'సమైక్య శంఖారావం' సభ పిలుస్తోంది..రా!

సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నలు మూలల నుంచి సమైక్యవాదులు తరలివచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకున్నారు. సమైక్యాంధ్ర ఆకాంక్ష ఢిల్లీ పెద్దలకు స్పష్టంగా తాకేలా చేసేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో 'సమైక్య శంఖారావం' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. సమైక్య పోరాటాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకుపోతున్న పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు ఈ సభ జరుగుతోంది.
హైదరాబాద్, 21 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుట్రలను తిప్పికొట్టేందుకు.. సమైక్యాంధ్రప్రదేశ్ ‌లక్ష్యంగా చిత్తశుద్ధితో అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఏకైక పార్టీగా ప్రజల మన్ననలు పొందుతున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అదే స్ఫూర్తితో సమైక్య శంఖారావాన్ని పూరించింది. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ఈ నెల 26న భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సామాన్యులు ఉత్సాహంగా ఉన్నారు. సభకు తరలివెళ్ళే వారి కోసం పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రాన్ని విభజించడానికి నిర్ణయం తీసుకున్నామంటూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నాయకులు ప్రకటన చేసిన రోజు నుంచే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్యాయం లేదా సమైక్య రాష్ట్రం అనే నినాదంతో ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే. సమన్యాయం జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో సమైక్యాంధ్రను కాపాడుకోవాలని పార్టీ నిర్విరామంగా పోరాటం చేస్తోంది. పార్టీ అధినాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ నాయకులు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

సమైక్యాంధ్రే లక్ష్యంగా పార్టీ అధినేత సోదరి శ్రీమతి షర్మిల చేసిన సమైక్య శంఖారావం బస్సు యాత్రకు అన్ని ప్రాంతాల్లోనూ వేలాది మంది ప్రజలు హాజరై మద్దతుగా నిలిచారు. పార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సభలు, సమావేశాలు, దీక్షలే కాకుండా వివిధ రూపాల్లో ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సమైక్య శంఖారావం బహిరంగ సభను అడ్డుకుంటామని తెలంగాణవాదుల హెచ్చరికల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచీ అనేక మంది హైదరాబాద్‌లోని తమ తమ బంధువులు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ నెల 26న సభా వేదిక వద్దకు నేరుగా వెళ్లవచ్చనే ఆలోచనతో పలువురు ముందే హైదరాబాద్‌కు పయనమయ్యారు. పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు సభకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక రైళ్ళను నాయకులు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న బయలుదేరేలా ప్రత్యేక రైళ్ళను బుక్ చేశారు. రైళ్ళలోనే కాకుండా  ఎవరికి వారు కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నారు. ఇక నుంచి తాము వేసే ప్రతి అడుగూ సమైక్యాంధ్ర కోసమేనని వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు స్పష్టం‌గా చెబుతున్నారు.

సమైక్య ఆకాంక్ష ఢిల్లీకి తాకాలి : కుడుపూడి
ఆరున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఢిల్లీ పెద్దలను తాకేలా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగే సమైక్య శంఖారావం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సమైక్యవాదులంతా పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. ఈ సభకు లక్షలాదిగా సమైక్యవాదులు తరలివచ్చి తమ ఆకాంక్షను దేశవ్యాప్తంగా వినిపించేలా చేయాలన్నారు. ఉద్యోగులు, ఏపీ‌ ఎన్జీఓలు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన ఈ సమయంలో సమైక్యవాణిని బలంగా చాటాలంటే సమైక్యవాదులు ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచీ పోరాడుతున్నది వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీయేనని, పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రెండుసార్లు, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఒకసారి ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేశారన్నారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి చేసిన విభజన కుట్రను తిప్పికొట్టేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, యువత ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

సమైక్య శంఖారావం పూరించండి - సురేష్‌బాబు :
సమైక్య శంఖారావం సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ కడప జిల్లా కన్వీనర్ కె.సురే‌ష్‌బాబు, కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. పార్టీ అధినేత పిలుపు మేరకు హైదరాబాద్‌లో జరిగే సభకు పార్టీ కార్యకర్తలు, అన్ని విభాగాల అనుబంధ సంస్థలు, సర్పంచులు,‌ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, జగననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి అభిమానులు సభకు తరలి రావాలన్నారు. పార్టీలకు అతీతంగా సభ జరుగుతున్నందున సమైక్యానికి కట్టుబడిన పార్టీలతో పాటు సమైక్యవాదులందరూ హాజరు కావాలని కోరారు.

రండి... కదలిరండి - బాలినేని :

సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ బాధ్యత భుజానికెత్తుకున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఆ దిశగా కదం తొక్కుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ యుద్ధభేరి మోగించింది. ‘సమైక్య శంఖారావం’ సభకు ఒంగోలు జిల్లా సమాయత్తమవుతోంది. జిల్లా నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కదలి రావాలని పార్టీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

తెలుగువారి ఐక్యత, భావి తరాల భవితను కాపాడటానికి పార్టీ మహాయజ్ఞంలా తలపెట్టిన సమైక్య శంఖారావం సభను నిర్వహించాలని తీర్మానించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఢిల్లీపై చేస్తున్న ప్రజా పోరాటంగా ఈ సభను బాలినేని అభివర్ణించారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఈ సభే చివరి అవకాశంగా ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేయాలని అన్నారు.

వాల్‌పోస్టర్ ఆవిష్కరణ‌ :
సమైక్య శంఖారావం వాల్‌పోస్టర్‌ను వైయస్ఆర్ సీఎ‌ల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ‌తన నివాసంలో ఆవిష్కరించారు. సమైక్య రాష్ట్రాన్ని కేవలం సీమాంధ్రులే కోరుకుంటున్నారని భావించడం సరికాదన్నారు. తెలంగాణ  జిల్లాల్లో సైతం సమైక్యంగా ఉండడం వల్ల కలిగే ఫలితాలు, విడిపోతే ఎదురయ్యే సమస్యలు తెలుసుకున్న అనేక మంది సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారన్నారు.

Back to Top