జాతీయ రహదారిపై జనం వెల్లువ!

కొత్తగూడెం : జాతీయ రహదారిని జనప్రవాహం ముంచెత్తింది. జగనన్న సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. కూలీలు పరుగుపరుగున రోడ్డుపైకి వచ్చి తమ కష్టాలను చెప్పుకున్నారు. యువకులు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. శ్రీమతి షర్మిలతో మాట్లాడాలని ఎదురుచూపులు చూశారు. ఖమ్మం జిల్లాలో 14వ రోజు మంగళవారం మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. శ్రీమతి షర్మిల మంగళవారంనాడు మొత్తం 11.9 కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

కొత్తగూడెం మండలంలోని పెనగడప శివారు నుంచి ప్రారంభమైన మంగళవారంనాటి పాదయాత్ర చంద్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెం శివారు వరకు సాగింది. పెనగడప శివారులో ఏర్పాటు చేసిన శిబిరానికి ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. అక్కడ అందరికీ అభివాదం చేసిన శ్రీమతి షర్మిల ముందుకు సాగారు. పెనగడప ప్రధాన సెంటర్‌కు భారీ సంఖ్యలో మహిళలు తరలిరావడంతో రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడ ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. అక్కడి నుంచి పాదయాత్ర అంబేద్కర్‌నగర్‌ చేరుకుంది. మహిళలు రోడ్డుపైకి వచ్చి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. ఆ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు.

అనంతరం చంద్రుగొండ మండలం తిప్పనపల్లి శివారు నుంచి అశ్వారావుపేట నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అశ్వారావుపేట నియోజకవర్గం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎదురొచ్చి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. గుమ్మడికాయతో దిష్టి తీసి శ్రీమతి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాదయాత్ర సాగుతుండగా పరిసర ప్రాంతాలలో పనిచేసే కూలీలు రోడ్డుపైకి వచ్చి శ్రీమతి షర్మిలకు తమ కష్టాలు చెప్పుకున్నారు. అనంతరం పాదయాత్ర తిప్పనపల్లికి చేరుకుంది. గ్రామ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. పాదయాత్ర ఇందిరానగర్‌ మీదుగా చంద్రుగొండ వరకు సాగింది. పాదయాత్ర సాగుతున్నంత సేపు వృద్ధులు, రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీమతి షర్మిలకు వివరించారు. వారి బాధలను విన్న ఆమె మనకు మంచి రోజులు వస్తాయి... అధైర్యపడకండి అంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.

పాదయాత్ర సాయంత్ర 6.20 గంటలకు చంద్రుగొండకు చేరుకోగానే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు పాదయాత్ర దారులన్నీ పూర్తిగా జనంతో నిండిపోయాయి. చంద్రుగొండలోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రుగొండ చేరుకోగానే పార్టీ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, డప్పువాయిద్యాలతో శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు.

తిప్పన్నపల్లి నుంచి చంద్రుగొండ శివారు వరకు రోడ్డంతా జన ప్రవాహంలా మారింది. పట్టణ ప్రధాన సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తూ చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తూర్పారబట్టారు. ఆమె ప్రసంగిస్తున్నంతసేపు కార్యకర్తలు జై జగన్‌, వైయస్‌ఆర్‌ అమర్‌ రహే అంటూ చేసిన నినాదాలతో చంద్రుగొండ సెంటర్‌ మార్మోగింది. అక్కడి నుంచి పాదయాత్ర అయ్యన్నపాలెం వరకు సాగింది. అయ్యన్నపాలెం దారిపొడవునా పెద్ద ఎత్తున మహిళలు రోడ్డుపైకి వచ్చి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. అయ్యన్నపాలెం శివారు ప్రాంతం లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆమె రాత్రికి బస చేశారు.
Back to Top