"ఛీ" మంతుడు

  • జనం సొమ్ముతో బాబు సోకులు
  • ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలు
  • కరువు ప్రాంతాల్లో హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వేలు
  • వరద ప్రాంతాల్లో భూమిపై కాలుమోపని ఏపీ సీఎం
  • వాస్తు పేరిట లక్షలాది రూపాయలు ఖర్చు
  • పుష్కరాలు, శంకుస్థాపనల పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం వృథా
  • లోటు బడ్జెట్‌లో బాబుకు పబ్లిసిటీ పిచ్చి 

ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబ్బంటే లెక్క లెక్కుండా పోయింది. నీళ్లలా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని మరింత అప్పుల్లో నెట్టుతున్నారు. జనం సొమ్ముతో జల్సా చేస్తూ రాష్ట్రాన్ని మరింత లోటులోకి తీసుకెళ్తున్నారు. శ్రీమంతుడు సినిమాలో హీరో మహేష్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే..ఏపీ సీఎం చంద్రబాబు విమానాల్లో తిరుగుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారు.

 బాబు ఎక్కడికెళ్లినా హంగూ ఆర్భాటాలు ఎంతమాత్రం తగ్గవు. ఏం చేసినా అందరూ చూడాలి.. ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటారు. నిత్యం సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం ఆయనకు  ఇష్టం. జనం సొమ్మన్నా.. వాటితో విలాసాలు చేసుకోవడమన్నా ఆయనకంత మోజు మరి. పైకేమో ఏపీ పేద రాష్ట్రం.. మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.. సర్దుకుపోవాలి అంటూనే ఆయన మాత్రం విలాసాల విషయంలో ఏమాత్రం తగ్గనే తగ్గరు. తనలాగే అందరూ నిజాయతీగా బ్రతకాలంటూ ఏటా ఆస్తులు ప్రకటిస్తుంటారు. అయితే ఆ ఆస్తుల్లో మాత్రం ఆయనెప్పుడు అప్పులే చూపిస్తారు. తాను పేదవాడిని చేతికి వాచీ కూడా లేదంటూనే వాస్తు దోషాల పేరుతో కోట్ల రూపాయల ఖర్చుకు వెనకాడరు. పుష్కరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, విచ్చలవిడిగా ప్రకటనలకు డబ్బులు ఖర్చు చేశారు. పట్టిసీమకు మూడు సార్లు శంకుస్థాపనలు, రాజధాని నిర్మాణానికి మూడు సార్లు పూజలు చేయడంతో ఇప్పటికే వేల కోట్ల నిధులు దుబారా చేశారు.

పేద రాష్ట్రానికి ధనిక సీఎం
అసలే రాష్ట్ర విభజనతో తీవ్ర లోటు బడ్జెట్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ ఉంది. సాయం చేస్తామన్న కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోయినా..చట్టంలోని ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టరు. పైగా కేంద్ర మంత్రులను సన్మానాలు, పొగడ్తలతో ముంచెత్తుతారు. అంతేందుకు తుళ్లూరులో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పక్క రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడానికి కూడా ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తిరగగలిగినంత శ్రీమంతుడు ఏపీ సీఎం చంద్రబాబు. వరదలతో సతమతం అవుతున్న బాధితులను కూడా హెలికాఫ్టర్లో వెళ్లి పరామర్శించేటంత దయాçహృదయుడు, మేధావి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక..రైతులు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే సీఎం మాత్రం హెలికాప్టర్‌లో వెళ్లి ఏరియల్‌ సర్వే చేసి వస్తారు. ఆకాశంలో తిరిగితే భూమిపై ఎండిన పంటలు కనిపిస్తాయా? నీట మునిగిన పైర్ల పరిస్థితి తెలుస్తుందా? ఈ మాత్రం కూడా తెలియని అనుభవశాలీ చంద్రబాబు. పెట్టుబడులు, రాజధాని నిర్మాణం పేరుతో విదేశాలకు బాబు అండ్‌ కో..ఇప్పటికే పలుమార్లు  విదేశీ యాత్రలు చేశారు. వీరు వెళ్లింది మాములు విమానాల్లో కాదు, ప్రత్యేక ఫైట్‌లో విదేశాలు చుట్టి వచ్చారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు ఉపయోగించడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఇంత తిరిగినా..రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలుగలేదు.

