సో్నియా శివాలు..!

ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించే సోనియా గాంధీకి మొన్నామధ్య చాలా కోపం వచ్చింది. గుక్కతిప్పుకోడానికే వీల్లేని విధంగా, తాజాగా, కోల్‌ గేట్‌ తమ ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో్.. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష బీజేపీ మాటిమాటికీ సభలోనే ఇరుకున పెడుతుంటే.. ఇక ఏమాత్రం సహించలేక పోయారు. దీటుగా నిలబడి పోరాడాలంటూ తమపార్టీ వారికి ప్రబోధిస్తూ ఆవేశంతో ఊగిపోయారు.ఈ మధ్యకాలంలో తరచు తన ప్రశాంత ముసుగు తీసేస్తున్న సోనియా మరీ పెద్ద ఎత్తున  విరుచుకుపడాల్సిందిగా, ప్రతిపక్షంపై ఉరకాల్సిందిగా తన ఎంపీలకు ఉద్బోధించడం ఇదే ప్రథమం.ఆమె క్రోధానికి పైపైకి కనిపించే కారణం కోల్‌ గేటే అయినా .. మూడేళ్లుగానే కాకుండా, అంతకుమందటి లోక్‌సభ సయయంలో కూడా బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనిచ్చిన రోజు క‌నిపించదు. వాటిలో చాలా వరకు (ఉదా: స్పెక్ట్రమ్‌ కేటాయింపులు,  కామెన్వెల్త్ గేమ్స్ వంటి కుంభకోణాల్లో) ప్రభుత్వ అవినీతినిబట్టబయలు చేస్తూ కేంద్ర సర్కారును ఇరుకున పెట్టినవే.అయినా.. అప్పుడప్పుడు అక్కడక్కడ కొంత ఆవేశపడినా పోనియా ఇంతగా ఎప్పుడూ రెచ్చిపోలేదు. మరి ఇప్పుడే ఇంత కోపం ఎందుకు వచ్చిందీ..?కర్ణుడి చావుకు కారణాలెన్నో.. అన్నట్లు.. ఇక్కడా అంతే.. ముఖ్యంగా, మరి మాకేమిటి, మా సంగతేమిటి..? అంటూ నిలదీస్తున్న తమ పార్టీ  ఎంపీల తీరు తాజాగా సోనియాకు నచ్చడంలేదు. అటువంటివాళ్లంటేనే ఆమె చిరాకు పడిపోతున్నారు. ఇది మామూలు ఎంపీలకేనా.. కానేకాదు.. భావి ప్రధానిగా ప్రచారం జరుగుతున్న ఆమె పుత్రరత్నం.. యువరాజు రాహుల్‌ గాంధీకి కూడా వర్తిస్తుందనేది సర్వత్రా వినవస్తున్న మాట.తను భావించినట్టుగా రాహుల్‌ "చేతి"కి అందిరాకపోవడంతో, ముందెలాగో దిక్కుతోచక ఆమెకు గంగవెర్రులెత్తుతుండవచ్చు.అయితే, అనుభవం లేదనే కారణంతో రాహుల్‌ దూరంగా ఉన్నట్టు ప్రచారమవుతోంది. దేనికి అనుభవం? రాజకీయ పదవిని, అందునా దేశ అధినేత పదవిని సమర్థవంతంగా నిర్వహించడానికి  అనుభవం అవసరమే అయినా.. అదేదో సంసారం సాగించడానికి అనుభవం కావాలన్నట్టుంది. దీనికి తగ్గట్టుగా ఆయన పెళ్లి జోలికి పోకపోవడం కూడా తల్లి మనసుకు కష్టం కలిగించి ఉండవచ్చు.పెళ్లి కానిదే, పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితేకాని పెళ్లి కాదు.. అన్నట్టు.. ఏదైనా బాధ్యత పడితేనే కదా అనుభవం వచ్చేది. బరువు నెత్తిన పడితే, కిందో మీదో పడి ఎలాగోలా నెట్టుకు రాగలిగితే అనుభవం దానంతట అదే వస్తుంది. అంత జరిగినా రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతే అది ఆయన ఖర్మ. మరో నేత ఆవిర్భవిస్తాడు.

