రైతుకు అందించే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమే

జూదమ‌డితే ఆరు నెల‌ల జైలు శిక్ష‌

 మ‌రో రెండు బ్యారేజీలు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌

కేబినెట్ వివ‌రాల‌ను వెల్ల‌డించిన మంత్రి పేర్ని నాని

అమరావతి: రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశార‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు.  ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చార‌ని చెప్పారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కేబినేట్‌ గురువారం సమావేశమైంది. సీఎం వైయ‌స్ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివ‌రించారు.

ఉచిత విద్యుత్‌ను వ్య‌తిరేకించింది ఎవ‌రో అంద‌రికీ తెలుసు..

వైయస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ పథకం ద్వారా రైతుకు ఫ్రీ పవర్‌ అనే ఆలోచన దివంగత మహానేత వైయస్‌ఆర్‌ది. రైతుకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తానని వైయస్‌ఆర్‌ చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. ఉచితంగా కరెంట్‌ ఇస్తానని చెప్పటమే కాకుండా అప్పటి వరకు ఉన్న రూ.11 వందల కోట్ల బకాయిలను మాఫీ చేశారు. కరెంట్‌ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అదే జరిగితే అనే మాట్లాడిన వ్యక్తులను చూశాం. గడిచిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం విద్యుత్‌ శాఖకు పెట్టిన బకాయిలు రూ.20 వేల కోట్ల పైచిలుకు అయితే సీఎం వైయస్‌ జగన్‌ రూ.14 వేల కోట్ల పాత బకాయిలు తీర్చారు. దానిలో రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.7,172 కోట్ల బకాయిలను అప్పుపెట్టి వెళ్లిపోయారు. అలాంటి వారు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించడమే కాకుండా పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. 

రైతుల‌పై ఎలాంటి భారం ఉండ‌దు..

అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘‘కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం చేశారు.  పగటిపూట 9 గంటల కరెంటు, ఇప్పటికే 89శాతం ఫీడర్లలో అమలు అవుతోంది. రబీ సీజన్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 10వేల మెగావాట్ల సోలార్‌తో పథకాన్ని మరింత గొప్పగా దీర్చిదిద్దుతాం. ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైయ‌స్‌కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు’’ అని సీఎం జగన్‌ తెలిపారు. 

  
అందుకే సోలార్ ప్రాజెక్ట్ నిర్ణ‌యం..

ట్రాన్స్ మిషన్ నష్టాలు కానీ, డిస్కంల నష్టాలు కానీ, అన్నింటిని కలుపుకుంటే ఒక యూనిట్ కు రూ.6.70 పడుతోంది.  ఈ భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వమే 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది.  ఒక యూనిట్ కు రూ.2.50 లోపే పడుతుంది.  భవిష్యత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ విధానంతో రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగేలా సీఎం వైయ‌స్ జగన్ సోలార్ ప్రాజెక్టు నిర్ణయం తీసుకున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్‌లో ర‌మ్మీ నిషేధం..

ఆన్‌లైన్‌ వ్యవస్థను మంచికోసం అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో జూదాలను విపరీతంగా ప్రవేశపెడుతూ.. ప్రత్యేకించి యువతను బాగా పక్కదారి పట్టించి తద్వారా మోసాలు చేస్తున్న అనేక కథనాలను పత్రికల్లో, టీవీల్లో చూస్తున్నాం. దానికి స్పందించిన సీఎం వైయస్‌ జగన్‌.. ఆన్‌లైన్‌లో రమ్మీ, పోకర్‌ లాంటి జూద క్రీడలను నిషేధించడం జరిగింది. ఆన్‌లైన్‌లో ఆటను ఆర్గనైజ్‌ చేసేవారు మొదటిసారి దొరికిపోతే సంవత్సరం జైలు, జరిమానా, అదే వ్యక్తి రెండోసారి పట్టుబడితే రెండు సంవత్సరాలు జైలు, జరిమానా. ఆన్‌లైన్‌లో జూదం ఆడేవారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ జీఓ చేయాలని మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. 

కృష్ణా డెల్టా ఆయ‌క‌ట్టును ప‌రిర‌క్షించేందుకు..

కృష్ణా డెల్టా ఆయ‌క‌ట్టును ప‌రిర‌క్షించేందుకు ప్ర‌కాశం బ్యారేజి కింద మ‌రో రెండు బ్యారేజీలు నిర్మించాల‌ని ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక్కో బ్యారేజీని 3 టీఎంసీల సామ‌ర్ధ్యంతో నిర్మించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే రాయ‌ల‌సీమ క‌రువు నివార‌ణ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణ‌యాల‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు మంత్రి పేర్ని నాని వివ‌రించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top