లెక్కలు ఘనం..వాస్తవం భిన్నం

– జీఎస్‌డీపీల పేరుతో చంద్రబాబు వంచన
– రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెండో స్థానం.. 
    తలసరి ఆదాయంలో ఆఖరి స్థానంలో ఏపీ
– రొయ్యల సాగులో లెక్కలు చూపించి తప్పుడు వృద్ధి రేటు 

ఉన్నది లేనట్టుగానూ, లేనిది ఉన్నట్టుగానూ చూపడంలో చంద్రబాబు సర్కారుకు సాటి మరొకటి లేదనిపిస్తోంది. రాజధాని, రుణమాఫీ, ఇళ్ల నిర్మాణం వంటి అంశాల్లోనే కాదు, ఆర్థిక విషయాల్లోనూ ఆయనది ఇదే బాట! సమైక్య రాష్ట్ర విభజన అనంతరం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్నామని వాపోతూనే, పదేపదే ప్రత్యేక విమానాల్లో మందీమార్బలంతో విదేశాలకు వెళ్లి రావడం, అనవసరమైన ఆర్భాటాలకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం ఆయనకే చెల్లింది. విభజన తరువాత చెప్పుకోదగ్గ పరిశ్రమలేమీ రాకపోయినా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో నామమాత్రపు పెరుగుదల కూడా లేకపోయినా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) అంబరాన్ని తాకిందంటూ బాబు చెప్పుకునే గొప్పలు కూడా ఈ కోవలోవే! 

అభివృద్ధి పేపర్లలోనే.. 
వృద్ధి లెక్కలు ఘనంగా ఉన్నప్పటికీ, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రమూ మెరుగు పడకపోవడం చూస్తుంటే పలు సందేహాలకు తావిస్తోంది. 
ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2014–15 ఆర్థిక సంవత్సరం నుండి అఖిల భారత జీడీపీ కన్నా ఎక్కువ వృద్ధి రేటును రాష్ట్రం సాధిస్తోంది. ఆ ఏడాది 8.51 శాతంగా ఉన్న వృద్ధి 2016–17లో 11.61 శాతానికి చేరింది. అదే సమయంలో అఖిల భారత వృద్ధి శాతం 7.11మాత్రమే! ఫలితంగా జాతీయ స్థాయి జీఎస్‌డీపీ ర్యాంకుల్లో ఏడో స్థానం నుండి రెండో స్థానానికి రాష్ట్రం ఎగబాకింది. 

వ్యవసాయ రంగం కుదేలు
అయితే, నాణేనికి రెండో వైపు దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. అనేక చోట్ల పంట పొలాలు నిస్సత్తువుగా మారుతున్నాయని, సాధారణ పంటల సాగుకూ వీలు లేకుండా పోతోందని వార్తలు వస్తున్నాయి. దీంతో వ్యవసాయ కార్మికులతో పాటు, రైతులు కూడా సాగుకు దూరం కావాల్సి వస్తోంది. పనులు లేక వలసబాట పట్టాల్సి వస్తోంది. ఇప్పటికీ రాష్ట్రంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో నెలకొన్న ఈ పరిస్థితి రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఫలితంగా నిరుద్యోగం ప్రబలుతోంది. ఈ వాస్తవ స్థితిని దాచిపెట్టి, ఒక్క రొయ్యల సాగులో చోటు చేసుకున్న అభివృద్ధినే మొత్తం రాష్ట్రాభివృద్ధిగా ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం వాపును చూపి, బలుపని నమ్మబలకడమే! 

వాస్తవాలు పరిశీలిస్తే..
రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితిని తలసరి ఆదాయ లెక్కలు కొద్ది మేరకు బహిర్గతం చేస్తున్నాయి. జీఎస్‌డీపీలో రెండో స్థానంలో ఉన్న ఏపీ తలసరి ఆదాయంలో ఆరో స్థానానికే పరిమితమైంది. దక్షిణాది రాష్ట్రాలనే పరిగణలోకి తీసుకుంటే మనది చిట్టచివరి స్థానమే. జీఎస్‌డీపీలో జాతీయ స్థాయిలో ఆరో స్థానంలో ఉన్న హర్యానా తలసరి ఆదాయ లెక్కల్లో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. జీఎస్‌డీపీలో  12వ స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం తలసరి ఆదాయ లెక్కల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 2014–15లో రాష్ట్ర తలసరి ఆదాయం 93,699 రూపాయలుండగా, గత ఆర్థిక సంవత్సరానికి 1,22,376 రూపాయలకు పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా ప్రజలను వంచించడమే! వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో పాటు, ఉన్న పరిశ్రమలు మూతపడుతూ నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతుంటే ప్రజల తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది? రొయ్యల సాగు నుండి వచ్చిన ఆదాయాన్నే చూపిస్తూ ప్రజలందరి ఆదాయాలు పెరిగాయని నమ్మించడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ లెక్కలు!  

తాజా ఫోటోలు

Back to Top