చ‌రిత్ర‌లో సువ‌ర్ణాధ్యాయం

ఏపీలో రిజ‌ర్వేష‌న్ల విప్ల‌వం

బీసీ,  ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీ, మ‌హిళ‌ల‌కు నామినేటెడ్ పోస్టులు, స‌ర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్

ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానిక యువ‌త‌కు 75 శాతం ఉద్యోగాలు

బీసీల‌కు శాశ్వ‌త క‌మిష‌న్ ఏర్పాటు

మొట్ట మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం

స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న తెలుగు ప్ర‌జ‌లు

అమ‌రావ‌తి: వెనుక‌బ‌డ్డ కులాల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన డా.బి.ఆర్ అంబేడ్క‌ర్ చ‌రిత్ర‌ను ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిర‌గ‌రాశారు. మైనారిటీల‌కు 8శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విప్ల‌వాత్మ‌క మార్పుకు శ్రీ‌కారం చుట్ట‌గా..ఆయ‌న త‌న‌యుడు, జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో రెండు అడుగులు ముందుకు వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు, మ‌హిళ‌ల‌కు నామినేటెడ్ పోస్టుల్లో, స‌ర్వీస్ కాంట్రాక్టులు, నామినేష‌న్ ప‌నుల్లో 50 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించి సంక్షేమ నాయ‌క‌త్వానికి నిద‌ర్శ‌నంగా నిలిచారు. శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న బీసీ క‌మీష‌న్ ఏర్పాటు చేయ‌డం, ప‌రిశ్ర‌మ‌ల్లో 75శాతం స్థానికుల‌కు ఉద్యోగాలు అందించేలా చ‌ట్టం రూపొందించారు. 
అన్ని కులాల‌కూ స‌మాన అవ‌కాశాలు అందిస్తూ, అస‌మాన‌త‌ల‌ను తొల‌గిస్తూ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తున్న‌ తొలి ముఖ్య‌మంత్రిగా నిలిచారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

నామినేటెడ్ లో ఇక స‌గం వీరికే
సోమ‌వారం నాడు శాస‌న స‌భ‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ ఈ బిల్లులను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చరిత్రాత్మక బిల్లుల్ని రూపొందించింది. అన్ని ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను ఒక బిల్లులో ప్రతిపాదించగా, మరో బిల్లులో అన్ని ప్రభుత్వ నామినేటెడ్‌ పనుల్లో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ప్రవేశపెట్టారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ, పనుల్లోనూ ఆయా వర్గాల మహిళలకే 50 శాతం చొప్పున రిజర్వేషన్‌ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల అభ్యున్న‌తికి తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యాల బిల్లుల‌ను మంగ‌ళ‌వారం శాస‌న స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది. 
ఇక‌పై నామినేట్‌ చేసే  చైర్‌పర్సన్‌ పదవుల్లో కూడా ఈ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. నామినేట్‌ చేసే డైరెక్టర్లు, సభ్యుల పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లు దేవాదాయ చట్టం కింద ఏర్పడిన బోర్డులు, ట్రస్టులకు, వక్ఫ్‌ బోర్డు చట్టం కింద ఏర్పడిన పదవులకు వర్తించవని ప్రభుత్వం తెలియ‌జేసింది. నామినేటెడ్‌ పోస్టుల్లో ఈ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులను సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షిస్తుంది. వెనుక‌బ‌డ్డ‌ వర్గాలకు సమానావకాశాలు కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నామినేటెడ్‌ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. నామినేటెడ్‌ పనుల్లో రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్‌ శాఖ ఈఎన్‌సీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిల్లో నామినేటెడ్‌ పనుల్లో, సర్వీసు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్ల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. సర్వీసు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఉద్యోగాల్లో స్థానికుల‌కు పెద్ద పీట‌
ప‌రిశ్ర‌మ‌ల్లో అర్హులైన స్థానికుల‌కు 75శాతం ఉద్యోగాలు క‌ల్పించేలా చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చారు వైఎస్ జ‌గ‌న్. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో చెప్పిన విధంగానే స్థానికుల‌కే ఉద్యోగాలు ల‌భించేలా బిల్లును రూపొందించి శాస‌న స‌భ‌లో ఆమోదించారు. ఈ బిల్లు ప్ర‌కారం స్థానికంగా అర్హులైన అభ్యర్ధులు అందుబాటులో లేకపోతే మూడేళ్ల లోపు వారికి అవసరమైన శిక్షణ ఇప్పించి ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏర్పాటైన అన్ని పరిశ్రమలు లేదా కర్మాగారాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే సంయుక్త ప్రాజెక్టులతో పాటు ఇకపై రాబోయే వాటికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలైతే.. చట్టం అమల్లోకి వచ్చిన మూడేళ్ల లోపు 75 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకోవాలి.

ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప్ర‌భుత్వానికి అడుగ‌డుగునా అడ్డు ప‌డ్డారు ప్ర‌తిపక్ష నేత‌లు. నామినేటెడ్ ప‌ద‌వులు, నామినేష‌న్ పై ఇచ్చే ప‌నుల్లో బీసీల‌కు, ఎస్సీ ఎస్టీల‌కు, మహిళ‌ల‌కు, మైనారిటీల‌కు 50శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన ప్ర‌భుత్వం దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ మాత్ర‌మే. ఈ ప్ర‌భుత్వానికి, ముఖ్య‌మంత్రికి వ‌స్తున్న పేరు చూసి ఓర్వలేక‌, బీసీల‌, బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం ద‌క్క‌డాన్ని స‌హించ‌లేకే టీడీపీ కుట్ర‌లు చేస్తోంది. చారిత్రాత్మ‌కమైన ఈ బిల్లుల‌ను అడ్డుకునేందుకు చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నేత‌లూ త‌మ సాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. కానీ సంక్షేమ స్వాప్నికుడి ల‌క్ష్యం ముందు వారి కుతంత్రాలు ఫ‌లించ‌లేదు. అన్ని స్థాయిల్లోని ప‌ద‌వుల్లో, అవ‌కాశాల్లో బ‌డుగుల‌కు, మైనారిటీల‌కు ప్రాతినిధ్యం ఇవ్వాల‌న్న డా. అంబేడ్క‌ర్ ఆశ‌యం, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి క‌ల వైఎస్ జ‌గ‌న్ గారి పాల‌న‌లో సాకారం అయ్యాయి. ఇది కేవ‌లం ఓ ప్ర‌భుత్వ విజ‌యం కాదు. ఓ ముఖ్య‌మంత్రి సాధించిన ఘ‌న‌త మాత్ర‌మే కాదు. కోట్లాదిమంది ఆంధ్రుల న‌మ్మ‌కం  గెలుచుకున్న విజ‌యం. యువ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన అన‌తికాలంలోనే విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌డ‌మే కాకుండా మొట్ట‌మొద‌టి స‌మావేశాల్లోనే తాను రూపొందించిన చారిత్రాత్మ‌క బిల్లుల‌కు ఆమోదం తెల‌ప‌డం ప‌ట్ల తెలుగు ప్ర‌జ‌లు స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం ఓ  సువ‌ర్ణ అధ్యాయం అంటూ కొనియాడుతున్నారు.హ్యాట్సాఫ్ జ‌గ‌న్ అంటూ నిన‌దిస్తున్నారు.
 

Back to Top