‌కొత్తగూడెంలో హోరెత్తిన జై జగన్ నినాదాలు

మే నెల ఎండలు మాడ్చేస్తున్నా లెక్కచేయకుండా మహానేత రాజన్న తనయను చూసేందుకు కొత్తగూడెం జనం పోటెత్తారు. పట్టణ రహదారులు జనసంద్రంగా మారాయి. మహిళలు మంగళ హారతులు పట్టారు. జై జగన్, వై‌యస్‌ఆర్ అమ‌ర్‌రహే నినాదాలతో బొగ్గు గనుల ప్రాంతం మార్మోగింది. రహదారులు కిక్కిరిసిపోవడంతో భవనాలు, చెట్ల పైకి కూడా ఎక్కిన అభిమాన జనం శ్రీమతి షర్మిలకు ఘనస్వాగతం పలికారు.

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా) : మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో 12వ రోజు ఆదివారం 10.2 కిలోమీటర్లు కొనసాగింది. ఉదయం కొత్తగూడెం మండలంలోని వేపలగడ్డ శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తగూడెంలోని భజనమందిరం వరకు కొనసాగింది. వేపలగడ్డ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రం వద్దకు ఉదయం ఏడు గంటలకే శ్రీమతి షర్మిలను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగపేట తండా వద్దకు చేరుకోగా లంబాడీ మహిళలు మంగపేట రహదారికి అధిక సంఖ్యలో చేరుకుని స్వాగతం పలికారు. మొక్కజొన్న, టమాటా రైతులు తమకు గిట్టుబాటు ధర రావడం లేదని శ్రీమతి షర్మిలకు తెలిపారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్య పడవద్దని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి పాదయాత్ర బృందావనం మీదుగా హౌసింగ్‌బోర్డు వరకు సాగింది. హౌసింగ్ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

హౌ‌సింగ్‌బోర్డు వద్ద పెద్ద ఎత్తున ప్రజలు హాజరై శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాదయాత్ర చుంచుపల్లి తండా క్రాస్‌రోడ్ మీదుగా విద్యానగ‌ర్‌కాలనీకి చేరుకుంది. విద్యానగర్ కాలనీ వద్ద రోడ్డు‌కు ఇరువైపులా పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బాబుక్యాంప్‌నకు చేరుకోగానే రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. బాణసంచా కాలుస్తూ, డప్పు వాయిద్యాలతో శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాదయాత్ర పోస్టాఫీస్ సెంట‌ర్, బస్టాండ్ సెంట‌ర్‌ల మీదుగా సెవెన్‌హిల్సు సెంటర్ వరకు‌ పాదయాత్ర కొనసాగింది. సెవెన్‌హిల్సు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని‌ శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. అక్కడి నుంచి త్రీ టౌన్ సెంటర్‌కు పాదయాత్ర చేరింది.

త్రీ టౌన్ సెంట‌ర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలను‌ ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖ‌రరెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. సభకు హాజరైన ప్రజలు శ్రీమతి షర్మిల ప్రసంగానికి హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్,‌ శ్రీ జగన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా సభకు హాజరైన అభిమానులు జై జగన్, వై‌యస్ అమ‌ర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర గణేష్‌టెంపుల్, పాత‌ బస్‌ డిపో సెంటర్, గాజులరాజం బస్తీల మీదుగా భజన‌ మందిర్ వరకు‌ కొనసాగింది.

సభకు పోటెత్తిన ప్రజలు :
కొత్తగూడెంలో బహిరంగసభ ఏర్పాటు చేయడంతో కొత్తగూడెం పట్టణం, మండలం, పాల్వంచ పట్టణం, మండలంతో పాటు పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచే ప్రజలు కొత్తగూడెం చేరుకుని శ్రీమతి షర్మిల రాక కోసం ఎదురు చూశారు. సభ ప్రారంభం కాగానే అండర్‌ బ్రిడ్జి నుంచి గణేష్‌‌ టెంపుల్ వరకు ప్రజలు కిక్కిరిసిపోయారు.
Back to Top