రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇష్యూ: కుండబద్దలు కొట్టిన తెలంగాణ సీఎం: ఈ మధ్యకాలంలో చంద్రబాబునాయుడుగారు మాట్లాడిన మాటలు చూసినా, ఆయన క్యాబినెట్‌లో ఇరిగేషన్ మంత్రి మాట్లాడిన మాటలు చూసినా అసలు వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిమాటా రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలని క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో తాను కోరితే, తన మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు వెంటనే ఆ పని చేశారని, తెలంగాణ ముఖ్యమంత్రిగారు నిండు అసెంబ్లీలోనే వెల్లడించారు. అలా వాళ్ల రిలేషన్‌షిప్ గురించి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారన్న వాస్తవాలు అలా రేవంత్‌రెడ్డిగారు చెప్పారు. రైతుల పాలిట చంద్రబాబు విలన్ క్యారెక్టర్: నిజంగా ఇది చూసిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ, రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు చంద్రబాబు ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న చంద్రబాబు, తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడో, రాష్ట్ర ప్రజల్ని తన స్వార్థం కోసం ఏరకంగా తాకట్టు పెడుతున్నాడు అన్నదానికి రేవంత్‌రెడ్డి ప్రకటన సాక్ష్యం. దేశంలోనే ఇలాంటి చరిత్రహీనుడు ఎక్కడా ఉండకపోవచ్చు. రహస్య ఒప్పందానికి ముద్ర: రాయలసీమ లిఫ్ట్ స్కీంపై చంద్రబాబు కానీ, ఆయన మంత్రి కానీ.. తెలంగాణ సీఎం మాటలు ఖండిస్తారనుకుంటే అది జరగలేదు. పైగా వారి మాటలు వింటే, ఆ స్కీమ్ అవసరం లేదనడం చూస్తే.. రేవంత్‌రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి ముద్ర వేసినట్లే. అంటే ఒక అధికార ముద్ర పడినట్లే. స్వలాభం కోసం ప్రజలకు ఎంత ద్రోహం, మోసం అయినా చంద్రబాబు చేస్తాడు. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తాడు. అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ వంటిది: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది చాలా కీలకం. ఆ ప్రాంతానికి అది ఎంతో అవసరం. ఏ మాత్రం నీళ్లు లేని ప్రాంతానికి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ వంటిది. రాయలసీమతో పాటు, నెల్లూరు, చెన్నైకి అది ఒక సంజీవని వంటిది. శ్రీశైలం పూర్తిస్థాయి మట్టం 885 అడుగులు కాగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్ లెవెల్ 841 అడుగులు. అక్కడి నుంచి పూర్తిస్థాయి నీటి విడుదల 44 వేల క్యూసెక్కులు రావాలంటే, శ్రీశైలం రిజర్వాయర్‌లో 881 అడుగుల నీరు ఉంటేనే సాధ్యమవుతుంది. పోతిరెడ్డిపాడు నుంచి మనకు దాదాపు 101 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. అయినా, గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగుసార్లు మాత్రమే, ఆ నీరు వచ్చింది అంత దారుణ పరిస్థితి. దీన్ని అందరూ ఆలోచించాలి. రోజుకు 8 టీఎంసీల నీరు తోడేలా..: అలాంటి దుర్భరమైన పరిస్థితి ఇక్కడ కొనసాగుతుండగా, 2015లో ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఉండగా, తెలంగాణలో కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని 25 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచి, శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీరు తోడేలా పని మొదలుపెట్టారు. ఇంకా మరో అడుగు ముందుకేసి 777 అడుగుల స్థాయి నుంచి రోజూ మరో 2 టీఎంసీలు డ్రా చేసేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇవన్నీ ఇలా ఉండగా, 825 అడుగుల నుంచి ఎస్‌ఎల్బీసీ ద్వారా 40 టీఎంసీల నీరు తీసుకెళ్లే పనులు చేశారు. మరోవైపు శ్రీశైలం వరకు నీరు రాకముందే జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమ లిఫ్ట్‌ల ద్వారా రోజుకు 1 టీఎంసీల నీరు తరలించే పనులు