ఓదారుస్తూ.. అక్కునజేర్చుకుంటూ..

నూజివీడు, 12 ఏప్రిల్ 2013:

ఆత్మీయ అతిథి ఆగమనంతో నూజివీడు నియోజకవర్గ ప్రజలు పులకించారు. గుండెనిండుగా అభిమానం ఉప్పొంగగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిలకు సాదర స్వాగతం పలికారు. ఆమె చేతుల మీదుగా రాజన్న విగ్రహాన్ని ఆవిష్కరింపచేసి మురిసిపోయారు. నాన్న ఆకాంక్షలు, అన్న ఆశయాలను భుజానికెత్తుకుని పాదయాత్రగా నడిచి వస్తున్న ఆ పాదచారికి పల్లెలు బ్రహ్మరథం పడుతున్నాయి.

‘ప్రతి ఒక్క చెల్లికి, అక్కకి, అమ్మకి, తమ్ముడికి, అన్నకు, అయ్యకు, తాతకు అవ్వకు నమస్కారం. మాట మీద నిలబడేది డాక్టర్ వైయస్ఆర్ తర్వాత జగనన్నే. జగనన్న త్వరలో బయటకు వస్తారు. ఆర్నెలలో, సంవత్సరమో ఓపిక పట్టండి. జగనన్న ముఖ్యమంత్రవుతాడు. మీ కష్టాలన్నీ తీర్చేందుకు రాజన్న రాజ్యం తెస్తాడు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి, దానికి మద్దతుగా నిలబడిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది’ అంటూ ప్రజాకంటక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరిస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతున్నారు.

ప్రజలను మభ్యపెడుతున్నారు..

ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమంత్రి అమ్మహస్తం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని మర్రిబంధం రచ్చబండలో శ్రీమతి షర్మిల విమర్శించారు. నెలకు వంద రూపాయలు మిగులుస్తానని కోతలు కోస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలపై రూ.30 వేల కోట్ల రూపాయల విద్యుత్తు చార్జీల భారం మోపారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఈ రోజున గద్దెపై ఉందంటే చంద్రబాబునాయుడే కారణమని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలనూ ఓడించి రాజన్న రాజ్యం తేవాలని, జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.

కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కలిగించిన మహనీయుడు జ్యోతిరావు పూలే 187వ జయంతిని మర్రిబంధంలో ఘనంగా నిర్వహించి పూలే చిత్రపటం వద్ద  శ్రీమతి షర్మిల నివాళులర్పించారు. పాదయాత్ర నూజివీడు నియోజకవర్గం సీతారామపురం నుంచి ప్రారంభమై మర్రిబంధం, మీర్జాపురం, గొల్లపల్లి మీదుగా పోసానపల్లి క్రాస్‌ రోడ్ దాటిన తర్వాత ముగిసింది. 117వ రోజున మొత్తం 13.5 కిలోమీటర్లు నడిచారు. గొల్లపల్లిలో మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అక్కడ భారీ జనసందోహాన్ని ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. దారిలో పామాయిల్, మొక్కజొన్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ పాదయాత్రలో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), జోగి రమేష్, నాయకులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి, దుట్టా రామచంద్రరావు, గోసుల శివభరత్‌రెడ్డి, ముసునూరి రత్నబోస్, లాకా వెంగళరావు యాదవ్, దేశిరెడ్డి రాఘవరెడ్డి, బసవ భాస్కరరావు, కోటగిరి గోపాల్, కోటగిరి సందీప్, మోరవనేని రమేష్, పల్లే రవీంద్రరెడ్డి, గుడిమెళ్ల రామస్వామి, మందాడ నాగేశ్వరరావు, పొట్లూరి అశోక్, శీలం రామయ్య, పిళ్లా చరణ్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కాజా రాజకుమార్, వడ్లమూడి నాని తదితరులు పాల్గొన్నారు.

కదిలించిన ఓ కుటుంబం దీన స్థితి..

మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా గురువారం హనుమాన్‌జంక్షన్ నుంచి నూజివీడు వెళ్లే దారిలో మీర్జాపురం శివారులో రోడ్డు పక్కన ఉంటున్న మంగమ్మ ఇంటికి శ్రీమతి షర్మిల వెళ్లినప్పుడు ఆ కుటుంబ సభ్యులు పండగపూట కూడా పస్తులుండటం కనిపించింది. వారి దీనగాథ ఆమెను కదిలించింది. వారి పరిస్థితి చూసి చలించిపోయిన ఆమె తీవ్ర అనారోగ్యంతో ఉన్న భాగ్యలక్ష్మికి కావాల్సిన వైద్యం అందించే బాధ్యతను తామే తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే ఆమెను అంబులెన్సులో హనుమాన్‌జంక్షన్‌లోని పార్టీ నేత దుట్టా రామచంద్రరావు ఆస్పత్రికి తరలించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న సీఎం అయితే అందరి జీవితాలు బాగుపడతాయని ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల వారికి ధైర్యం చెప్పారు.

Back to Top