రాజధాని ఆశలు ఆవిరి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. అసలు రాజధాని నగరాన్ని ఎంపిక చేయడమే ఓ రహస్య పథకంలా చేసిన చంద్రబాబు నేటికీ వాటిని బయటపెట్టడం లేదు. ప్రపంచ రాజధానులను తలదన్నేలా అమరావతి నిర్మాణం అని మూడున్నరేళ్లుగా వింటున్న కాకమ్మ కథల్లో నిజం నేతిబీరలో నెయ్యిలాంటిది. 

అసలు రాజధాని నిర్మాణం జరగాలంటే భూసేకరణ, అంచెలంచల అభివృద్ధి ప్రధానంగా ఉంటాయి. కాని చంద్రబాబుది అడ్డోగోలు వ్యవహారం. దేశదేశాలు తిరగడం, ఎక్కడ ఏది చూస్తే అది అమరావతిలో ఉండాలని అధికారులను ఆదేశించడం. ఆచరణలో మాత్రం ఆవగింజంతైనా ముందుకు సాగకపోవడం ఇలా సాగుతున్నాయి అమరావతి కథలు. 

ఇటీవల భారత దేశంలో ఏర్పాటైన కొన్ని కొత్త నాగరాలను పరిశీలిస్తే రాజధాని అభివృద్ధి అంత సులువు కాదని అర్థం అవుతుంది. డెహ్రాడూన్, రాంచీ, నయారాయపూర్, చంఢీఘడ్ రాజధానులుగా ఏ మాత్రం అభివృద్ధి చెందలేకపోయాయి. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత తనదే అని బాబు చెప్పుకునేది కొత్త రాజధాని గురించి కాదని గుర్తించాలి. ఎన్నో ఏళ్లుగా ఈ పురాతన నగరం, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. దేశం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, శ్రామికులు, ఉద్యోగులు తమ ఆశలు మోసుకుంటూ వచ్చి రాజధాని నిర్మాణానికి తమ శ్రమను, డబ్బును, కాలాన్నీ ధారబోసారు. కాని కొత్త రాజధాని విషయం అలా కాదు. మౌలిక వసతుల దగ్గరనుంచి, పరిపాలన, వాణిజ్యం, నివాసం, రహదారులు, ప్రత్యేకతలు ఇలా అన్నిటినీ మొదటినుంచీ ఎంచుకోవాల్సిందే. 

కాని చంద్రబాబు ఈ విషయంలో దృష్టిపెట్టిందే లేదు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా పెట్టుబడులు కోరుతున్నాం అవిగో కోట్లు ఎగిరొస్తున్నాయిని చెప్పటమే తప్ప ఒక కోటి కూడా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కి ఇంత వరకూ వచ్చిందే లేదు. అప్పనంగా భూములు కట్టబెట్టేయడానికి వేల ఎకరాలైతే సేకరించి పెట్టారు కాని, మౌలిక వసతులు లేకుండా ఏ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావు. దానికి తోడు ఎలాంటి ప్రభుత్వం ఉందో కూడా పెట్టుబడిదారులు అంచనా వేసుకుంటారు. నిరంతరం అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచే ప్రభుత్వాలతో కలిసి పని చేయడానికి కార్పొరేట్లు సిద్ధంగా ఉండవు. వారి పెట్టుబడులకు, షేర్లకు రక్షణ ఉంటుందని భావించిన చోటే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కనీస సౌకర్యాల కల్పన లేకుండా, భూసేకరణలపై వివాదాలతో ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ అనుకుంటారు. నగరీకరణ విషయాల్లో ప్రేరణ కోసం ఇతర రాజధానులను పరిశీలించడం తప్పుకాదు…కానీ పరిశీలలోనే ఏళ్లు గడిచిపోతుంటే కనీస పనులు ఎప్పుడు జరగాలి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ఇంకా ఎన్నేళ్లు కలలు కంటూ ఉండాలో అని ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారు.  

తాజా ఫోటోలు

Back to Top