చేశారు. ఇంకా శ్రీౖశైలంలో 777 అడుగుల స్థాయి నుంచి ఎడమ విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఆ స్థాయిలో నీటి దోపిడి జరగ్గా, ఇక్కడ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఇక్కడ ప్రజలు నీళ్లు లేక జనం అల్లాడుతుంటే, అక్కడ లిఫ్ట్‌లు, పవర్ హౌజ్ ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు పలు మార్గాల్లో 8 టీఎంసీల నీరు తోడేసే పరిస్థితి. అదే ఇక్కడ తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితి. చంద్రబాబు హయాంలోనే ఆ నిర్ణయాలు. పనులు: శ్రీశైలం కింద నాగార్జునసాగర్ వద్ద కూడా ఎడమ కాల్వ ఆపరేషన్స్, లెఫ్ట్ బ్యాంక్ పవర్‌హౌజ్ కూడా తెలంగాణ అధీనంలో ఉన్నాయి. ఇంకా రైట్ బ్యాంక్ ఆపరేషన్ కూడా తెలంగాణ అధీనంలో ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక, దాన్ని స్వాధీనం చేసుకున్నాం. నాగార్జునసాగర్ కింద పులిచింతల. అక్కడా పవర్‌హౌజ్ తెలంగాణ చేతిలో ఉంది. మన రాష్ట్రానికి అన్ని విధాల నష్టం చేస్తున్న ఆ నిర్ణయాలన్నీ, చంద్రబాబు సీఎం అయ్యాకే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. పనులూ చేసింది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపని పరిస్థితి. కానీ, అప్పట్లోనే నేను విపక్షనేతగా కర్నూలులో జలదీక్ష చేశాను. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక: 2019లో మన ప్రభుత్వం వచ్చే నాటికి, తెలంగాణలో ఇరిగేషన్ పథకాలు.. కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి పథకాలు.. దేనికీ పర్యావరణ అనుమతులు లేకున్నా, పనులు కొనసాగించారు. దీంతో మా ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో, 2021లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు ఇచ్చింది. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో 2022లో అదే ఎన్జీటీ తెలంగాణకు రూ.920 కోట్ల జరిమానా విధించింది. అందుకే రాయలసీమ లిఫ్ట్ స్కీం: శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలోనే రోజూ 8 టీఎంసీల నీరు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు చేపట్టగా.. అదే మన రాష్ట్ర పరిస్థితి చూస్తే.. మల్యాల దగ్గర ఒక చిన్న లిఫ్ట్. శ్రీశైలంలో 834 అడుగుల నీరున్నప్పుడు మల్యాల ద్వారా 0.3 టీఎంసీలు, 795 అడుగుల స్థాయిలో ముచ్చుమర్రి నుంచి 0.33 టీఎంసీలు మాత్రమే మనం రోజూ తీసుకోగల పరిస్థితి. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు, ఏనాడూ ఆ ప్రాంతం గురించి ఆలోచించలేదు. అందుకే మేము రాగానే రాయలసీమ క్షేమం కోసం లిఫ్ట్ స్కీమ్ చేపట్టాం. దాని ద్వారా 800 అడుగుల స్థాయి నుంచే శ్రీశైలం నుంచి రోజూ 3 టీఎంసీల నీరు తీసుకునే వెసలుబాటు సృష్టిస్తూ, ప్రాజెక్టు చేపట్టి, మా హయాంలోనే రూ.990 కోట్లు ఖర్చు చేసి చాలా పనులు చేశాం. అది పూరై్తతే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని, ఒక టీడీపీ కార్యకర్తతో తెలంగాణలో కేసు వేయించాడు. అయినా రాయలసీమ, నెల్లూరు ప్రజల కోసం ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. రాయలసీమ లిఫ్ట్ స్కీంకు ‘చంద్ర’ గ్రహణం: ప్రభుత్వం మారగానే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టింది. తెలంగాణతో రహస్య ఒప్పందం చేసుకున్న చంద్రబాబు రాయలసీమకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు. అదంతా ఎందుకంటే, కేవలం జగన్‌కు మంచి పేరొస్తుందని. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ఎక్స్‌పర్ట్స్ అప్రైజల్ కమిటీ’ (ఈఏసీ).. 