శ్రీకాకుళం: నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందని, గ్రామాల్లో రాజకీయ మార్పు కనిపిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గార మండలం వత్సవలస పంచాయతీ పరిధిలోని పేర్లవానిపేట, శాలిగుండం పంచాయతీలకు చెందిన సుమారు 50 కుటుంబాలు ఆదివారం వైయస్ఆర్‌సీపీలో చేరాయి. పెదపాడులోని ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందనే అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు. రైతులకు ఎరువుల కొరత, ధాన్యం మద్దతు ధర, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి సమస్యలు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించిందని గుర్తుచేస్తూ, ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతుండటం రాజకీయ పరిణామాల్లో మార్పునకు సంకేతమని ధర్మాన వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగిన గుండ కుటుంబం సైతం ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరడం, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని ప్రతిబింబిస్తోందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని ధర్మాన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రభుత్వ హామీల అమలు తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని పొందుతూ సమన్వయంతో పనిచేస్తే గార మండలంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జోనల్ రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజెటి కృష్ణ, యాళ్ల నారాయణ, పీస శ్రీహరి, రామారావు, అరవల రామారావు, జల్లు గౌరీనాయుడు, మల్ల నారాయణమూర్తి, శిమ్మ ధర్మరాజు, గొలివి రమణ, తెలుకుటి అప్పారావు, గుజ్జల అప్పలరాజు, సన్యాసి నాయుడు, చింతల గడ్డియ్య, బోర రమణయ్య, పేర్ల శ్రీరాములు, తెలుకుటి భాస్కరరావు, జల్లు సంతోష్ మోహన్ దాస్, జల్లు అయ్యప్ప, జల్లు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.