సీఎం వైయస్‌ జగన్‌ పునర్జన్మనిచ్చారు

 పాకిస్తాన్‌ చెరలో నుంచి స్వదేశానికి చేరుకున్న జాలర్లు 
 

 న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తమకు పునర్జన్మ ప్రసాదించారని పాక్‌ జైలు నుంచి విడుదలై ఢిల్లీ చేరుకున్న 20 మంది మత్స్యకారులు  ఆనందం వ్యక్తం చేశారు. 14 నెలలు పాకిస్తాన్‌ చెరలో గడిపిన ఆంధ్రా జాలర్లు ఎట్టకేలకు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. వారు మాట్లాడుతూ.. ‘మాకు పునర్జన్మ లభించింది. పాకిస్తాన్ నుంచి బయటకు వస్తామో లేదోనని భయపడ్డాం. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో మేమంతా బయటికి రాగలిగాం. గుజరాత్‌ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి  పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించాం. దాంతో వారు మమ్మల్ని పట్టుకుని.. కరాచీలోని లాండీ జైల్లో ఉంచారు. మాతో అనేక పనులు చేయించుకున్నారు.
 
సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు. వైయస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత మమ్మల్ని విడిపించేందుకు ప్రయత్నించారని తెలిసింది. తల్లి మాకు జన్మనిస్తే.. వైయస్‌ జగన్‌ పునర్జన్మనిచ్చారు. మాకు సరైన ఉపాధి లేకనే చేపల వేటకు గుజరాత్‌ వెళ్లాం. మా ఉపాధికి అవసరమైన జెట్టీలను ప్రభుత్వం అందజేయాలని కోరుతున్నాం. 14 నెలల తర్వాత మా కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’అని అన్నారు. కాగా, ఢిల్లీ నుంచి 12 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా మత్స్యకారులు హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చిన  అనంతరం మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమక్షంలో వారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు.

Back to Top