2024 నవంబరులో, 2025 జనవరిలో.. ఇంకా ఫిబ్రవరి 27న, మొత్తం మూడుసార్లు మీటింగ్ పెడితే, చంద్రబాబు ప్రభుత్వం కనీసం నోరు మెదపలేదు. వాదనలను సమర్థంగా వినిపించలేదు. ఇన్ని చేసి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనవసరం అని చంద్రబాబు చెబుతున్నాడు. అసలు ఆయన మనిషేనా?. రాయలసీమ లిఫ్ట్ స్కీం వల్ల శ్రీశైలం నుంచి 800 అడుగుల స్థాయిలోనే 3 టీఎంసీల నీరు తోడుకోవచ్చు. కానీ, చంద్రబాబుగారికి ఆ ఆలోచన కూడా లేదు. అందుకే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వృథా అనడమే కాకుండా, దాన్ని ఇక్కడి ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నాడు. మా హయాంలో స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌లో స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు కట్టడం ద్వారా చిత్తూరుకు నీళ్లు రావు. హంద్రీనీవా నుంచి కుప్పం 500 కిమీ. అంత దూరం నీటి సరఫరా కష్టం కాబట్టి.. గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ద్వారా గండికోటకు నీరు తరలించి, అక్కణ్నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా నీరు తరలించి.. తద్వారా తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, కుప్పం, చిత్తూరుకే కాకుండా రాయచోటికి కూడా నీళ్లివ్వడానికి పనులన్నీ చేశాం. ఆ మేరకు కాలేటివాగు, ముదివేడు, నేటిగుంటుపల్లి, ఆవులపల్లి వంటి స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కట్టాం. అదే చంద్రబాబు వైఖరి: రాష్ట్రంలో అన్నేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ, రాయలసీమలో ప్రాజెక్టులు నింపే పని చేయలేదు. ఎంతసేపూ అవినీతి పనులు తప్ప. అంచనాలు పెంచి, నామినేషన్ పద్ధతిలో పనులు ఒప్పగించి దోచుకోవడం చంద్రబాబు నైజం. చంద్రబాబుకి ఏనాడూ ప్రజల గురించి కనీస ధ్యాస లేదు. మొత్తం మోసం, దగా. నిజానికి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది కొత్తది కాదు. అప్పటికే కేటాయించిన నీరు, కట్టిన రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసేది ఆ ప్రాజెక్ట్. ఇందులో కొత్త రిజర్వాయర్లు లేవు. ఉన్న వాటికే అష్యూర్డ్ వాటర్ మాత్రమే. ఏనాడూ తెలంగాణ నష్టాన్ని కోరుకోలేదు: తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలని ఏనాడూ నేను అనుకోలేదు. అనుకోను కూడా. అదే సమయంలో రాష్ట్ర ప్రజలకు, అన్యాయం, నష్టం జరగనివ్వబోము. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం. కలిసి మెలిసి పెరిగాం. ఇక ముందు కూడా అలాగే ఉంటాం. మా ప్రభుత్వ హయాంలో ఇవన్నీ చేపట్టాం. చేశాం: – తెలుగు గంగ లింక్ కెనాల్‌ను ప్రారంభం నుంచి 18 కి.మీ వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసి, దాని సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచాం. – శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), జీఎన్‌ఎస్‌ఎస్.. రెండింటి సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్స్‌కు పెంచే పనులు చేపట్టాం. – నిప్పులవాగు ద్వారా నెల్లూరుకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాం – హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ సామర్థ్యాన్ని 2 వేల క్యూసెక్కుల నుంచి 6300 క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టాం. – అవుకులో టన్నెళ్ల నిర్మాణంలో అన్ని సమస్యలు అధికమించి, రెండు టన్నెళ్ల ద్వారా మొత్తం 20 వేల క్యూసెక్కుల నీళ్లు పంపగలిగాం. అందుకోసం రూ.260 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా మూడో టన్నెల్ పనులు కూడా మా హయాంలోనే మొదలుపెట్టాం. – గండికోట ప్రాజెక్టులో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.1000 కోట్లు చెల్లించి, ప్రాజెక్టును పూర్తిస్థాయిలో 27 టీఎంసీలు నింపాం. – చిత్రావతి ప్రాజెక్టులో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలకు రూ.280 కోట్లు చెల్లించి, తొలిసారిగా 10 టీఎంసీలు నింపగలిగాం. – బ్రహ్మంసాగర్‌లో లీకేజీ సమస్యను అధికమించేలా, డయాఫ్రం