సమస్యలకు గాలికొదిలిన పాలకులు

‘ ఇది రాబందుల రాజ్యం.. పాలకులు సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారు. గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేవు. వ్యవసాయానికి విద్యుత్తు లేదు. ఇంటికి కరెంటు ఇవ్వకున్నా గుండెలు పగిలిపోయేలా  బిల్లులు వస్తుండటంతో సామాన్య ప్రజలు బతికే వీలు లేకుండాపోయింది. ఈ పాపం ఊరికే పోదు.. వైయస్ మంజూరు చేసిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడంలేదు. ప్రభుత్వానికి దొంగలకు తేడా లేకుండా పోయింది.. కొన్నాళ్లు ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుంది..పేదలకు మంచిరోజులు తెస్తుంది. ’  -‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో షర్మిల
మహబూబ్‌నగర్: ప్రస్తుత ప్రభుత్వంలో  గ్రామాలకు కనీసం రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఏసీ గదుల్లో ఉంటుండగా  పేదప్రజలకు రాత్రిళ్లు విద్యుత్తు లేక వాకిళ్లు, కిటికీలు తెరుచుకొని నిద్రపోవాల్సి పరిస్థితి ఏర్పడిందని ఆమె మండిపడ్డారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బతికిఉంటే రోజుకు 9గంటలు ఉచిత విద్యుత్తు  ఇచ్చేవారన్నారు.

     ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్నా రెండు వారాలుగా కూలి డబ్బులు ఇవ్వడం లేదని ఇలాగైతే బతకడం కష్టంగా ఉందని కలుగోట్ల గ్రామానికి చెందిన పలువురు మహిళలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. మరికొంత మంది వృద్ధులు తమకు పింఛన్లు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

పింఛనర్ల సంఖ్యను 71 లక్షలకు పెంచిన వైయస్
     ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో 16 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తుంటే వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ సంఖ్యను 71 లక్షలకు పెంచి అదనంగా 55 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మంజూరు చేసిన పింఛన్లకు కూడా ఈ ప్రభుత్వం రద్దుచేసి పేదల కడుపు కొడుతోందని ఆరోపించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అర్హులైన ప్రతి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు న్యాయం చేస్తూ పింఛన్ మొత్తాన్ని వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు వెయ్యి రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోనందునే ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు.
బొంకూరు గ్రామంలో మహిళలు ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. వరదలు వచ్చి ఇళ్లు కోల్పోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయలేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు షర్మిల స్పందిస్తూ.. దేశంలో 45 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తే వైయస్ పాలనలో మన రాష్ట్రంలోనే 45 లక్షల ఇళ్లు నిర్మించాడని తెలిపారు. ఏడాదికి ఆరులక్షల ఇళ్లు కట్టిస్తామని హామీఇచ్చిన ఈ ప్రభుత్వం, వైయస్ హయాంలో మంజూరైన ఇళ్లకు కనీసం బిల్లులు కూడా మంజూరుచేయడం లేదని దుయ్యబట్టారు. డ్వాక్రా గ్రూపు సభ్యులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నా తమనుంచి మాత్రం ఐదు రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని? పలువురు మహిళలు ఏకరువు పెట్టారు.

     వారి ఇబ్బందులు విన్న షర్మిల స్పందిస్తూ.. ప్రభుత్వానికి దొంగలకు తేడా లేకుండా పోయిందని, కొన్నాళ్లు ఓపికపడితే పేదలరాజ్యం వస్తుందని వారికి ధైర్యం చెప్పారు. ‘‘మాది చాలా పేద కుటుంబం, నా కొడుకుకు గుండె జబ్బు వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లినా ఆపరేషన్ చేయకుండా తిప్పుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ ఆ శ తీరుతుందని ఆ రోజు కోసం ఎదురుచూస్తు న్నా..’’ అంటూ చంద్రశేఖర్‌నగర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను పడుతున్న ఇబ్బందుల ను విన్నవించారు. ప్రాణంపోసే ఆరోగ్యశ్రీ పథకానికి కూడా ప్రభుత్వం జబ్బు పట్టేవిధంగా చే సిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్సుమెంట్‌ను నీరు గార్చారు
     వైయస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని నీరుగార్చడం వల్ల మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైనా పేదవిద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నాడని రానున్న రోజుల్లో కాంగ్రెస్, టీడీపీలు దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే భయంతో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై అక్రమకేసులు బనాయించి జగన్‌ను జైల్లో పెట్టించారన్నారు. మీ అందరి ఆశీస్సులు, దేవుడి దయవల్ల జగనన్న బయటకు వచ్చి ప్రజల సమస్యలన్నీ తీర్చడానికి కృషిచేస్తాడని షర్మిల హామీఇచ్చారు.

Back to Top