టీడీపీ కొత్త డ్రామా షురూ...హస్తినలో చేసిన హడావిడి ఇక చాలిచండి అంటున్నాడు చంద్రబాబు. ఎంపీల వీర పెర్ఫార్మెన్స్ లకు మోదీ కొద్దిగా కూడా రియాక్టవ్వ లేదు. ఖాళీ సీటు ముందు నిరసనలు, ప్రధాని లేనప్పుడు ఆయన నివాసం ముందు మెరుపు ధర్నా చేసి కొద్ది గంటలకే మెరుపల్లే మాయమైపోడాలు, నాలుగేళ్లుగా హోదాపై మౌనంగా ఉన్న పద్ధతిలోనే మౌన ధర్నాలను మహోజ్వలంగా చేసిన ఎంపీ లను బాబు రాజధానికి తిరిగిరమన్నారు. మరి కిం కర్తవ్యం అంటే...ఏముంది రాష్ట్రమంతా బస్సుయాత్ర చేద్దాం, దానికి రూట్ మాప్ సిద్ధం చేద్దాం వచ్చేయండి అంటున్నాడు చంద్రబాబు. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ విషయం చెప్పగానే ఎంపీ లు బోలెడంత బరువు దిగిపోయినట్టు ఫీలయ్యారట. నిత్యం ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ ఎంపీల పోరాటాలతో పోటీ పడలేక, ఏదో ఒకటి చేయడం పరువు పోగొట్టుకోడంగా ఉన్న టిడిపి ఎంపీ లకు బాబు పిలుపు మహా ఆనందాన్నిచ్చినట్టు సమాచారం. నిన్నటిదాకా అధికారం పంచుకున్న పార్టీతో అవమానాలు పడుతూ, ఏం చేతగాకుండా ఉన్నారనే జాతీయ స్థాయి అవహేళనలు భరిస్తూ ఇంకెన్నాళ్లు ఢిల్లీలో ఉత్తుత్తి ప్రదర్శనలు చేయాలి అనుకుంటూ మధనపడుతున్న టైమ్ లో తమ అధినేత అమరావతికి తిరిగొచ్చేయమని చెప్పడం వారికి రిలీఫ్ ఇచ్చినట్టైందని హాయిగా ఊపిరి  పీల్చుకుంటున్నారట.
పాదయాత్ర VS బస్సుయాత్ర
పాదయాత్రతో వైయస్ జగన్ ప్రజల్లోకి చొచ్చుకు పోతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హోదా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా హోదా నినాదాన్ని హోరెత్తిస్తున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున వైయస్ఆర్ జెండా పోరాట పతాకం రెపరెపలాడుతోంది. చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతున్నామని గుర్తించిన బాబు ఎంపీ లను నియోజకవర్గాలకు తిరిగివచ్చి బస్సు యాత్రలు చేయమని సూచిస్తున్నారు. ప్రజలను నేరుగా కలిస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయో బాబుకు ఆయన  ఎంపీలకు ఇంతకుముందు సంఘటనల్లో బాగా అనుభవమైంది.. గతంలో ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో ప్రతి ఊళ్లోనూ నిరసనలు, ఆందోళనలు, ఊళ్లోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవడాలు జరగడాన్ని టిడిపి నేతలు మరచిపోలేదు. టిడిపి చేపట్టిన దళిత తేజం కార్యక్రమం సైతం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దళితులను అవమానిస్తూ మాట్లాడిన చంద్రబాబు, ఆదినారాయణ వంటి నేతలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారంటూ దళిత సంఘాలు బహిరంగంగా విమర్శించాయి. టిడిపి హయాం లో దళితులపై జరిగిన దాడులు, ఆ ఘటనల్లో బాధితులకు న్యాయం అందకపోవడం గురించి దళిత నేతలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. అంతే కాదు పాదయాత్రలో వైయస్ జగన్ కు మైనారిటీలు, ఎస్సీ,ఎస్టీలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. పాదయాత్రను హోదా ఉద్యమాన్ని క్రాస్ చేయలేకపోయిన టిడిపి అధినేత ఢిల్లీ ఉద్యమానికి తెల్ల జెండా ఊపేసి, బస్సు యాత్రకు పచ్చజెండా ఊపారు. ఇలా అయితే అటు ప్రజలను తప్పించుకుంటూ, ఇటు హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసామని చెప్పుకోవచ్చని టిడిపి అధినేత ఆలోచనగా కనిపిస్తోంది. ప్రజల కోసం చేసే ప్రజా సంకల్పానికి, ప్రజలను మభ్య పెట్టడానికి చేయబోయే ఈ బస్సుయాత్రకి పోలికెక్కడిదని అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. 
జిల్లాలవారీగా టిడిపి అఖిల సంఘాలు
ఎన్నికల కాలం దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు కుతంత్రాలకు పదును పెడుతున్నాడు. జిల్లాలవారీగా అఖిల సంఘాల ఏర్పాటు అంటూ బాబు చెప్పే మాటల్లో గూడార్థం వేరే ఉంది. రెండు సార్లు రాజధానిలో జరిపిన అఖిల పక్షం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బాబుని నమ్మి, ఎవ్వరూ కలిసి రామని తెగేసి చెప్పేయడం తో బాబు లోకల్ రాజకీయాలకు తెరతీసేందుకు అఖిల సంఘాల సమావేశాలంటున్నాడు. వివిధ వర్గాలను తన తప్పుడు హామీలతో గతంలో మోసం చేసిన చంద్రబాబు, మళ్లీ అదే కుట్రను అఖిల పక్షాల పేరుతో మొదలు పెడుతున్నాడు. కుల సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలే టార్గెట్ గా జిల్లాల వారీగా తన ప్రచార ఉచ్చును పన్నుతున్నాడు. హోదా ఉద్యమాన్ని అణగార్చేందుకు నానా ప్రయత్నాలు చేసిన బాబు, ఢిల్లీలో తమ ఎమ్.పిలతో పేలవమైన పోరాటాన్ని ప్రదర్శించి, ఇప్పుడిక అంతా అయిపోయిందంటూ చేతులు దులుపుకుని జిల్లాల వారీ టిడిపి మార్క్ ఓటు బ్యాంకు  రాజకీయాలు సిద్ధమౌతున్నాడు. అన్ని కులాల్లో పేదరికం ఉంటుందని, వారికి సాయం చేసేందుకే ప్రతి కులానికీ ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు వైయస్ జగన్. ఇన్నాళ్లూ కొన్ని కులాలను ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేస్తాను అని, కొందరికి రిజర్వేషన్లు ఇస్తానని చెబుతూ మోస పుస్తూ వచ్చిన చంద్రబాబుకు వైఎస్ జగన్ ప్రకటన చెక్ పెట్టినట్టైంది. దాంతో ఆయాకులాలు, సంఘాలలో తిరిగి నమ్మకం కలిగించుకోవడానికి బాబు తన కొత్త హామీల అస్త్రాలకు పదును పెడుతూ జిల్లాల వారీ అఖిల పక్షాలకు పిలుపు నిస్తున్నాడు. దళిత తేజం కార్యక్రమం అన్నిచోట్లా నిరాశకు గురిచేసినా సరే దాన్ని కప్పి పెట్టుకుంటూ విజయోత్సవ సభ అంటూ మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 
 
Back to Top