వాల్ నిర్మించాం. వీటన్నింటి కోసం రూ.90 కోట్లు ఖర్చు చేసి, ప్రాజెక్టులో 17 టీఎంసీలు నింపగలిగాం. – వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్లను పూర్తి చేసి, రెండు దశాబ్ధాల కలను నిజం చేశాం. ప్రాజెక్టును జాతికి అంకితం చేశాం. – సోమశిల, కండలేరు ప్రాజెక్టుల్లో కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు చెల్లించి, పూర్తి చేశాం. సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీల నీరు నింపగలిగాం. మొత్తం రూ.120 కోట్లు ఖర్చు చేసి రెండు డ్యామ్‌ల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తిస్థాయికి చేర్చాం. – దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు పూర్తి చేసి ప్రారంభించాం. – నాగార్జునసాగర్ దిగువన ఉన్న పులిచింతల వద్ద దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేసి, ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో 45 టీఎంసీల నీరు నింపగలిగాం. – ఆ 5 ఏళ్లలో మా పాలనలో ప్రాజెక్టులను ప్రతి ఏటా నింపి కృష్ణా డెల్టాకు నీరందించాం. భోగాపురం ఎయిర్‌పోర్టు అంశం: క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాట్లు: భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నాడు. ఆయన నిజానికి ఆ ఎయిర్‌పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడికి ప్లాన్ చేశారు. మొదట ఆ ఎయిర్‌పోర్టుకు 15 వేల ఎకరాలు కావాలన్నారు. ఆ తర్వాత 5 వేల ఎకరాలు అన్నాడు. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురై ఉద్యమ బాట పట్టారు. మేమూ వారితో గొంతు కలిపి, అధికారంలోకి వచ్చాక, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎయిర్‌పోర్టుతో పాటు, ఏరోసిటీ కూడా కలిపి 2,703 ఎకరాలతో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాం. అందుకోసం కోర్టుల్లో ఉన్న 130 కేసులు పరిష్కరించాం. 3 గ్రామాలో 400 కుటుంబాలు తరలించి, రూ.960 కోట్లతో భూసేకరణ జరిపాం. అవన్నీ చేసి, 2023 మే నెలలో పనులు మొదలుపెట్టి, వేగంగా కొనసాగించాం. టీడీపీ మంత్రి ఉన్నా, ఒరగబెట్టిందేమీ లేదు: అదే చంద్రబాబు అంతకు ముందు సీఎంగా ఉన్నప్పుడు, అదే పార్టీకి చెందిన అశోక గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా, కనీస అనుమతులు తేలేకపోయారు. మేము వచ్చిన తర్వాతనే, కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించాం. కేంద్రం నుంచి ఎన్‌ఓసీ సాధించాం. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా పూర్తి చేశాం. కోవిడ్ వంటి కష్టంలో కూడా అన్నీ దాటుకుని, 2023, మే 3న, భూమి పూజ చేశాం. 2026లో అక్కణ్నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని చెప్పాం. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. అంతే కాకుండా విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేసి, అప్పటి ఆ శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా ఒప్పించాం. (అంటూ నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగ వీడియోను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు). ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’. అదే బాబు విధానం: అలా ఆనాడు చంద్రబాబు కనీసం భూసేకరణ జరపకపోయినా, ఎలాంటి అనుమతులు పొందకపోయినా.. ఇప్పుడు ఎయిర్‌పోర్టు రెడీ అవుతోందని చెప్పి, ఆ క్రెడిట్ పొందేందుకు చంద్రబాబు నానా అగచాట్లు పడుతున్నాడు. కానీ, నిజానికి ఇప్పుడు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు వేగంగా చేరుకోవడానికి సరైన రోడ్డు కూడా లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం ఆ రోడ్డు గురించి అస్సలు పట్టించుకోలేదు. అయినా క్రెడిట్ మొత్తం తమకే దక్కాలని చంద్రబాబు ఏవేవో చేస్తున్నారు. ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’.. అదే చంద్రబాబు విధానం. తాను ఏమీ చేయడు. ఎవరో చేసిన పని తాను చేసినట్లు చెబుతాడు. తన ఖాతాలో వేసుకుంటాడు. క్రెడిట్ చోరీలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పరిశ్రమలు–వాస్తవాలు. పరిశ్రమల పురోగతిపై ఆర్బీఐ నివేదిక: మా హయాంలో ఇక్కణ్నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయని పదే పదే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. అదే పనిగా ఎల్లో మీడియాలోనూ, సోషల్ మీడియా (అబద్దాల ఫ్యాక్టరీ)లోనూ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ తప్పు అని చెబుతూ, గత నెల.. డిసెంబరు 11, 2025న ఆర్బీఐ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. ఉత్పత్తి రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ)కు పన్నులు కలిపితే, అది జీడీపీ అవుతుంది. మా హయాంలో తయారీ రంగంలో జీవీఏలో రాష్ట్రం దక్షిణ భారత్‌లో తొలిస్థానంలో నిలవగా, దేశంలో 5వ స్థానంలో నిల్చాం. అలాగే ఆ 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు.. ఇండస్ట్రియల్ జీవీఏ చూస్తే.. అందులో కూడా దక్షిణ భారత్‌లో తొలి స్థానంలోనూ, దేశంలోనే 5వ స్థానంలో నిల్చాం. ఇవీ వాస్తవాలు. కానీ, చంద్రబాబు ఏమంటాడు. ఆయనకు ఒక పైశాచిక ఆనందం. మాపై టన్నుల కొద్దీ బురద చల్లుతుంటాడు. చంద్రబాబు హయాంలోనే పరిశ్రమలు తరలిపోయాయి: నిజానికి చంద్రబాబుగారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. సజ్జన్ జిందాల్, అరవిందో, మై హోం సిమెంట్స్, భారతి సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్‌కో, షిర్డి సాయి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, యూబీ కంపెనీ.. ఇవన్నీ చంద్రబాబు వల్ల భయపడి, ఇబ్బందులు పడలేక తరలిపోయాయి. ఇంకా రాష్ట్రంలో ఏ పరిశ్రమ అయినా వీళ్లకు కప్పం కట్టకపోతే, అవి నడిపే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు మరో డ్రామా: ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా చంద్రబాబు, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో చెప్పలేదు. దీంతో డైవర్షన్ కోసం విచిత్రంగా పారిశ్రామిక ప్రతిపాదనల్లో రాష్ట్రం తొలి స్థానంలో ఉందంటూ ప్రచారం మొదలుపెట్టారు. అనుకూల మీడియాలో స్టోరీలు నడిపారు. అలా ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు కొత్త కాదు. 2014–19 మధ్య కూడా అదే పరిస్థితి. ‘అనౌన్స్‌మెంట్స్ ఆర్ నాట్ ఇన్వెస్ట్‌మెంట్స్’. ‘పబ్లిసిటీ ఈజ్ నాట్ రియాలిటీ’: భారీ, అతి భారీ పారిశ్రామిక రంగం: వంటవాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి, కూర్చోబెట్టిన వారిని పక్కనపెడితే.. వాస్తవంగా భారీ, అతిభారీ పారిశ్రామిక రంగంలో వచ్చిన పెట్టుబడులు ఒకసారి చూస్తే.. 2014–19 మధ్య రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సమాచార హక్కు (ఆర్టీఐ) ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం..2014–19 మధ్య రాష్ట్రంలో భారీ, అతి భారీ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు రూ.50,708 కోట్లు కాగా, వాటి ద్వారా 84,333 ఉద్యోగాలు వచ్చాయి. అదే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య రెండేళ్లు కోవిడ్ ఉన్నా.. రూ.69,799 కోట్ల పెట్టుబడులతో ఆ పరిశ్రమలు ఏర్పాటు కాగా, వాటి ద్వారా 90,230 ఉద్యోగాలు లభించాయి. ఎంఎస్‌ఎంఈ రంగం: ఇంకా ఎంఎస్‌ఎంఈ రంగంలో కూడా అంతే. చంద్రబాబు హయాంలో అంతా తిరోగమనం. కూటమి ప్రభుత్వ హయాంలోనే 2024 నవంబరులో విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే (సోషియో ఎకనామిక్ సర్వే) రిపోర్ట్ చూస్తే.. 