ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు. బ్రహ్మనాయుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో ఒక దిగ్గజం. గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేశారు, వైయ‌స్ఆర్‌సీపీ తరపున పోటీ చేసి పెదకూరపాడులో ఓడిపోయాడు, ఆ తర్వాత వినుకొండలో గెలిచారు, మళ్లీ మొన్న ఓడిపోయారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బ్రహ్మనాయుడు గురించి 100 కోట్ల భూదందా అని రాశారు. వాళ్ల స్టోరీలు చదివితే ఇందులో ఏం జరిగిందో పూర్తిగా అర్థమవుతోంది. బ్రహ్మనాయుడు హైదరాబాద్ లో ఓ స్థలాన్ని ఏ, బీ దగ్గర కొనాలని ప్రయత్నించారు. వాళ్లు ఆ స్థలం క్రమబద్దీకరణ జరిగిందని పేపర్లు చూపించారు. చివరికి కొన్నది ఆయన బంధువు మాత్రమే. కోటీ 25 లక్షలు ఇచ్చారని ఈనాడులో, 5 కోట్లు వైట్ మనీ బదిలీ చేశారని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఏంటీ వీళ్లిద్దరికీ కక్ష ? బొల్లా బ్రహ్మనాయుడు వైయ‌స్ఆర్‌సీపీలో ఉన్నాడు కాబట్టి, ఆయన మీద కేసు పెట్టించి లోపల వేయించాలనే ప్రయత్నం. నేను కూడా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ ఆయన ఆరోగ్యం బాగోలేదు. కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పోలీసులకు అందుబాటులో లేకపోయే సరికి, ముందస్తు బెయిల్ వచ్చేలోపే అరెస్టు చేశారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు బ్రహ్మనాయుడుపై కేవలం విష ప్రచారం చేస్తున్నాయి తప్ప, క్రమబద్దీకరణ కాని ఆస్తిని ఆయన కొనుక్కుని ఏం చేసుకుంటారు. బ్రోకర్ రెగ్యులరైజ్ అయిందని చెప్తే, బ్రహ్మనాయుడు బంధువు కొనేందుకు ప్రయత్నిస్తే.. ఆయన్ను ఎలా అరెస్టు చేస్తారు. వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయి. ప్రభుత్వం పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల్ని వేధించి, జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తోంది. 

కడిగిన ముత్యంలా బయటికి రావడం ఖాయం:
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. ఈ భూమి వివాదం ఉందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లింది బ్రహ్మనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు. ఆ తర్వాతే ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ఎమ్మార్వోతో విచారణ చేయించి ఆయన ద్వారా కేసు పెట్టారు. బ్రహ్మనాయుడు, ఆయన కుటుంబమే ఫిర్యాదు చేస్తే వారినే బాధితులుగా మార్చారు. ఇది చాలా దారుణమైన విషయం. ఈ కేసులో కీలక నిందితుడు రాధాకృష్ణ కూడా తన వాంగ్మూలంలో కొనుగోలు చేసిన వాళ్లకు ఈ కేసుతో సంబంధం లేదు, ఈ భూమికి ఫేక్ జీవోలు రిలీజ్ చేయడం వల్లే వాళ్లు కొనుగోలు చేశారని చెప్పాడు. ఈ స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్నది బొల్లా రమేశ్. బొల్లా బ్రహ్మనాయుడిని కేవలం రాజకీయ కక్షతో ఇరికించి అరెస్టు చేయడం దుర్మార్గం. ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్లని లాయర్లు చెప్పారు. అయినా టీడీపీ వాళ్లు బ్రహ్మనాయుడిని ఎలాగోలా ఇరికించాలని చూస్తున్నారు. అందులో భాగమే ఈ అరెస్టు. వైయ‌స్ఆర్‌సీపీ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టదు. న్యాయస్దానాలకు వెళ్లి అసలు నిందితులెవరో తేల్చే ప్రయత్నం చేస్తాం.

Back to Top