ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాల పెద్ద గొడవ జరిగింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు. తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు. “అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు. అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి” వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్క పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు. బీర్బల్ ఎన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్లీ మళ్లీ అదే మాట చెప్ప సాగారు. ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు. ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది. ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపారిదని అందరూ గ్రహించారు. బీర్బల్ సంచిలో మళ్లీ నాణాలు నింపి చమురు వ్యాపారికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు. ఏంటి ఏదో వార్త చెప్పుకొస్తారనుకుంటే చిన్నప్పుడు చదువుకున్న అక్బర్ - బీర్బల్ కథ చెబుతున్నాడు అనుకుంటున్నారా..? ఏమీలేదు మనం చిన్నప్పుడు చదువుకున్న అక్బర్ బీర్బల్ కథలు మీకు గుర్తున్నాయా..? మీ గురించి ఏమో కానీ మన రావెల కిశోర్‌బాబు తనయుడు రావెల సుశీల్‌కు మాత్రం బాగానే గుర్తున్నాయని చెప్పకోవాలి.. ఎందుకో తెలుసుకునే ముందు మీరు ఈ చిన్న కథను చదవండి... ఈ కథకు రావెల సుశీల్ ఏమైన పోలికలున్నాయో లేదో... మీరే చెబుతారు మరి..... మన రావెల సుశీల్ తాను ఎవరి చేయి పట్టుకోలేదని, తాను సత్యవంతుడినని చెప్పుకోవడానికి ఎంతంగానో ప్రయత్నించాడు... పోలీసులు వద్ద సైతం నేను మంత్రిగారి తనయుడిని అని బెదిరించే ప్రయత్నం బాగానే చేశాడు... అది కుదరక పోవడంతో చివరికి తాను ఒక కుక్క పిల్ల కోసం కారు దిగాను. తనకు పెంపుడు జంతువులంటే ఇష్టమని, అయితే, ఒక మహిళ అకారణంగా తనపై అరుస్తూ తిట్టిందని, దాంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారని అన్నాడు. ఏం జరిగిందో చెప్పేలోపే వాళ్లు సహనం కోల్పోయి తనను కొట్టారన్నాడు. ఆ వివాదం మొత్తం శుక్రవారమే పరిష్కారం అయిపోయినా, కావాలనే దాన్ని సాగదీస్తున్నారని చిన్న పిట్ట కథ చెప్పుకొచ్చాడుకానీ ప్రస్తుత కంప్యూటర్ యుగంలో తన దొంగతనాన్ని బయట పెట్టాయి వీడియో సాక్ష్యాలు. పకడ్బందీగా రికార్డయిన సీసీటీవీ కెమెరా విజువల్స్ లో సుశీల్ వాహనం స్పష్టంగా మహిళ వెంటపడిందని తేలింది. బంజారాహిల్స్ రోడ్‌లో బాధితురాలు ఓ రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. సుశీల్ తన ఫార్చూనర్ కారుతో ఆమె వెంట పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అవుతోంది. టయోటా ఫార్చూనర్ కారులో రావెల సుశీల్.. బాధితురాలి వెంట పడుతున్నట్టు తేలింది. నిదానంగా వాహనాన్ని నడుపుతూ బాధితురాలిని చాలా దూరం నుంచి అనుసరించినట్టు విజువల్స్ బట్టి తెలుస్తోంది. వాహనం పైపైకి వస్తుండడంతో తప్పనిసరై బాధితురాలు రోడ్డుకు దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. దీంతో ఆ మహానటుడు కనబడకుండా మాయమైపోయాడు. అధికార పార్టీ అండదండలతో తాము ఏదీ చేసిన చెల్లుతుందనే అహంకార భావంతో ఓ మహిళ పట్ల ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడడం ఎంత వరకు సమంజసమని మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి నీచులను కాపాడేందుకు ప్రయత్నించడం దారుణమని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.