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో, ఆ 5 ఏళ్లలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఇది మేము చెబుతుంది కాదు. చంద్రబాబు రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్. అదే చంద్రబాబు హయాంలో చూస్తే 9.50 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని ఆయన రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది. మరి ఇప్పుడు చెప్పండి. ఎవరి హయాంలో విధ్వంసం? ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు?. ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలకు ఊరట, భరోసా లభించిందో చెప్పండి. ప్రోత్సాహకాల్లోనూ అవినీతిపర్వం: ఈరోజు పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలు ఒక్క ఎంఎస్‌ఎం రంగంలోనే రూ.2 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఇచ్చే నాధుడు లేడు. పట్టించుకునే నాధుడు లేడు. ఇంకా వాస్తవం ఏమిటంటే.. మొత్తం పారిశ్రామిక రంగం ప్రోత్సాహకాలు, రాయితీల బకాయిలు రూ.8 వేల కోట్లకు పైగా ఉంటాయి. పరిస్థితి ఏమిటంటే.. రెండు బకెట్లు పెట్టారంట!. ఒక బకెట్‌లో 30 శాతం ఎవరు కమీషన్ ఇస్తే వారి పేరు పెడతారంట. రెండో బకెట్‌లో న్యూట్రల్‌గా కనిపించడానికి కేవలం 20 శాతం మాత్రం పెడతారంట!. కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ల పేర్లు పెట్టి, వాళ్లకు 20 శాతం టోటల్ అమౌంట్ ఇస్తారంట!. ఇది జరుగుతున్న స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా ఏమొస్తాయి పరిశ్రమలు?. ఇండస్ట్రియల్ ఇన్‌సెంటీవ్స్‌లోనూ డబ్బులు దోపిడీ చేస్తుంటే. మరో ఆశ్చర్యకరమైన స్కామ్!: పరిశ్రమల పేరుతో అవినీతి: పేరుకు ఒకటి, రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా భూమి ఇస్తున్నట్లు ప్రకటించి, ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూములను తన మనుషులు, తన బినామీలకు ఇచ్చేస్తాడు. విశాఖలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలూ కంపెనీకి ఇచ్చారు. ఎలాంటి టెండర్, ఆక్షన్ లేకుండా కేవలం, ఆ కంపెనీ లెటర్ రాయగానే, మాల్ కట్టేందుకు ఆ భూమి ఇచ్చేశారు. అదే లూలూ గ్రూప్ రూ.519 కోట్లకు 16 ఎకరాలు అహ్మదాబాద్‌లో కొనుక్కుని మాల్ కడుతుంటే.. ఇక్కడ 14 ఎకరాల భూమి ఫ్రీగా ఇచ్చారు. గుజరాత్‌లో లూలూ కంపెనీ భూమి కొనుగోలుతో స్టాంప్ డ్యూటీ కింద రూ.31 కోట్లు ఆదాయం వచ్చిందని ఆ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా సత్వా గ్రూప్, కపిల్ గ్రూప్, ఏఎన్‌ఎస్‌ఆర్ గ్రూప్‌లకు కూడా ఎలాంటి ఆక్షన్ లేకుండా ఫ్రీగా భూములిచ్చేస్తున్నారు. పక్కన తెలంగాణలో భూముల వేలంలో ఒక్కో ఎకరం దాదాపు రూ.175 కోట్లు పలుకుతుంటే.. ఇక్కడ ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమి కేవలం రూ.1.50 కోట్లకు ఇచ్చారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్ గ్రూప్‌నకు 10 ఎకరాలు ఇచ్చారు. అలా ఒకవైపున అలా భూములు ఇవ్వడమే కాకుండా, మరోవైపు ల్యాండ్ యూసేజ్‌లో వాళ్లు బిల్డింగ్‌లు కడితే, చదరపు అడుగుకు రూ.2 వేలు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందట!. అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డింగ్‌లు కడితే, ప్రభుత్వం నిధులు ఇవ్వడం ఏమిటి? ఎంత అవినీతి!. రాష్ట్రం అప్పులకుప్ప: ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక, ఒక్కో దగ్గర ఒక్కో అంకె చెబుతున్నారు. కానీ వాస్తవాలు చూస్తే.. ఉమ్మడి రాష్ట్ర విభజన నాటికి, రాష్ట్ర మొత్తం అప్పులు రూ.1,40,717 కోట్లు కాగా, చంద్రబాబు దిగిపోవడానికి రెండు నెలల ముందు వరకు, అంటే 2019, మార్చి 31 నాటికి ఆ అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే చంద్రబాబు తన హయాంలో ఆ 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.2,49,350 కోట్లు. అంటే ఏటా పెరిగిన (సీఏజీఆర్) అప్పులు 22.63 శాతం. ఇక 2019, మార్చి 31 నాటికి ఉన్న అప్పులు రూ.3,90,247 కోట్ల నుంచి 2024, మార్చి 31 వరకు, ఆ 5 ఏళ్లలో రూ.7,21,918 కోట్లకు చేరాయి. అంటే మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో పెరిగిన అప్పులు రూ.3,32,671 కోట్లు కాగా, వార్షిక అప్పుల పురోగతి (సీఏజీఆర్) 13.57 శాతమే. పైగా మేము చేసిన అప్పులో ఏకంగా రూ.2.74 లక్షల కోట్లు పలు పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేశాం. 