ఆందోళన అసలు కారణం...అందువల్ల సోనియా గాంధీ ఆగ్రహానికి, ఆమెలో చెలరేగుతున్న ఆందోళన, అసహనాలే అసలు కారణంగా కనిపిస్తోంది. ఏమాత్రం చేతికి అందిరాని కుమారత్నం వైఖరి, దేనికీ కదలిరాని అతని నిరాసక్తత ఆమెను తీవ్రంగా భయపెడుతున్నాయి. కలవరపరుస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో.. సరాసరి లోక్‌సభలో.. "చట్టవిరుద్ధ ప్రభుత్వం" అంటూ ఎల్‌కే అద్వానీ.. సంబోధించడం.. ఆమెకు నరనరానా మండిపోయింది. ఆమెలోని అసహన అగ్నిపర్వతం బద్దలై ఆగ్రహ లావా వెల్లువెత్తింది. ప్రతిపక్షం దుమ్మెత్తిపోస్తుంటే, తప్పించుకునే దారిలేక ఎదురుదాడికి తెరలేపింది.సరే, ఇది తాజా ఉదాహరణ. కాని, ఇటీవల ఆమె తరచుగా ఎందుకు అసహనం పాలవుతున్నారు? చాలా సౌమ్యురాలుగా ముద్ర పడిన ఆమె వాస్తవానికి అంత అమాయకురాలేమీ కాదని రెండు దశాబ్దాల కిందట జరిగిన సంఘటన రుజువుచేస్తోంది.ఇదికూడా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామమే కావడం యాదృచ్ఛికమైనా దానికీ ఎంతోపాత కథ ఉంది. ఆ కాలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత పర్వతనేని ఉపేంద్రను ఆమె తీవ్రంగా బెదిరించారంటూ వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో.. జరిగిందిది. ఆమె మాటల్లో చెప్పాలంటే.. "నీ అంతు చూస్తా" అన్నది ఆ బెదిరింపు అన్నది వార్తల కథనం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో జరిగిన ఈ సంఘటన ఇంకా పలువురు పాతతరం వారికి గుర్తుండే ఉంటుంది.

మరో ముఖ్య కారణం...
వీటన్నిటికీ మించి.. సోనియా అసహనానికి మరో పెద్ద కారణం.. దేశ రాజకీయ యవనికను వీక్షించిన వారికి చాలా సులువుగా అర్థమవుతుంది.  వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీ పరిస్థితి రానురాను దిగజగారుతుంటే.. భవిష్యత్తు అగమ్యగోచరంగా, పెద్ద ప్రశ్నార్థకంగా  కనిపించడంలో ఆశ్చర్యం లేనేలేదు.రాష్ట్రాల వారీగా పరికిస్తే పరిస్థితి మరీ తేటతెల్లం అవుతుంది. తమ చేయి దాటిపోయినవి పోగా, చేతిలో ఉన్నవి కూడా చేజారిపోయే దుస్థితి ఆమెకు నిద్రలేకుండా చేస్తోంది. వందేళ్లు పైబడిన అనుభవం గల, దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్‌.. పరిస్థితి ఎలా ఉందంటే.. తమిళనాడులో ఆశ లేదు. ఈ మధ్యకాలంలో చేజారిన కర్ణాటకలోనూ ఆ ఆశ తీరే ఆవకాశం కానరావడం లేదు.అన్నిటికీ మించి, పదవి ఇచ్చినా ఇవ్వకున్నా.. అవమానించినా, ఎన్ని కష్టాల పాలుజేసినా మీ అండగామేమే ఎప్పటికీ అనే ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ పరిస్థితి దారుణంగా దిగజారిపోతోంది. ఎన్నికలున్నా, లేకున్నా  వాటితో సంబంధం లేకుండా సాగుతున్న జగన్‌ ప్రభంజనం.. పార్టీకి కంపరం కలిగిస్తోంది. గత మూడేళ్లుగా అయితే పార్టీ దశ, దిశా కోల్పోయి కొట్టుకుంటోంది.