ఒక్క రూపాయి ఖర్చు చేయకుండ కంటి పరీక్షలు

అనంతపురంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

రాష్ట్రంలోని 5.4 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు

108 వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది

1100 వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తాం

వైద్యరంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట 

అనంతపురం జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి

వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

అనంతపురం: మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఒక్కరూపాయి ఖర్చు చేయకుండా కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.  వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అనంతపురంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన కళ్లు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాయని, అమ్మ అని పసిబిడ్డకు పరిచయం చేసేది కళ్లే అన్నారు. కంటి సమస్యను నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీలో అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో సమగ్ర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి అందరికి కంటి వెలుగు పథకం అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. మూడేళ్లలో ఆరు దశల్లో కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తామన్నారు. మొదటి రెండు దశల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వైయస్‌ జగన్ స్పష్టం చేశారు.
 
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ ఆపరేషన్ ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 3, 4, 5, 6 దశల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్‌ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు జగన్ స్పష్టం చేశారు.

కొత్తగా మూడు మెడికల్‌ కాలేజీలు
ఏలూరు, మార్కాపురం, పులివెందుల పట్టణాల్లో కొత్తగా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో మొత్తం 2 వేల వ్యాధులను చేరుస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులు వర్తించేలా పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసినట్లు తెలిపారు. నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో 150 ఆసుపత్రులను ఎంపిక చేసి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పెన్షన్లు ఇస్తామన్నారు. 

ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతాం
ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రుల ఫొటోలు తీసి నాడు- నేడు ఎలా ఉన్నాయో ప్రజలకు చూపుతామన్నారు.
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, గతంలో గుంటూరు ఆసుపత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.ఏపీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తామన్నారు.తలసేమియా, డయాలసిస్‌ పేషంట్లకు ఆపరేషన్ల తరువాత విశ్రాంతి కోసం నెలకు రూ.5 వేలు ఇస్తామన్నారు. వైద్యరంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. వైద్యం, చదువు, వ్యవసాయానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

అనంతపురం జిల్లా మనవడ్ని...
తాను అనంతపురం జిల్లా మనవడినని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హంద్రీనీవా కాలువను 6 వేల క్యూసెక్కులకు వెడల్పు చేస్తానని చెప్పారు.హంద్రీనీవా కాలువకు సమాంతరంగా మరో కాలువను నాలుగు వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో నిర్మిస్తానని మాటిచ్చారు. మొత్తం 10 వేల క్యూసెక్కులు వచ్చేలా సమాంతర కాలువ నిర్మిస్తామని చెప్పారు.

Back to Top