18 నెలల్లో రూ.3 లక్షల కోట్లు: కాగా, 2024లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 18 నెలల్లోనే ఏకంగా రూ.3,02,303.70 కోట్లు అప్పు చేసింది. అంటే మా 5 ఏళ్ల పాలనలో చేసిన అప్పులో 90 శాతం కేవలం ఈ 18 నెలల్లోనే చంద్రబాబు చేశారు. పైగా ఏ స్కీమ్‌లు అమలు చేయడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రూ.30 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. మనం ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి, వాటిని క్రమం తప్పకుండా అమలు చేస్తే.. ఈ ప్రభుత్వం అప్పుల కోసం క్యాలెండర్ విడదుల చేస్తోంది. వచ్చే 3 నెలల్లో మరో రూ.11 వేల కోట్ల అప్పు కోసం ఆర్బీఐ వద్ద ఇండెంట్ పెట్టారు. అప్పులు చేయడంలో ఒక పద్ధతి కూడా అమలు చేయడం లేదు. యథేచ్ఛగా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. బాదుడే బాదుడు: – 18 నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో రూ.20,135.50 కోట్లు. – రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50 శాతం పెంచారు. – గ్రామాల్లో తాగునీటిపైనా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. – కొత్త వాహనాలపై 10 శాతం రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు. (తగ్గించిన జీఎస్టీని, ఈ రూపంలో వసూలు చేస్తున్నారు). అన్ని రకాల రోడ్లకు టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే, ఇప్పుడు మరో రూపంలో రోడ్ సెస్ పేరిట బాదుతున్నారు. ఆదాయం పతనం. మొత్తం దోపిడి: రాష్ట్ర ఆదాయం దారుణంగా తగ్గుతోంది. ఎక్కడికక్కడ దోపిడి. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్›్జ.. దేన్నీ వదలడం లేదు. అన్నీ యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఆ మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి పోతోంది. అధిక ధరలకు పీపీఏలు చేస్తూ, కమిషన్లు దండుకుంటున్నారు. ఎక్కడ చూసినా పేకాట క్లబ్‌లు. ఏ ఊళ్లో చూసినా రేషన్ మాఫియా కింది నుంచి పైదాకా ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. అంత దారుణ వ్యవస్థను ఈ ప్రభుత్వం నడిపిస్తోంది. మీడియా ప్రశ్నలకు బదులుగా.. ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్: మెడికల్ కాలేజీలకు టెండర్లు రాకపోవడం సంతోషకరం. మంచి విషయం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7వ తేదీ) హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా వేశాం. దాన్ని కోర్టు కూడా ఆమోదించింది. ప్రభుత్వానికి సమన్లు పంపించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఈ దశాబ్దంలో అతి పెద్ద స్కామ్. కట్టిన కాలేజీలు ప్రైవేటుకి ఇవ్వడమే కాకుండా, రెండేళ్లు జీతాలు కూడా ఇవ్వడం స్కామ్ కాక మరేమిటి?. ఉద్యమం కొనసాగుతుంది: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కేవలం ఆ ప్రాంతానికే కాకుండా, రాష్ట్ర ప్రజలకు కూడా కీలకం. ఎందుకంటే కృష్ణా నీళ్లు మనకు అందుబాటులోకి వస్తాయి. అందుకే ఆ దిశలో నాడు అడుగులు వేశాం. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేస్తాం. ఇంకా తాము తిరిగి అధికారంలోకి రాగానే, వాయువేగంతో రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులన్నీ పూర్తి చేస్తామని శ్రీ వైయస్ జగన్ వివరించారు.