పులివెందుల సురేష్‌రెడ్డికి ఆరె శ్యామ‌ల ప‌రామ‌ర్శ‌

తాడేప‌ల్లి:    పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న‌ వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు సైదాపురం సురేష్‌రెడ్డిపై దాడిని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు ఆమె సురేష్‌రెడ్డిని ఫోన్‌లో ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు.  సురేష్‌రెడ్డి ఈ నెల 5వ తేదీ త‌న బంధువు అమరేశ్వరరెడ్డితో కలిసి పులివెందులలో టీడీపీ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో వివాహ వేడుకకు హాజరయ్యారు. వారు కుర్చీల్లో కూర్చుని ఉండగా టీడీపీ కార్యాలయం నుంచి 30 మందిపైగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు.  సురేష్‌కు సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేశారు. దాడిలో అమరేశ్వరరెడ్డి తలకు బలమైన గాయమైంది. సురేష్ రెడ్డికి కమిలిన గాయాలయ్యాయి. చేయి విరిగింది. వీరిని పులివెందులలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ‌ల ఇవాళ ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. వైయస్ఆర్ సీపీ నేతల్ని భయబ్రాంతులకి గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కూట‌మి నేత‌లు కుట్ర చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగంతో టీడీపీ గూండాలకు అడ్డు అదుపు లేకుండా రాజ్యమేలుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  ఓటమి భయంతో ఇలా నీచానికి దిగజారుతున్నారా అంటూ శ్యామ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Back to Top