తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలన చూస్తే "చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వ్యవసాయం దండగ" అని రైతుల నోటితోనే అనిపించేలా ఉందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లుగా ఈ ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం మానేసిందని.. సున్నావడ్డీ పంట రుణాలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్ట పరిహారం వంటి పథకాలు పూర్తిగా ఆపేశారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకే సెంటర్లను పూర్తిగా నిర్వీర్యం చేసి జూద కేంద్రాలుగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఏ పంట చూసినా ధరల పతనమే. ఏ రైతుని కదిలించినా కన్నీరే కనిపిస్తోందని, సబ్సిడీ విత్తనాలు, ఎరువులే కాదు.. గిట్టుబాటు ధరలు కూడా అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా వందల సంఖ్యలో మామిడి ట్రాక్టర్లతో కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నా వారి ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 369 కోట్లు చెల్లిస్తే మామిడి రైతులకు న్యాయం జరుగుతుందని చెబుతున్నా, ఆ మేరకు ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గమని వీరశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రైతులకు చంద్రబాబు వెన్నుపోటు వ్యవసాయాధారిత రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దాదాపు 65 శాతం కుటుంబాలు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తుంటాయి. ఇలాంటి వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. రెండేళ్లుగా తమకు జరుగుతున్న అన్యాయం తలచుకుని ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు వ్యవసాయం దండగ అనే భావనకు రైతులు వచ్చారు. నాడు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్న సంతోషంగా వెళ్లి సబ్సిడీ విత్తనాలు, ఎరువులు తెచ్చుకునేవాడు. మద్ధతు ధరల విషయంలో ఇబ్బంది అనిపిస్తే ఆర్బీకే సెంటర్లను ఆశ్రయిస్తే తోడుగా ఉండేవి. విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు రైతన్నకు అండగా నిలిచిన పరిస్థితి నుంచి నేడు రైతులు యూరియాకి, సబ్సిడీ విత్తనాలకు, ఆఖరుకి పండించిన పంటలు అమ్ముకోవడానికి కూడా క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో నిర్విరామంగా పెట్టుబడి సాయం కింద అందిన రైతు భరోసా పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా చేసి వదిలేశారు. మొదటి ఏడాది పూర్తిగా పథకాన్ని ఎత్తివేసిన కూటమి ప్రభుత్వం, రెండో ఏడాది అరకొరగా అమలు చేసింది. దాదాపు 7 లక్షల మందికిపైగా రైతులకు అమలు చేయలేదు. 2014 సంపూర్ణ రుణమాఫీ చేస్తా, మీ బ్యాంకుల్లో ఉన్న బంగారం తీసుకొస్తానని హామీ ఇచ్చి ఎలాగైతే మాటతప్పాడో అచ్చం అలాగే రైతుకు వెన్నుపోటు పొడిచాడు. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మాటమార్చేశాడు. కౌలు రైతులను పూర్తిగా గాలికొదిలేశాడు. ఆ హామీల ఊసే లేదు సున్నావడ్డీ పంట రుణాలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్టపరిహారం లాంటి పథకాల ఊసేలేదు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే దాన్ని కొనే నాథుడే కరువైనాడు. వరి, మొక్కజొన్న, శెనగ, అరటి, పొగాకు, టమాట, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట చూసినా రైతులకు నష్టం తప్పడం లేదు. ధరలు పతనమై రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం కలుగజేసుకునే ప్రయత్నం చేయడం లేదు. రైతులను దళారులు పీల్చి పిప్చి చేస్తుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఫీడ్ ధరలు రూ. 16లు పెరగడంతో ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. వైయస్ జగన్ గారు రోడ్డెక్కుతానని హామీ ఇవ్వడంతో ప్రభుత్వం స్పందించి రూ.4లు తగ్గిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వ ఆదేశాలను ఫీడ్ కంపెనీలు లెక్కచేయడం లేదు. రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులిపేసుకున్నాయి. ప్రభుత్వాన్ని నమ్ముకున్న ఆక్వా రైతులు నిండా మునిగిపోయారు. తోతాపురి మామిడి రైతుల ఆవేదన పట్టదా? రాయలసీమలో 4.5 లక్షల ఎకరాల్లో తోతాపురి మామిడి సాగుచేస్తారు. గత కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలో జ్యూస్ ప్యాక్టరీల బయట మామిడి రైతులు క్యూలు కట్టారు. కానీ ప్రభుత్వం వారి వేదన పట్టించుకోవడం లేదు. గత మూడు నాలుగు రోజులుగా వందలాది ట్రాక్టర్లు క్యూలు కడితే కొనుగోలు చేయడం లేదు. కాయలు పండిపోతే రైతులు ఎంతోకొంతకు తెగనమ్మిపోతారనే కుట్రకు జ్యూస్ ప్యాక్టరీల యాజమాన్యాలు తెరలేపితే అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కూడా రైతులకు జరుగుతున్న నష్టంపై ఆలోచన చేయడం లేదు. జోరున వర్షాలు కురుస్తుంటే తడుస్తూ నానిపోతున్నారు. టీడీపీ నాయకుల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకున్న ట్రాక్టర్లనే అర్ధరాత్రి లోపలికి పంపిస్తున్నారని కొంతమంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేసే రైతులను కూడా పార్టీల వారీగా విడగొట్టేసి ఇబ్బంది పెడుతోంది. మామిడి రైతుల సమస్యలపై చంద్రబాబు ఇప్పటివరకు కలెక్టరలతో కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మామిడి రైతుల కోసం రూ. 369 కోట్లు కేటాయిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. రెండేళ్లకే రూ. 3.50 లక్షల కోట్లు అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం ఆ మాత్రం చెల్లించలేని పరిస్థితుల్లో ఉందా? గతేడాది బకాయిలు ఇంకా చెల్లించలేదు గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉండగా మామిడి రైతులకు మద్ధతుగా వైయస్ జగన్ గారు బంగారుపాళ్యెం వెళ్తున్నట్టు ప్రకటించగానే సీఎం చంద్రబాబు ఆగమేగాల మీద కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి రూ.8లు, ప్రభుత్వం నుంచి రూ. 4లు కలిపి కేజీకి రూ. 12 ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన సబ్సిడీ కూడా చెల్లించకుండా ఐదు నెలలపాటు ఇబ్బంది పెట్టారు. దానికోసం కూడా వైయస్ఆర్‌సీపీ నిరసన కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. వైయస్ జగన్‌గారు, వైయస్ఆర్‌సీపీ నిరసన తెలిపితే తప్ప ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. గతేడాదికి సంబంధించి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేసిన మామిడి పంట డబ్బులు ఇప్పటికీ విడుదల చేయలేదు. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఆర్బీకే సెంటర్లు నిర్వీర్యం వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి ప్రభుత్వం వచ్చాక అధోగతిపాలయ్యాయి. చింతలపూడి నియోజకవర్గం పరికపూడెం గ్రామంలో ఆర్బీకే సెంటర్‌ని కాంట్రాక్టు పనులు చేసుకునే వారు నివాసం ఉండేందుకు ఇచ్చేశారు. ఐక్యరాజ్యసమితి సైతం మెచ్చుకున్న ఆర్బీకే సెంటర్లను మద్యపానం, జూదాలకు కేంద్రాలుగా మార్చేశారు. ఎన్నో రాష్ట్రాలు ఆర్బీకే సెంటర్లను సందర్శించి అధ్యయనం చేసి వెళ్లాయి. గేమ్ ఛేంజర్ లాంటి ఆర్బీకే సెంటర్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని శేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.