జనసంద్రమైన తాడేపల్లిగూడెం

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మంగళవారం నాడు పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం పట్టణం మీదుగా ముదునూరుపాడు వరకూ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించారు.  సాయంత్రానికి యాత్ర తాడేపల్లిగూడెం పట్టణంలోకి ప్రవేశించింది. జనం వేలాదిగా తరలివచ్చారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు, కరచాలనం చేసేందుకు మహిళలు, యువకులు, వృద్ధులు పోటీపడ్డారు. పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రజల నుంచి ప్రజానేతను వేరుచేసి కాంగ్రెస్, టీడీపీలు సాగిస్తున్న కుట్రలను తిప్పికొడతామని ముక్తకంఠంతో చెప్పారు. మహానేత చేసిన మేలు మరువలేమనీ,ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసి తన భార్యకు జీవం  పోసిన మహానేత డాక్టర్  వైయస్ఆర్‌ తమ హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పెదతాడేపల్లి వద్ద  ఇరగవరం గ్రామస్తుడు కర్రి వెంకట సత్యనారాయణరెడ్డి వివరించారు. పెదతాడేపల్లి వాసులు తాగునీటికి కటకటలాడుతున్నామని వాపోయారు. భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల గురించి చెప్పారు.

కరచాలనం కోసం ప్రయత్నించిన మహిళలు అభిమానంతో గట్టిగా చేయి లాగడంతో శ్రీమతి షర్మిల చేతికి స్వల్ప గాయమైంది. నొప్పిని భరిస్తూ ఆమె అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. గూడెం పట్టణంలోని ఫ్లై ఓవర్‌పై జనం కిక్కిరిసి అపూర్వ స్వాగతం పలికారు. బహిరంగ సభకు ముందు పెద్దఎత్తున బాణ సంచా కాలుస్తూ రాజన్న బిడ్డపై గూడెం వాసులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు, ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త ఎంవీ మైసూరారెడ్డి, ఆర్కే, కాపు భారతి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, ఎంవీవీఎస్ నాగిరెడ్డి, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నేత మువ్వా ఆనంద శ్రీనివాస్, మేడిది జాన్సన్, యెగ్గిన నాగబాబు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బొడ్డు సాయిబాబా, రాజా త్రినాధ్, తెన్నేటి జగ్జీవన్, ముద్రగడ లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డు లేదు.. పింఛను లేదు
‘ఒక కొత్త రేషన్ కార్డు లేదు.. ఒక కొత్త పెన్షన్ లేదు.. ఏదీకూడా పేదలకు అందడం లేదు.. రైతులకు నీళ్లు లేవు.. కరెంటు లేదు.. మద్దతు ధర లేదు. ప్రతి పంటలోనూ నష్టమొచ్చి ప్రతి రైతన్న.. అమ్మా! అప్పుల పాలైపోతున్నామని ప్రతి గ్రామంలోనూ చెబుతున్నారు. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు.. పేదలంటే కనికరం లేదు.. విద్యార్థులంటే ఆలోచన లేదు.. మనసు లేదు.. మానవత్వం లేదు.. అన్ని చార్జీలనూ పెంచేసింది ఈ సర్కారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. ఫీజు రీయింబర్సుమెంట్ కుంటుపడింది. 108, 104 కనుమరుగైపోయాయి.. పక్కా ఇళ్లకు పాడె కట్టింది.. అన్ని చార్జీలను పెంచేసింది ఈ సర్కారు.. ఎరువుల ధరలు ఇప్పటికి పదిసార్లు పెరిగాయి. ఆర్టీసీ ధరలు ఇప్పటికి మూడుసార్లు పెరిగాయి.. రిజిస్ట్రేషన్ చార్జీలైతేనేమి.. వ్యాట్ పన్నులైతేనేమి.. అన్నీ పెరిగిపోయాయ్. మరీ విచిత్రంగా కరెంటు చార్జీలైతే నాలుగింతలు బిల్లులొస్తున్నాయ్. ఈ పాపం కిరణ్ సర్కారుది కాదా’ అంటూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు రాజన్న బిడ్డ షర్మిల.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో అశేషంగా హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి షర్మిల ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ‘ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అండగా.. రక్షణ గోడగా నిలబడి భుజం కాస్తున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం అధికారంలో ఉందీ అంటే దానికి కారకులెవరు.. ఈ చంద్రబాబు కాదా అని అడుగుతున్నాను. తన స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టి.. టీడీపీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేసిన ఈ చంద్రబాబు నాయుడిని నాయకుడు అంటారా.. దుర్మార్గుడు అంటారా’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టాలని సమర శంఖారావం పూరించారు. రాజన్న రాజ్యం రావాలంటే.. శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలకాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

Back to Top