రిపేర్ల పేరుతో దుబారా
ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు వారుండటానికి కేంద్ర ప్రభుత్వం వసతి కోసం భవనాలను కేటాయిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఉండటానికి 1 జనపథ్‌లో ఒక భవనాన్ని కేటాయించింది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈ భవనం కేటాయించగా, తన స్థాయికి తగినట్టుగా ఆ భవనంలో హంగులు లేవని భావించినట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యమన్నట్టు ఆ భవనంలో సర్వ హంగులు ఏర్పాటు చేయడానికి రిపేర్ల పేరుతో ఒకటి కాదు రెండు కాదు... ప్రభుత్వం ఏకంగా రూ.5.82 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం (జీవో 2209) ఉత్తర్వులు జారీ చేసింది. 5.82 కోట్ల రూపాయలంటే... అతి పెద్ద కొత్త భవనమే నిర్మించొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం రిపేర్ల కోసం భారీ మొత్తం విడుదల చేయడం విస్మయపరుస్తోంది.

– లేక్‌వ్యూ కోసం సుమారు రూ.5కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు మదీనగూడలో కనీసం నెల రోజులు కూడా ఉండని ఓ ప్రైవేటు నివాసం కోసం రూ.1.32కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. 
– హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ లో నివాసానికి ప్రజాధనం ఉపయోగించారు. ప్రతి నెలాS లక్షలాది రూపాయల అద్దెను చెల్లించారు. 
– విజయవాడలోని లింగమనేని అక్రమ నివాసానికి భారీగా నిధులు వెచ్చించడమే కాకుండా ఇక్కడ రోడ్లు, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.30కోట్లు ఖర్చు చేశారు.
– విజయవాడలో తాత్కాలిక క్యాంపు కార్యాలయానికి రూ.40 కోట్లు వెచ్చించారు. 
– ప్రత్యేక విమానం కోసం ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే విమాన ప్రయాణాల కోసం సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌ లోటు బడ్జెట్‌లో ఉందంటూనే అన్ని రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ్ని పేదవాడంటారో.. శ్రీమంతుడంటారో.. ఛీమంతుడు అంటారో ఏమనాలో ఏపీ ప్రజలే నిర్ణయించాలి. 

చంద్రబాబు కుటుంబం ఆస్తులు అంతేనా? 
ఇటీవల చంద్రబాబు కుటుంబ ఆస్తులను ఆయన తనయుడు నారా లోకేష్‌ ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించిన ఆస్తుల వివరాలు చూస్తే అందులో నిజా నిజాలేంటో పసి పిల్లలకు కూడా అర్థమవుతాయి.  చంద్రబాబు నికర ఆస్తి విలువ రూ. 3 కోట్ల 73 లక్షలు
ప్రస్తుత ఆస్తులు రూ. 67 లక్షలు,  బ్యాంకు రుణం రూ. 3 కోట్ల 6 లక్షలు,  బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు రూ. 3లక్షల 59 వేలు, అంబాసిడర్‌ కారు విలువ రూ. లక్షా 52 వేలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ లెక్కలు వాస్తవానికి అందనంత దూరంలో ఉన్నాయి.   

ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులెక్కడివి?
నా చేతికి వాచ్‌ లేదు..జేబులో చిల్లిగవ్వ కూడా ఉండదని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు అన్ని కోట్ల డబ్బులెక్కవి. టీడీపీకి రాష్ట్రంలో ఫుల్‌ మెజార్టీ ఉన్నా..సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేని చంద్రబాబు ఎప్పుడు అధికారం చేజారిపోతుందోనన్న భయంతో ఎదుటి పార్టీకి చెందిన ఒక్కొ ఎమ్మెల్యేకు రూ.20 నుంచి రూ. 30 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇలా 20 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.600 కోట్లు వెచ్చించారు. ఈ డబ్బు ఎక్కడిది. అలాగే నిరుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఓ ఎమ్మెల్యేలకు రూ.5 కోట్లు లంచం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో అక్కడి ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు లంచం ఇస్తూ టీడీపీ నేత ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయినా ఇంతవరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజంగా చంద్రబాబు వద్ద డబ్బు లేకుంటే ఇవన్నీ ఎలా వచ్చాయి. తాను చెప్పిందంత నమ్మడానికి ప్రజలు అమాయకులు కారు.

రెండేళ్లలో 33 కుంభకోణాలు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల వ్యవధిలో 33 కుంభకోణాలు జరిగాయి. రూ.1.50 లక్షల కోట్ల అవినీతి సంపాదన ఉందని కుంభకోణాల వివరాలను ఆధారాలతో సహా ప్రచురించిన ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత ఢిల్లీ పెద్దలకు అందించారు. అందులో పేర్కొన్న ఒక్కో సంఘటన గురించి జగన్‌ వివరించినప్పుడు.. వారిలో విస్మయం వ్యక్తమయింది. అవినీతి, ఎమ్మెల్యేల కొనుగోళ్ల తీరును చూసి వారు ఆశ్చర్యపోయారు. అధికార పార్టీ అరాచకాలు మరింత పెచ్చుమీరి ప్రజాస్వామ్యాన్నే సవాలు చేసే ప్రమాదం ఉందనే ఆందోళన జాతీయ నేతల్లో వ్యక్తమైంది.
 
Back to Top