అమరావతి: వైయస్సార్, తిరుపతి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ శ్రేణులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నాయని పార్టీ నేతలు ఆరోపించారు. పలుచోట్ల నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేయడం, అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లాలో కడప కార్పొరేషన్, పులివెందుల సహా పలు ప్రాంతాల్లో నామినేషన్ కేంద్రాల వద్ద అడ్డంకులు సృష్టించారని, కమలాపురం, రాయచోటిలో వైయస్ఆర్‌సీపీ నామినేషన్లు వేయలేని పరిస్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు తెలిపాయి. పులివెందులలో అభ్యర్థులను తుపాకులతో బెదిరించారని, సుమారు 262 మందిపై కేసులు నమోదు చేశారని ఆరోపించాయి. ప్రొద్దుటూరులో చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై దాడి జరిగినట్లు పేర్కొన్నాయి. తిరుపతిలో మేయర్ అభ్యర్థి వాసు నామినేషన్ దాఖలు చేసేందుకు హెల్మెట్ ధరించి, కార్పొరేషన్ కార్యాలయం వెనుకవైపు నుంచి వెళ్లాల్సి వచ్చిందని వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. పుంగనూరులో మొదటి వార్డు అభ్యర్థి కమలమ్మ నామినేషన్ పత్రాలు చించివేశారని, పుత్తూరులో జయప్రకాష్‌ను అడ్డుకున్నారని, నగరిలో ఇద్దరు అభ్యర్థుల పత్రాలు చించివేసి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. సీపీఐ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు కూడా తిరుపతిలో అడ్డంకులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పలుచోట్ల అడ్డంకులను నివారించలేదని, కొన్నిచోట్ల అభ్యర్థులను అడ్డుకుని, కార్యకర్తలపై లాఠీచార్జి చేసి కేసులు నమోదు చేశారని వైయస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించలేదని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరిపి, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రతిపక్ష అభ్యర్థుల ఎన్నికల హక్కులను కాపాడాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.