కేరళలో ఉనికి ఉన్నా, అరకొరగా ఉన్న ఎంపీల సంఖ్య లెక్కకు పెద్దగా తోడవదు. దానికి తోడు అధికారంలో ఉన్నవాళ్లను పీడించే ప్రజావ్యతిరేకత మరింత తోడవుతుంది.మహారాష్ట్రకు వస్తే.. మిత్రుడుగా ఉన్న శరద్‌పవార్‌ ఆడించినట్టు ఆడాల్సివస్తోంది.మధ్యప్రదేశ్‌,  బీహార్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో చాలాకాలంనుంచి ప్రతిపక్షానికే పరిమితమైపో్యిన దుస్థితి.ఇక దేశరాజకీయ కేంద్ర బిందువైన ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరీ దారుణం. మూడేళ్లనాటి పార్లమెంటు ఎన్నికలతో పాటు, ఇటీవలి  అసెంబ్లీ ఎన్నికల్లో యువరాజు ఎంతగా కష్టపడినా ఫలితం మరీ వెక్కిరించింది. పంజాబ్‌లో పదోవంతు స్థానాలకే పరిమితమైపోయింది.  అసోంలో సాగుతున్న జాతుల వైరం ఆశలపై నీళ్లు చల్లుతోంది. జమ్మూకాశ్మీర్‌లో సంకీర్ణంలో భాగస్వామి అయినా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మాటే చెల్లుబాటయే పరిస్థితి.గుజరాత్‌లో నరేంద్రమోడీనుంచి అధికారం హస్తగతం చేసుకోగలిగే సూచనలు నామమాత్రంగానైనా కానరావడంలేదు.రాజస్థాన్‌లో తమ ప్రభుత్వమే ఉన్నా, పాలక పార్టీలను సహజంగా దెబ్బతీసే ప్రజా వ్యతిరేకత.. వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందోననే  ఆందోళన మరోపక్క పీడిస్తున్నాయి.ఎంతసేపూ తనకు విశ్వాసపాత్రులైన భజన బృందం  మాట వినడమే తప్ప.. వాస్తవంగా పరిస్థితులను ఆమె ఎప్పుడు బేరీజు వేశారనే మాట వినవస్తోంది. ఏకే ఆంటోనీ, గులాంనబీ ఆజాద్‌, పి. చిదంబరం, వయలార్‌ రవి, నిన్నమొన్నటి వరకు ప్రణబ్‌ముఖర్జీ.. ఇలా కాంగ్రెస్‌ పార్టీ అంపశయ్యపై ఉన్నరాష్ట్రాలకు చెందిన ప్రజాదరణకు అంతగా నోచుకోని నేతలే ఆమె కళ్లూ చెవులూ.ఇలాంటి అగమ్యగోచర దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మహా కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తే దాని అధినేతకు ఆందోళన, అగ్రహం కలగడంలో తప్పేముంది? ఈ పరిస్థితుల్లో మిత్రులుగా ఉంటామన్న మమతాబెనర్జీ, ములాయం సింగ్‌యాదవ్‌లు తోకజాడిస్తుంటే మరీమండిపోదూ. బీజేపీదాడికి ఇవన్నీ జతకలిశాయి. అధినేత్రిని ఆక్రోశానికి గురిచేశాయి.ఇంతబాధలోనూ సోనియాకు కాస్తంత ఊరట కలిగించే విషయమేమంటే.. తమను మాటిమాటికీ ఇరుకున పెడుతున్న ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కూడా తమకేం తక్కువ కాకుండా తన్నులాటల్లో మునిగితేలడం. అదే అధినేత్రికి ఉపశమనం.

Back to Top