పిటీషన్‌ తిరస్కరిస్తే ఎందుకంత రాద్ధాంతం

సీఎం వైయస్‌ జగన్‌ నేరారోపణ చేయబడిన వ్యక్తే.. నేరస్తుడు కాదు

అది ప్రజలకు తెలుసు.. అందుకే భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు

దీనిపై చట్టప్రకారం ముందుకు వెళ్తాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: కోర్టులో హాజరు మినహాయించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వేసిన  పిటీషన్‌ సీబీఐ కోర్టు తిరస్కరిస్తే టీడీపీ నేతలు ఎందుకు అంత గందరగోళం సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోర్టు పిటీషన్‌ తిరస్కరిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటూ ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, వైయస్‌ జగన్‌ సీఎం కాకముందు నుంచే కోర్టుకు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి కుట్రపూరితంగా కేసులు పెట్టారని ప్రజలందరికీ తెలుసని, వైయస్‌ జగన్‌ నేరారోపణ చేయబడిన వ్యక్తి కాబట్టే ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం వైయస్‌ జగన్‌ సీబీఐ కోర్టులో ప్రతి శుక్రవారం హాజరుకావడాన్ని మినహాయించవల్సిందిగా.. సీఆర్‌పీసీ 205 సెక్షన్‌ ప్రకారం మినహాయించి ఆయన తరుఫున ఒక న్యాయవాది హాజరయ్యే విధంగా చేయాల్సిందిగా పిటీషన్‌ వేయడం జరిగింది. ఇది క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోర్టు ప్రకారం.. రాలేని పరిస్థితిలో ఉంటే మినహాయించి ఆయన స్థానంలో ఒక న్యాయవాదిని పంపించే అవకాశం.. సీఆర్‌పీసీ ప్రొసీజర్‌ కోడ్‌లో ఉంది. 205 సీఆర్‌పీసీ ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దానిపై కోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ ఎప్పుడు నేరారోపణ జరిగిన వారికి వ్యతిరేకంగా వాదనలు చేస్తుందనేది అందరికీ తెలిసిందే. వాదనలో ప్రధానంగా సీఎం వైయస్‌ జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తారు.. ప్రతి శుక్రవారం హాజరుకావాల్సిందేనని చెప్పారు. వైయస్‌ జగన్‌ తరుఫు న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. వైయస్‌ జగన్‌ ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికకాబడ్డారు. వారిపై పని ఒత్తిడి చాలా ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రావాలంటే టైమ్‌ పడుతుంది, ఖర్చు పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్‌ ఇబ్బంది పడుతుంది కాబట్టి మినహాయించాలని కోరారు. వాదనలు పూర్తయిన తరువాత పిటీషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇందులో గందరగోళం చేయాల్సిన అవసరం ఏముంది. కాల్వ శ్రీనివాసులు వైయస్‌ జగన్‌ సీఎం పదవికి  రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు. కుట్ర పూరితంగా వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టారు. కుట్రదారులు ఎవరో ప్రజలందరికీ తెలుసు. నేరారోపణ చేయబడిన వ్యక్తి మాత్రమేనని ప్రజలు నమ్మారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి ఘనంగా గెలిపించారు.

మినహాయింపు పిటీషన్‌ పెట్టింది ఇప్పుడు కొత్త కాదు. పాదయాత్ర సమయంలో కూడా మినహాయింపు పిటీషన్‌ వేశారు. ప్రజల్లో ఉంటాను మధ్యలో రావడం వీలుపడదు.. కోర్టు హాజరుకు మినహాయించాలని పిటీషన్‌ వేసినప్పుడు ఆ రోజు కూడా తిరస్కరించారు. దీన్ని ఏదో గందరగోళం చేసేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్తాం. సీఎం వైయస్‌ జగన్‌ నేరారోపణ చేయబడిన వ్యక్తే కానీ నేరస్తులు కాదు. దున్నపోతు ఈనింది అనగానే.. కట్టేయండి.. కట్టేయండి అంటూ చంద్రబాబు ఆయన పరివారం బయల్దేరుతున్నారు. దీనిపై చట్ట ప్రకారం వెళ్తా’మని ఎమ్మెల్యే అంబటి స్పష్టం చేశారు.

 

Read Also: పొట్టిశ్రీరాములు త్యాగ ఫలితమే ఆంధ్రరాష్ట్రం

Back to Top