రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల మీద లేదు

హిందువుల మనోభావాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు చీర్ల జ‌గ్గిరెడ్డి ఫైర్ 

ద్రాక్షారామం ఘటనపై వైఎస్ఆర్‌సీపీ నేత‌ల‌ ఆగ్రహం  

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రెడ్ బుక్ అమలు పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తూ, దేవాలయాల రక్షణను పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం వద్ద శివలింగం ధ్వంసం ఘటన కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. తిరుపతి, విజయవాడ, సింహాచలం ఘటనలతో పాటు తాజా ద్రాక్షారామం ఘటనపై ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  రామచంద్రపురం నియోజకవర్గంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం వద్ద శివలింగం ధ్వంసం చేసిన ఘటనపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి “రెడ్ బుక్” మీద ఉన్న శ్రద్ధ హిందూ దేవాలయాల పరిరక్షణపై లేదని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతుండటం దానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న తిరుపతి ఆలయంలో తొక్కిసలాట ఘటన, తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం, సింహాచలం దేవస్థానంలో గోడ కూలి భక్తులు మృతి చెందడం, నిన్న విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కరెంట్ కట్ చేయడం వంటి ఘటనలను గుర్తు చేస్తూ, ఇవన్నీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా చూపుతున్నాయని అన్నారు.

“నేడు ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం జరగడం అత్యంత దారుణం. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ ఘటనలకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలి” అని చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ మరియు పీఏసీ సభ్యులు తోట త్రిమూర్తులు, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాశ్, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, కర్రి నాగిరెడ్డి తదితర ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు 

Back to Top