అయ్య బాబోయ్..చంద్రబాబు కామెడీ

  • నలుగురు నవ్విపోదురు గాక
  • ఇక పట్టిసీమ నదా?
  • కృష్ణా, గోదావరి నదులు దానికి ఉపనదులా?
  • పోలవరానికి కాపర్‌ గేట్లు?
  • డ్రోన్లతో వ్యవసాయమా?
  • ఏపీ సీఎం వ్యాఖ్యలతో అయోమయం జగన్నాథం
రాష్ట్ర జలవనరుల ముఖ చిత్రంలో ఒక కొత్త నది వచ్చి చేరిందట. ఇప్పటికే ఉన్న కృష్ణా, గోదావరి నదులే కాకుండా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలు తీర్చే మరో నది ప్రజలకు చేరువైందట. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కోసం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ఇకపై నదిగా ఆవిర్భవించిందట. ఈ మాటలన్నది ఎవరో తెలుసా సాక్ష్యాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇటీవల ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఎన్‌టీఆర్‌ను రాజకీయాల్లోకి రమ్మన్నదీ తానేనని, తన కొడుకు నారా లోకేష్‌ చెబితే ప్రధాని పదవి వద్దనుకున్నానని ఇటీవల శాసన మండలిలో ప్రకటించుకున్న చంద్రబాబు వారం రోజుల్లోనే మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. 

గతంలో బాబు చెప్పిన మాటలు వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. అవేంటో చూసేద్దాం.... గూగుల్ సీఈవో సత్యనాదేళ్లకు స్ఫూర్తి నేనే.  బిల్‌గేట్స్‌ కూడా తనను చూసి ఉద్వేగపడిపోయి కౌగిలించుకున్నాడు. రాష్ట్ర పతులు, ప్రధానులను తయారు చేశాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు భారత రత్న ఇప్పించింది నేనే. సింధుకు ఒలింపిక్స్‌లో పతకం వచ్చేలా చేసింది నేనే.  2019లో అమరావతిలో ఒలింపిక్స్‌ ఏర్పాటు చేస్తా. గతంలో ఇండియాకు సెల్‌ఫోన్‌ తీసుకొచ్చింది, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది నేనేనంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన గొప్పులు విని తెలుగు ప్రజలు నవ్వుకున్నారు. బాబుకు ఏదో అయిందని చర్చించుకున్నారు కూడా. అంతే కాదు కరువు, హుద్ హుద్ తుఫాన్ కూడా నన్ను చూసి పారిపోయాయి అంటూ బాబు చెప్పడం హాస్యాస్పదం. 

ఇది చాలదన్నట్లు రెండు చెంబుల నీళ్లు గోదావరి నుంచి ఎత్తిపోసి రెండు నదులను అనుసంధానం చేసినట్లు ప్రచారం చేసిన పెద్దమనిషి ఇప్పుడు ఏకంగా పిల్ల కాల్వను మహానది అని పోల్చారు. దీన్ని ఓ వర్గం మీడియా పట్టిసీమ నది అంటూ కథనాలు రాయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  50 వేల క్యూసెక్కులు పారే కాలువను నది అనకుండా ఏమంటాం మరి అని ఇంజనీర్లనే బోల్తా కొట్టించారు. పట్టిసీమ చంద్రబాబు నిర్మించిన మహానది అట. అయితే ఇప్పుడిక ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఈ పట్టిసీమకు ఉపనదులుగా భావించాలా?...కృష్ణా, గోదావరి పుష్కరాల మాదిరి బాబు పట్టిసీమకు పుష్కరాలు నిర్వహిస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అపర మేధావి!
ఇన్నాళ్లు బాబు మనకు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు కనిపెట్టిన సాఫ్ట్‌వేర్‌ నిపుణుడిగానో.., హైదరాబాద్‌ లాంటి అంతర్జాతీయ నగరాన్ని నిర్మించిన ఒక మేధావిగానో.., సింధు, గోపీచంద్‌లాంటి క్రీడాకారులను తీర్చిదిద్దిన ద్రోణాచార్యుడిగానో తెలుసు. అంతకుమించి బాబులో తాజా మరో కోణం వెలుగుచూసింది. అదేంటో తెలుసా.. బాబు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్‌ అర్దర్‌ కాటన్‌ దొరలను మించిన ఇంజినీర్‌. నిజమేనండీ నమ్మాలి. పోలవరం ప్రాజెక్టులో బాబు తన ప్రతిభను చూపెట్టాడు తెలుసా. భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు వరద ముంపును తట్టుకోవడానికి ఏర్పాటు చేసే కాఫర్‌ డ్యామ్‌ల ఎత్తుపెంచి గేట్లు పెట్టి దాన్నే పూర్తిస్థాయి ప్రాజెక్టుగా మార్చేయొచ్చంటా.. ఇంజినీర్లకు ఆయన సలహా ఇచ్చాడు మరి. మామూలుగా నిర్మించేదాని కంటే ఇంకొంచెం బలంగా నిర్మిస్తే చాలంట. చూశారా బాబు తెలివితేటలు. ఇంతవరకు ఈ ఆలోచన రాక ప్రపంచ దేశాలంతా ముందుగా కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించడం.. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం పూర్తవగానే కాఫర్‌ డ్యామ్‌ను కూల్చడం చేస్తున్నాయి పాపం... భూమిలో నీటిని నిల్వ చేయగల సమర్ధుడు చంద్రబాబు. కాఫర్‌ డ్యామ్‌కు గేట్లు పెట్టేసి 2018 కల్లా పోలవరం పూర్తయినట్లు ప్రకటించేస్తాడట. పోలవరం కుడి కాల్వ కట్టిందే 17,500 క్యూసెక్కులయితే 50 వేల క్యూసెక్కుల నీరు పారే మహానది పట్టిసీమ అని దబాయించి మరీ చంద్రబాబు చెబుతున్నారు. డ్రోన్లతో వ్యవసాయం అంటున్నాడు, డ్యాష్‌ బోర్డుతో పాలన అంటున్నాడు. రెయిన్‌ గన్లతో నీటిపారుదల అంటున్నాడు. రెప్పొద్దున అమరావతిని కొత్త గ్రహం అని పిలవాలని అంటాడేమో. చంద్రబాబు మాటలు వింటుంటే ఆయన మతిభ్రమించినట్లు అర్థమవుతోంది. 

పోలవరం మహానేత పుణ్యం
దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఎట్టకేలకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కదలిక వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు సాధించి, ఎంతో కష్టపడి ఒరిస్సా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలను ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. కాలువల నిర్మాణం కూడా చకచకా జరిగిపోయింది. అయితే మహానేత అర్ధాంతరంగా తనువు చాలించడంతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయమైంది.  రాష్ట్రం రెండు ముక్కలైంది. అభివృద్ధి ఆగిపోయింది. దశాబ్దాలుగా కలిసున్న తెలుగు జాతి రెండుగా చీలిపోయింది. అభివృద్ధి స్థానంలో రాజకీయాలు వచ్చి చేరాయి. మహానేత హయాంలో నిర్మించిన పోలవరం కుడి కాల్వ ద్వారా కొద్ది దూరం నీళ్లు తీసుకెళ్లి నదుల అనుసంధానం అయిపోయిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం దురదృష్టకరం. మతి చెడి మాట్లాడుతున్న చంద్రబాబుకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రతీ నోట వినిపిస్తున్న మాట.

 
Back to Top