ప్రజాసమస్యలు గాలికొదిలి విదేశీ(వృథా)పర్యటనలు

– పంటలు నీట మునిగి అల్లాడుతున్న రైతులు
– మూడు దేశాల పర్యటనలకు వెళ్తున్న చంద్రబాబు
– గతంలోనూ మిర్చి ఉద్యమం నడుస్తుండగా బాబు అమెరికా పర్యటన
– విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు శూన్యం
– ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ పోరాటం

సరైన సమయానికి చేయని సాయం.. అవసరం లేనప్పుడు ఇచ్చే హామీ ఎప్పటికీ వ్యర్థం.. ఈ మాటను పాటించేవాడే నిజమైన నాయకుడు. అలాంటి వారినే జనం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.  అలాంటి నాయకులు బతికే ఉన్నా భూమి మీదే లేకున్నా తాము చేసిన మంచి పనుల కారణంగా కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. రాజకీయ నాయకులు దీన్ని తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. 

కానీ చంద్రబాబు మాత్రం ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ ప్రజలకు అందుబాటులో లేకుండా విదేశీ పర్యటనల పేరుతో తప్పించుకు తిరుగుతున్నారు. సీఎంగా సకల అధికారాలు చేతుల్లో ఉన్న వ్యక్తి సమస్యల్లో ఉన్న ప్రజలను గట్టెక్కించాల్సింది పోయి.. ఒకవైపు ధర్నాలు చేస్తుంటే తనకేమీ పట్టనట్టు పెట్టుబడులు పేరు చెప్పి విదేశాలకు చెక్కేయడం ఆక్షేపణీయం. అలా అని విదేశాల నుంచి ఏమైనా మూటలు కట్టుకొచ్చాడా అంటే అదీ లేదు. 2014 నుంచి చంద్రబాబు ఇప్పటి వరకు మూడున్నరేళ్ల కాలంలో దాదాపు 13 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. ఒక్కో దేశాన్ని నాలుగైదు సార్లు చుట్టొచ్చారు. వెళ్లిన ప్రతిసారీ కనీసం నాలుగైదు రోజులు తిరిగేసి వస్తుంటారు. కానీ ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకొచ్చిన పాపాన పోలేదు. వైయస్‌ఆర్‌ సీఎంగా ఉన్పప్పుడు వచ్చిన కంపెనీలు తప్ప ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు కాలేదు. అనుభవజ్ఞుడని చంద్రబాబుకు ప్రజలు అధికారం కట్టబెడితే జనం ఆశలు వమ్ము చేశారు. నవ్యాంధ్ర రాజధానికి దిక్సూచిగా నిలుస్తానని చెప్పుకుని జనం నెత్తిన శఠగోపం పెట్టేశాడు. 

మొన్నటి మండు వేసవిలో మే నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధరలపై భారీ ఉద్యమమే నడిచింది. మిర్చి ధరలు పతనం కావడంతో మధ్ధతు ధర కల్పించాలని కోరుతూ రైతులు పండించిన మిర్చిని నడిరోడ్డు మీద పడేసి కాల్చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మిర్చి ఘాటు కేంద్రాన్ని తాకింది. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ గుంటూరు మిర్చి యార్డులో భారీ ధర్నా నిర్వహించారు. మద్ధతు ధరపై ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే చంద్రబాబు మాత్రం రైతుల సమస్యలు తనకేమీ పట్టనట్టు అమెరికా పర్యటనకు వెళ్లారు. మే 4 నుంచి 11వ తేదీ వరకు అమెరికాలో పర్యటించి వచ్చారు. అయితే ఏం సాధించారు.. ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారని మాత్రం అడగొద్దు. ఎందుకంటే ఎందుకెళ్లాడో ఆయనకే తెలీదు. ఇపుడూ అంతే.. వరదలొచ్చి రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాయలసీమలో పంటలన్నీ నీట మునిగిపోయాయి. వాతావరణ శాఖ రాబోయే రెండు మూడు రోజుల్లో ఏపీకి తుపాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి స్థితిలో చంద్రబాబు మళ్లీ పెట్టుబడుల పేరుతో విదేశాలకు పయనమవుతున్నారు. ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు అమెరికా, లండన్, దుబాయ్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఒకపక్క ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు న్యాయం చేయాలని సమస్యలపై పోరాడుతుంటే చంద్రబాబుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. 

ఎన్నికలప్పుడైతే..
మొన్నటి నంద్యాల ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రి వర్గాన్ని మొత్తం నంద్యాల్లో మోహరించిన చంద్రబాబు వర్షాలతో పంటలు నష్టపోయి జనం అలమటిస్తుంటే వారిని పలకరించిన పాపాన పోవడం లేదు సరికదా ముఖ్యమంత్రినన్న సోయ కూడా లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ఎన్నికలొచ్చినప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పడమే తప్ప.. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఆ వైపుగా కన్నెత్తి చూడటం కూడా లేదు. ఇప్పుడు వెళ్లే విదేశీ పర్యటనలతో ఏం ఒరగబెట్టబోతున్నారంటే.. ఆలోచించాల్సిన పని కూడా ఉండదు. ఓ పక్క కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడుగుతోంది.. ఆయన మంచినీళ్లలా తన సొంత పనుల కోసం ఖర్చు చేశారు. పోలవరం, రాజధాని పనులు అటకెక్కాయి. ఇలాంటి స్థితిలో ఏం చేయబోతున్నారని రాష్ట్ర ప్రజలు నిలదీస్తారనే.... పబ్లిసిటీ స్టంట్‌ కోసం నాలుగు రోజులు విదేశాల్లో తిరిగొచ్చి.. వెనుక బస్సులో మూటలొస్తున్నాయని సోపేస్తారు. నెల రోజుల తర్వాత అంతా ఉత్తిదేనని జనానికి తెలిసిపోతుంది. అప్పటికీ మరో డ్రామా సిద్ధం చేసుకుంటారు. అంతే తప్ప జనానికి ప్రయోజనం మాత్రం శూన్యం. 
Back to Top