ఇక కరువు సీమలో పైరు పచ్చల కళకళ

రాయలసీమలో రూ.33,869 కోట్లతో కరువు నివారణకు ప్రణాళిక  

కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో నీటిని ఒడిసిపట్టుకోవాలని నిర్ణయం  

 ప్రాజెక్టులు నింపే పనులకు సీఎం వైయస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 

అమరావతి: దుర్భిక్షానికి చిరునామాగా మారిన రాయలసీమను సుభిక్షంగా మార్చాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపడం ద్వారా ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి వరద నీటిని ఒడిసిపట్టి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు తరలించేందుకు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టనున్నారు. ఇందుకు రూ.33,869 కోట్ల వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఈ పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చి.. టెండర్లు పిలవాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.  

శరవేగంగా ప్రణాళిక అమలు   
రాయలసీమ కరవు నివారణ ప్రణాళికను శరవేగంగా అమలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణం, చక్రాయిపేట ఎత్తిపోతల, కుందూ ఎత్తిపోతల పథకాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి సర్కార్‌ అనుమతి ఇచ్చింది. మిగిలిన పనులకు డీపీఆర్‌లు తయారు చేసి.. ఆ పనులు చేపట్టడానికి పరిపాలనా అనుమతి ఇవ్వాలని ఆదేశించింది.   

కరవు  నివారణ  ప్రణాళిక  

  • శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్‌బీసీ).. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాలకు నీటిని విడుదల చేస్తారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం, ఆ నీటిని బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌(బీసీఆర్‌) వరకూ తరలించే పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పనులకు రూ.571 కోట్లు వ్యయం కానుంది.  
  • శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు రోజుకు 3 టీఎంసీల చొప్పున బీసీఆర్‌కు తరలించి.. అక్కడి నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు జలాలను సరఫరా చేయడానికి శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతం నుంచి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రాయలసీమ ఎత్తిపోతలగా నామకరణం చేసింది. ఈ పథకానికి రూ.3,890 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 
  • పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి విడుదల చేసే జలాలను పూర్తిస్థాయిలో తరలించేలా నిప్పుల వాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటికి రూ.1,501 కోట్లు వ్యయం అవుతుంది.  
  • కుందూ వరద నీటిని ఒడిసిపట్టేలా రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ.. జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,677 కోట్లు వ్యయం కానుంది.  
  • పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరిన జలాలను ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి కాలువల ద్వారా గోరకల్లు జలాశయానికి తరలించడానికి వాటి సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,149 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.  
  • గాలేరు–నగరి నుంచి వెలిగల్లు, కాలేటి వాగు, శ్రీనివాసపురం రిజర్వాయర్లను నింపడానికి చక్రాయిపేట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,600 కోట్లు అవసరం.  
  • వైఎస్సార్‌ జిల్లాలో ముద్దనూరు వద్ద కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 
  • గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యం పెంపు పనులకు రూ.6,310 కోట్లు.. రెండో దశలో కాలువల సామర్థ్యం పెంపు.. జిల్లేడుబండ రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.1,518 కోట్లు అవసరమని అంచనా.  పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపు ప్రణాళిక 

తాజా వీడియోలు

Back to Top